బాబు కూరుకుపోతున్నారా?

చంద్రబాబు చాలా గొప్పగా చెప్పుకుంటారు. తన మీద ఎవరూ ఏ ఒక్క కేసునూ నిరూపించలేదని, తాను సచ్చీలుడిని అని. అప్పట్లో వైఎస్సార్ తన మీద 26 కేసులు [more]

Update: 2020-02-07 05:00 GMT

చంద్రబాబు చాలా గొప్పగా చెప్పుకుంటారు. తన మీద ఎవరూ ఏ ఒక్క కేసునూ నిరూపించలేదని, తాను సచ్చీలుడిని అని. అప్పట్లో వైఎస్సార్ తన మీద 26 కేసులు పెడితే ఎక్కడా తాను తప్పుకు దొరకలేదని కూడా చంద్రబాబు బాగా ప్రచారం చేసుకుంటారు. అబ్బకు చేతగానిది కొడుకు జగన్ తనను ఏం చేయగలరని కూడా చంద్రబాబు డంబాలు పలుకుతారు. ఇక తొమ్మిది నెలల వైసీపీ పాలనలో కొండను తవ్వి ఎలకను కాదు కదా ఎలక వెంట్రుకను కూడా పట్టుకోలేకపోయారని కూడా బాబు ఎగతాళీ చేస్తూంటే జగన్ పార్టీ వారికి వినేందుకు అది బహు కష్టంగా ఉంటుంది మరి. ఇన్సైడ్ ట్రేడింగ్ అని మాటలు చెప్పడమే కానీ ఒక్కటైనా నిరూపించారా తమ్ముళ్ళూ అంటూ బాబు నిగ్గదీసి అడుగుతూ ఉంటే సైలెంట్ గా ఉండడమే ఫ్యాన్ పార్టీ అధినేతలకు మిగిలింది.

తోక దొరికిందా?

అటువంటి చంద్రబాబుకు ఇపుడు చుక్కలు కనిపించేలా చేసేందుకు తెర వెనక గట్టి కసరత్తు జరుగుతోందా అన్న సందేహాలు వస్తున్నాయి. చంద్రబాబుకు పీఏగా పనిచేసిన శ్రీనివాస్ ఇంట్లో హఠాత్తుగా ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేయడంతో ఒక్కసారి టీడీపీ పెద్దల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఉరమని మెరుపులా, నెత్తిన పడిన పిడుగులా పసుపు తమ్ముళ్ళు తాజా పరిణామంతో బెంబేలెత్తుతున్నారు. విజయవాడ, హైదరాబాద్ లలో ఏకకాలంలో జరిగిన ఈ సోదాలో అనేక కీలక పత్రాలను సైతం ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతే కాదు, ఆదాయాన్ని మించి భాగానే ఆస్తులు ఉన్నట్లుగా కూడా గుర్తించారు. శ్రీనివాస్ ఆదాయపన్ను శాఖ అదికారులకు ఏ విషయాలు చెప్పారో,దాని పరిణామాలు ఎలా ఉంటాయో అన్న ఉత్కంఠ ఏర్పడింది. మరి ఇలా కీలక డాక్యుమెంట్లు అన్నీ తమ వద్ద దొరకబుచ్చుకుని ఐటీ అధికారులు ఏంచేస్తారోనన్నదే ఇపుడు పసుపు పార్టీ పెద్దలకు దడ పుట్టిస్తోందట.

ఎన్నిల వేళ ఆయనే….

