బాబూ…దెయ్యాలు దైవాలయ్యారా?

నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు గవర్నర్ ఇప్పుడు గుర్తుకొచ్చారు. ఆయన అధికారంలో ఉండగా గవర్నర్ వ్యవస్థను ఆయన గౌరవించలేదు.ఇది ఎవరో చెబుతున్న మాట కాదు. [more]

Update: 2019-09-19 11:00 GMT

నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు గవర్నర్ ఇప్పుడు గుర్తుకొచ్చారు. ఆయన అధికారంలో ఉండగా గవర్నర్ వ్యవస్థను ఆయన గౌరవించలేదు.ఇది ఎవరో చెబుతున్న మాట కాదు. ఆయనే స్వయంగా గవర్నర్ వ్యవస్థ పై మీడియా మీట్ లో మాట్లాడిన మాటలు. కేంద్ర చెప్పు చేతుల్లో గవర్నర్ వ్యవస్థ ను పూర్తిగా రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అప్పటి గవర్నర్ నరసింహన్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చెప్పినట్లు నడుచుకుంటున్నారన్నది చంద్రబాబు అప్పట్లో అనేక సార్లు ఆరోపణలు చేశారు.

గవర్నర్ వద్దకు వెళ్లడానికీ…..

ఒక దశలో చంద్రబాబునాయుడు గవర్నర్ వద్దకు వెళ్లడానికి కూడా ఇష్టపడలేదు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన అప్పటి గవర్నర్ నరసింహన్ మీద పెద్ద యుద్ధమే ప్రకటించారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీతో టీడీపీకి చెడిన తర్వాత ముక్యమంత్రి, మంత్రులకు గవర్నర్ అంటే విశ్వాసం లేదని తెలిపారు. రాష్ట్ర విషయాలను కేంద్రానికి అప్పటి గవర్నర్ నరసింహన్ చేరవేస్తున్నారని చంద్రబాబు అనుమానించారు. చంద్రబాబు ప్రకటించిన తర్వాత అప్పటి మంత్రులు ఇక ఆగలేదు. నేరుగా గవర్నర్ పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు.

పార్టీ మారిన వాళ్లని….

చంద్రబాబు తాను అధికారంలో ఉండగా అదే గవర్నర్ చేత రాజ్యాంగ విరుద్ధంగా కూడా కొన్ని కార్యక్రమాలు చేయించిన విషయాలు కొందరు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. 23 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడమే కాకుండా అందులో పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు. ఈ నలుగురి చేత అప్పటి గవర్నర్ ప్రమాణస్వీకారంచేయించారు. గవర్నర్ దీనిపై ఆరా తీసినా వారి రాజీనామాలు స్పీకర్ వద్ద ఉన్నాయని తెలిపారు. ఇలా తనకు అనుగుణంగా గవర్నర్ లను కొన్ని విషయాల్లో చంద్రబాబు వాడుకున్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్నారు.

ఇప్పుడు ఆయనే దిక్కు…..

కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు అదే గవర్నర్ చంద్రబాబుకు దిక్కయినట్లు కన్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కోడెల శివప్రసాద్ ఆత్మహత్య, కోడెలపై ఉన్న కేసులతో పాటు అనేక మంది తెలుగుదేశం పార్టీ నేతలపై నమోదవుతున్న కేసుల విషయాన్ని ప్రస్తుత గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. కోడెల కేసులను సీబీఐతో విచారించాలని ఆయన డిమాండ్ చేయడం విశేషం. కొద్ది నెలల క్రితమే గవర్నర్ వ్యవస్థపై మండిపడిన చంద్రబాబు అదే గవర్నర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయడం సోషల్ మీడియాలో బాబుపై సెటైర్లు పడుతున్నాయి. మరి చంద్రబాబుకు ఓటమి తర్వాత గవర్నర్ విలువ తెలిసొచ్చినట్లుంది.

Tags:    

Similar News