ఆకర్ష్ కు బ్రేక్.. బాబు బిందాస్?

నిన్న మొన్నటి వరకూ అధికార పార్టీ వైసీపీ వైపు చూసేవారు టీడీపీ ఎమ్మెల్యేలు. చంద్రబాబు కూడా ఎవరు ఎప్పుడు జారిపోతారోనన్న ఆందోళనలో ఉండేవారు. ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు [more]

Update: 2020-02-01 05:00 GMT

నిన్న మొన్నటి వరకూ అధికార పార్టీ వైసీపీ వైపు చూసేవారు టీడీపీ ఎమ్మెల్యేలు. చంద్రబాబు కూడా ఎవరు ఎప్పుడు జారిపోతారోనన్న ఆందోళనలో ఉండేవారు. ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు చంద్రబాబు నిత్యం ఫోన్లలోనైనా టచ్ లో ఉండేవారు. అంతేకాదు పార్టీ ప్రజల్లో ఉందనే నమ్మకం కల్గించడం కోసం అనేక కార్యక్రమాలకు పిలుపునిచ్చి ఎమ్మెల్యేలను ఖాళీగా లేకుండా చంద్రబాబు చేసేవారు. అయితే ఇప్పుడు చంద్రబాబు బిందాస్ గా ఉండొచ్చు. దీనికి కారణం మూడు రాజధానులే.

ఇద్దరు ఎమ్మెల్యేలు….

వైసీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కు చంద్రబాబు బెంబేలెత్తి పోయారు. తనకు నమ్మకంగా ఉన్న వల్లభనేని వంశీ జంప్ అయిపోయారు. అలాగే విశ్వాసంతో ఉన్న మద్దాలి గిరి కూడా గుడ్ బై చెప్పేశారు. ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు వెళ్లిపోవడంతో చంద్రబాబు ప్రతిపక్ష హోదాకు ఎర్త్ పెడుతున్నారన్నది అర్థమయింది. ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సయితం టీడీపీని వీడతారన్న ప్రచారం జోరుగా సాగింది.

మూడు రాజధానులతో…..

అయితే ఏపీ ముఖ్యమంత్రి మూడు రాజధానుల ప్రతిపాదనను తెరమీదకు తీసుకురాగానే ఆకర్ష్ కు బ్రేకులుపడ్డట్టేనని చెప్పాలి. అమరావతి రాజధాని అంశం చంద్రబాబుకు కలసి వచ్చింది. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో తమకు అధికారం రావడం ఖాయమన్న భావనలో ఇప్పటికే టీడీపీ నేతలు వచ్చేశారు. రాజధాని, శాసనమండలి రద్దు వంటి అంశాలతో పాటు జగన్ ఏకపక్ష నిర్ణయాలు తమకు భవిష్యత్తులో రాజకీయంగా మేలు చేస్తాయని అంచనాకు వచ్చేశారు.

యాక్టివ్ గా మారడంతో….

దీంతో అధికార వైసీపీలో చేరాలని అన్నీ సిద్ధం చేసుకున్న వారు సయితం వెనుకంజ వేశారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా కన్పిస్తుండటమే ఇందుకు కారణం. అలాగే ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు కూడా పార్టీలో సెట్ అయిపోయినట్లే కన్పిస్తున్నారు. సో.. ఇక టీడీపీ నుంచి వెళ్లిపోయే ఎమ్మెల్యేలు లేరనే చెప్పాలి. సమావేశాలకు ఠంఛనుగా హాజరవుతున్నారు. మొత్తం మీద వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు బ్రేకులు పడటంతో చంద్రబాబు ఊపిరి పీల్చుకున్నట్లయింది. చంద్రబాబు ప్రతిపక్ష హోదాకు కూడా ఇక ఢోకా లేనట్లేనని తమ్ముళ్లు తెగ సంబరపడి పోతున్నారు.

Tags:    

Similar News