ఇదిలా ఉండగా 2019 ఎన్నికల వేళ అతి ముఖ్యమైన యుధ్ధంలో చంద్రబాబు పక్కనే ఉండడం కాదు ఆయనకు పీఏగా శ్రీనివాస్ పనిచేసారు. దాంతో శ్రీనివాస్ ఆస్తులు, ఆయన ఆదాయలు, ఆయన పరిచయాలు ఇవన్నీ కూడా ఐటీ అధికారుల లెక్కల్లోనుంచి తప్పించుకునే అవకాశాలు లేవని అంటున్నారు. ఇక చంద్రబాబు సీఎంగా ఉంటే ఆయన పక్కన కనిపించే శ్రీనివాస్ కు అన్ని విషయ‌లూ తెలుసు అన్నది కూడా ఇపుడు టీడీపీ తమ్ముళ్ళకు ఎక్కడో తడిసిపోయేలా చేస్తోందిట. మొత్తానికి ఎలక వెంట్రుకను కూడా పట్టుకోలేకపోయారు అంటూ నిన్నటికి నిన్న ఎకసెక్కం ఆడిన చంద్రబాబుకు ఇపుడు తన వద్దనే ఉన్న ఒక ఎలుక సాక్ష్యంగా మారబోతోందా అనిపించే పరిస్థితి ఏర్పడింది మరి.

అటు నుంచి అలా….

మరో వైపు అమరావతి భూముల విషయంలో ఈడీ కళ్ళు ఇటు వైపే చూస్తున్నాయి. ఇక్కడ మనీ ల్యాండరింగ్ కూడా జరిగినట్లుగా పక్కా ఆధారాలను సేకరించిన సీఐడీ ఈడీకి అన్ని గుట్లు మట్లూ అందించింది. ఇంకో వైపు నిండు పార్లమెంట్ లో వైసీపీ పక్ష నేత మిధున్ రెడ్డి ఏకంగా అమరావతి స్కాం మీద సీబీఐ విచారణ జరిపించాలని గట్టిగా కోరారు. మూడు రాజధానుల విషయంలో బీజేపీ సానుకూలంగా ఉండడంతో మోడీయే జగన్ ద్వారా అమరావతి రాజధాని కుంభకోణం కధను వెలికి తీయిస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మొత్తం మీద చూసుకుంటే చిందంబరం లాంటి పెద్ద మనిషినే యాభై రోజుల దగ్గరగా కటకటాల పాలు చేసిన మోడీ షాలకు చంద్రబాబు ఇపుడు టార్గెట్ అవుతున్నారా అన్న డౌట్లూ వస్తున్నాయి మరి. ఏపీలో రాజకీయంగా చూసుకున్నా కూడా చంద్రబాబు దెబ్బతినిపోవడం బీజేపీకి కావాలి. రెండు బలమైన ప్రాంతీయ పార్టీల నేతల్లో ఒకరు పక్కకు తప్పుకుంటే భారీ స్పేస్ ఏర్పడుతుంది.

టార్గెట్ ఆయనేనట…

జగన్ విషయం తీసుకుంటే కొత్తగా అధికారంలోకి వచ్చారు. పైగా యువకుడు. ఆయన్ని ఇబ్బంది పెట్టినా ఎదురుకొడుతుంది. పైగా అయన కేంద్రంతో సానుకూలంగానే ఉన్నారన్న ప్రచారమూ ఉంది. మరో వైపు చంద్రబాబు మాత్రం ఎప్పుడు ఎలాంటి రంగులు చూపిస్తారో మోడీ షాలకు తెలియనిది కాదు. ఆయనకు కాస్తా చాన్స్ ఇస్తే ఢిల్లీ పీఠానికే ముప్పు తెచ్చే రకమని నిన్నటి ఎన్నికల ముందు జరిగిన కధ పక్కా క్లారిటీగా చెప్పేసింది. పైగా మోడీ, షాలను తూలనాడిన చరిత్రా చంద్రబాబుకు ఉంది. బాబు సచ్చీలుడు అవునో కాదో తెలియదు కానీ ఆయన మీద 18 దాకా కేసుల్లో స్టేలు ఉన్నాయి. ఈ ఒక్కటీ చాలు చంద్రబాబు తన కేసులను ఆపుకుంటున్నారు తప్ప విచారణకు సిధ్ధం కావడం లేదని, వీటిని అన్నీ చూసుకున్నపుడు బీజేపీ తెలివిగానే పావులు కదుపుతోందని అంటున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసేనాటికి ఏపీ రాజకీయాల్లో కీలకమైన పరిణామాలే చోటు చేసుకుంటాయని అంటున్నారు. అవేంటో రాజకీయ వెండి తెర మీదనే అంతా చూడాలి మరి.

Tags:    

Similar News