పగోడికి కూడా వద్దు

చంద్రబాబు రాజకీయ తెలివి,చాణక్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రెండు ఎకరాల ఆసామిగా, మధ్యతరగతి యువకుడిగా జీవితం ప్రారంభించిన చంద్రబాబు తనకున్న మేధస్సుతోనే నాటి ఇందిరా కాంగ్రెస్ [more]

Update: 2020-02-04 11:00 GMT

చంద్రబాబు రాజకీయ తెలివి,చాణక్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రెండు ఎకరాల ఆసామిగా, మధ్యతరగతి యువకుడిగా జీవితం ప్రారంభించిన చంద్రబాబు తనకున్న మేధస్సుతోనే నాటి ఇందిరా కాంగ్రెస్ ని ఆకట్టుకుని టికెట్ సంపాదించుకున్నారు. ఎమ్మెల్యేగా నెగ్గడమే కాదు, తనకున్న పలుకుబడి, రాజకీయ లౌక్యంతో మంత్రి కూడా కాగలిగారు. ఇదంతా వెనకాల ఎవరి అండదండలూ లేకుండానే చంద్రబాబు సాధించిన విజయాలు. ఇక చంద్రబాబు ఎన్టీఆర్ కుమార్తెను వివాహం చేసుకోవడానికి కూడా ఆ మంత్రి పదవి నిచ్చెనలా ఉపయోగపడింది. ఆ తరువాత కధ అందరికీ తెలిసిందే. టీడీపీలో చిన్నల్లుడిగా చేరిన చంద్రబాబు ఆఖరుకు అదే పార్టీని స్వాధీనం చేసుకుని ముఖ్యమంత్రిగా ఎదిగిన తీరు లోక విదితం. ఇందులో మంచి చెడులు పక్కన పెడితే చంద్రబాబు రాజకీయ నైపుణ్యం అడుగడుగునా ఆయన ఎదుగుదలలో కనిపిస్తుంది

ఒట్టి వారసుడే….

ఇక చంద్రబాబు రాజకీయ జీవిత చరమాంకంలో ఉన్నారని ప్రత్యర్ధులు అంటున్నారు. ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. వయసు కూడా డెబ్బై దాటింది. మునుపటి చురుకుదనం లేదు. అయినా ఆయన పోరాడాల్సిన దుస్థితి. తన కొడుకుతో సమానం అయిన జగన్ తోనే ఆయన యుధ్ధం చేస్తున్నారు. ఈ విషయంలో ఆయనకు లోకేష్ ఏ మాత్రం సహకరిస్తున్నాడు అన్నది చూసిన‌పుడు నిరాశే సమాధానం అవుతుంది. లోకేష్ చంద్రబాబుకు మాత్రమే వారసుడు కానీ పార్టీకి కాదని టీడీపీలోనే వినిపిస్తున్న మాట. పార్టీని వీడి బయటకు పోయిన మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అయితే టీడీపీని నడపడం లోకేష్ వల్ల కానే కాదని అంటున్నారు. అదే పార్టీలో సీనియర్ నేతగా ఉన్న యనమల రామకృష్ణుడు కూడా టీడీపీకి చంద్రబాబు తరువాత నాయకుడు అన్నది ఇంకా తేలని వ్యవహారమే అంటున్నారు. అంటే లోకేష్ భావి నాయకుడు ఇప్పటికైతే కాదని యనమల కూడా చెబుతున్నారు.

బాలయ్య అలా…

ఇక చంద్రబాబు గారి బావమరిది, అన్న గారి కుమారుడు ఈ రెండు ట్యాగులు తప్ప సొంతంగా పార్టీపైన తనదైన ముద్ర వేసిన దాఖలాలు అయితే నందమూరి బాలయ్యలో లేనేలేవు. బాలకృష్ణ సినిమాలో తండ్రికి కొంత మేర వారసుడు అనిపించుకున్నా రాజకీయాల్లో మాత్రం ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోతున్నారు. ఆయన పార్టీ రాజకీయల మీద కూడా ఎపుడూ సీరియస్ గా ఉన్న సందర్భాలు లేవు. ఆయన మాటల్లో తడబాట్లు, ఆయన ఆలోచనలో అపరిపక్వత వంటివి చూసినపుడు ఏ విధంగానూ నాయకుడు కాలేడని అంతా అంటారు. చంద్రబాబులోనూ ఈ రకమైన అభిప్రాయమే ఉందని చెబుతారు.

భారమేనా..?

ఓ వైపు కుమారుడు లోకేష్, మరో వైపు బావమరిది ఇద్దరూ ఉన్నా కూడా పార్టీ భారం మాత్రం చంద్రబాబే మోయాల్సిరావడం బాధాకరమే. చేదోడు వాదోడుగా ఉండాల్సిన ఈ ఇద్దరూ ఏది మాట్లాడితే ఏమవుతుందోనన్న కంగారు ముందు చంద్రబాబుకే ఉంది. వారు సైతం తమ ప్రసంగాలు, చేతలతో నగుబాట్లే తెస్తున్నారు. ప్రత్యర్ధులకు సులువుగా దొరికిపోతున్నారు. దాంతో కనీసం కొన్ని బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు అనుకున్నా వారి వ్యవహార శైలి భయపెడుతోందని టీడీపీలో వినిపిస్తున్న మాట. ఈ ఇద్దరూ తప్ప పార్టీలో చంద్రబాబుకు నమ్మకస్తులు లేరు. తన హయాం వరకూ బాగానే ఉన్నా ఆ తరువాత పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో, ఎవరు తన్నుకుపోతారో అన్న భయం బెంగా చంద్రబాబులో ఉన్నాయని చెబుతారు. మొత్తానికి టీడీపీని తన ఆస్తిగా భావించి చంద్రబాబు ఇంతలా తీర్చిదిద్దినా భావి వారసత్వం లేక బిక్కచచ్చిపోతున్న పరిస్థితి కళ్ళ ముందే ఉంది నిజంగా ఇది పగవారికి కూడా రాకూడని అనుభవమేనని తమ్ముళ్ళు అంటున్నారు.

Tags:    

Similar News