చిట్టా మొత్తం ఇచ్చేశారా?

చంద్రబాబు గురించి అందరికీ తెలిసిన మాట ఒకటి ఉంది. ఆయన రెండెకరాల ఆసామి అని. ఆ విషయం ఎపుడు ఎవరు ముందుగా చెప్పారో కానీ ఇప్పటికీ ఆయన్ని [more]

Update: 2020-02-11 03:30 GMT

చంద్రబాబు గురించి అందరికీ తెలిసిన మాట ఒకటి ఉంది. ఆయన రెండెకరాల ఆసామి అని. ఆ విషయం ఎపుడు ఎవరు ముందుగా చెప్పారో కానీ ఇప్పటికీ ఆయన్ని విమర్శించాలంటే ఆ మాటతోనే మొదలుపెడతారు. సరే ఒకనాడు చిరిగిన చొక్కాలతో, చెప్పులు లేకుండా తిరిగినా వారు సైతం తరువాత రోజుల్లో టాటా బిర్లాల స్థాయికి చేరుకోలేదా. అందువల్ల పేదవాడుగా పుట్టడం తప్పు అని ఎవరూ అనరు, అలాగే పెద్దవారు కావడమూ తప్పుకాదు, అయితే అది ఎలా జరిగింది, సక్రమంగా ఆస్తులు సంపాదించారా, లేక అక్రమంగా మూటలు పోగు చేసుకున్నారా అన్నదే ఇక్కడ పాయింట్. ఇపుడు ఏపీలో జగన్ మీద అక్రమాస్తుల కేసు ఓవైపు జోరుగా విచారణ సాగుతోంది. తాజాగా చంద్రబాబు మీద కూడా ఏసీబీ కోర్టులో అస్తుల కేసు విచారణ మొదలైంది.

300 జీతగాడిగా…?

ఈ కోర్టులో చంద్రబాబు అత్త, ఇప్పటి వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి ఫైల్ చేసిన కేసు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా చంద్రబాబు మీద‌ తాను వేసిన అస్తుల కేసుకు సంబంధించి లక్ష్మీ పార్వతి పూర్తి ఆధారాలతో పెద్ద చిట్టానే కోర్టుకు సమర్పించినట్లుగా చెబుతున్నారు. చంద్రబాబు 1978లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చంద్రగిరి నుంచి గెలిచారు నాడు ఎమ్మెల్యేగా ఆయన తొలి జీతం నెలకు మూడు వందల రూపాయలు. ఆ విధంగా ఉన్న చంద్రబాబు 2005 నాటికి వేల కోట్లు ఎలా సంపాదించారన్నది కూడా లక్ష్మీ పార్వతి కోర్టుకు అందించిన అస్తుల జాబితాలో పొందుపరచారట.

బాబే రుజువా…?

సాధారణంగా ఒక కేసులో ఒకరి మీద అభియోగం మోపాలంటే ఇతర మార్గాల ద్వారా సాక్ష్యాలు సేకరించాల్సిఉంటుంది. అయితే చంద్రబాబు ఆస్తుల కేసులో మాత్రం ఆయనే ఆధారం, ఆయనే రుజువు అవడం విశేష పరిణామమే. చంద్రబాబు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు, ఆయన చెప్పిన మాటలే ఇపుడు లక్ష్మీపార్వతి తన కేసులో ఆధారాలుగా పొందుపరచడం గమనార్హం. చంద్రబాబు తాను హెరిటేజ్ కంపెనీ ద్వారా సొంతంగా ఆదాయం సంపాదించుకుంటున్నానని, రాజకీయాల వల్ల కాదని చాలాసార్లు చెప్పారు. అదే చంద్రబాబు మరో సందర్భంలో తాను నెలకు 20 వేల జీతగాడిగా హెరిటే జ్ కంపెనీ నుంచి సొమ్ము తీసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాననీ చెప్పారు. మరో సందర్భంలో ఒక నెల పాటు మాత్రమే తాను హెరిటేజ్ సంస్థ జీతం తీసుకున్నానని, ఆ తరువాత అదీ తీసుకోవడం మానేశానని చెప్పారు. ఇలా వివిధ సందర్భాల్లో చంద్రబాబు చెప్పిన మాటలే ఇపుడు ఈ కేసులో లక్ష్మీ పార్వతి అస్త్రాలు అవుతున్నాయట.

వేల కోట్లు… ఎలా?

మరి చంద్రబాబు హెరిటేజ్ నుంచి జీతం తీసుకోక, వేరే ఆదాయ మార్గాలు లేక ఎలా వేల కోట్లను వెనకేశారన్నదే లక్ష్మీ పార్వతి కేసులో ప్రధాన పాయింట్. ఈ కేసు 2005లో వేశారు కాబట్టి ఆనాటి వరకూ చంద్రబాబుకు ఉన్న వేల కోట్ల ఆస్తుల జాబితాను కూడా లక్ష్మీ పార్వతి ఏసీబీ కోర్టుకు తాజాగా సమర్పించారు. ఎలా న్యాయబధ్ధంగా తాను ఇంత సొమ్ము సంపాదించానో ఏసీబీ కోర్టుకు చంద్రబాబు చెప్పుకోవాలన్నదే లక్ష్మీ పార్వతి డిమాండ్. అదే విధంగా చంద్రబాబు తాను ఎన్టీయార్ నుంచి పైసా కూడా కట్నం తీసుకోలేదని కూడా ఒక సందర్భంలో చెప్పుకొచ్చారట. ఇక చంద్రబాబుకు ఉన్న రెండెకరాలతో ఇన్ని ఆస్తులు ఎలా కూడబెట్టారని ఆమె లాజిక్ పాయింట్ తీస్తున్నారు. అంతే కాదు, తన మీద ఏసీబీ కోర్టులో కేసు రిజిస్టర్ కాకముందే హైకోర్టుకు ఆఘమేఘాల మీద వెళ్ళి ఎలా స్టే తెచ్చుకున్నారో కూడా చెప్పాలంటూ లక్ష్మీపార్వతి తన పిటిషన్లో కోరుతున్నారు. మొత్తానిక్ ఏసీబీ కోర్టులో విచారణ మొదలైంది, ఇది ముందు ముందు కొనసాగితే చంద్రబాబు సైతం ప్రతి శుక్రవారం కోర్టుకు రాకతప్పదని న్యాయ నిపుణులు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News