సౌండ్ లేకుండా చేశారే

నిన్నటి సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ళ ముందు జగన్ అసెంబ్లీ ముఖం చూడడం మానుకున్నారు. దాని మీద అప్పట్లో చంద్రబాబు అండ్ కో చేసిన నానా యాగీ, చెప్పిన [more]

Update: 2020-01-27 15:30 GMT

నిన్నటి సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ళ ముందు జగన్ అసెంబ్లీ ముఖం చూడడం మానుకున్నారు. దాని మీద అప్పట్లో చంద్రబాబు అండ్ కో చేసిన నానా యాగీ, చెప్పిన నీతి సూత్రాలు ఇప్పటికీ రాజకీయాలపైన అసక్తి ఉన్న వారి చెవుల్లో మారుమోగుతుంటాయి. అసెంబ్లీ దేవాలయమని, అటువంటి దాన్ని కాదని జగన్ రోడ్డున పడ్డాడని, ప్రజా సమస్యల పట్ల ఆయనకు అసలు గౌరవం, మర్యాదా లేవని కూడా ఒక్క లెక్కన తమ్ముళ్ళు ఆడిపోసుకున్నారు. అసెంబ్లీ అంటే ఇష్టం లేకపోతే డుమ్మా కొట్టడం కాదు, ఏకంగా రాజీనామా చేసి ఇంటికి పోవచ్చుగా అంటూ సెటైర్లు విసిరారు. సీన్ కట్ చేస్తే ఇపుడు చంద్రబాబు అసెంబ్లీ ముఖం చూడడంలేదు. స్కూలుకి వెళ్ళనంటూ మొరాయించే అయిదేళ్ళ చిన్నారిలా ఆ వైపు వెళ్ళాలంటేనే భయపడిపోతున్నారు.

ఏడు నెలల్లోనే….

ప్రతిపక్ష నేతగా జగన్ అసెంబ్లీకి నమస్కారం పెట్టడానికి మూడేళ్ళు పడితే బాబుకు మాత్రం ఏడు నెలల్లోనే సీన్ అర్ధమైపోయింది. జగన్ అలా చుక్కలు చూపించేస్తున్నారు. దాంతో దేవాలయం లాంటి అసెంబ్లీకి వరస సెలవులు పెడుతూ బాబు తెర వెనక్కు పోతున్నారు. నిజానికి అసెంబ్లీ అంటే అతి ఉత్సాహం ప్రదర్శించే చంద్రబాబుకు ఇంతలా విరక్తి కలగడానికి జగన్ వేస్తున్న ఎత్తులు పై ఎత్తులే కారణమని చెప్పుకోవాలేమో. ఈసారి ప్రత్యేక సమావేశాల పేరిట సభను అయిదు రోజుల పాటు నిర్వహిస్తే అందులో రెండు రోజులు చంద్రబాబుతో పాటు తమ్ముళ్ళు గైరు హాజరయ్యారంటేనే రాబోయే రోజుల గురించి ఊహించుకోవచ్చు.

గ్యాలరీ ఎక్కించారు….

ఇక చంద్రబాబుని శాసనమండలిలో గ్యాలరీ ఎక్కించిన ఘనత కూడా జగన్ దేనని వైసీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు ఇక ఎక్కాల్సింది అసెంబ్లీ గ్యాలరీలేనట. అంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కూడా భవిష్యత్తులో ఆయన గెలిచి అడుగు పెట్టడం పెద్ద డౌట్ అన్నది వైసీపీ నాయకుల భావనేమో. ముఖ్యమంత్రి హోదాలో ఇలా అసెంబ్లీ అంటే ఉరుకులు పరుగులతో వచ్చే చంద్రబాబు జగన్ సీఎం అయ్యాక మొదట తాను ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉండనని మారాం చేసారు. మరి ఎలాగోలా సర్దుకుని అసెంబ్లీకి వచ్చినా ఇప్పటివరకూ ఆయన సభలో గట్టిగా సర్కార్ ని ఇరుకునపెట్టిన దాఖలాలు అయితే లేవు. పైగా ఆయన ప్రతీ విషయంలో కార్నర్ అవుతున్నారు. ఇక వైసీపీ వేసే బాణాలతో బాబు చితికి చిత్తవుతున్నారు.

గత పాపాలేనా…?

చంద్రబాబు దశాబ్దాల అనుభవమే ఇపుడు భయపెడుతోంది. ఏ విషయం మీద అయినా చంద్రబాబు వైసీపీ సర్కార్ని విమర్శించాలనుకున్నా అది ఎదురుకొడుతోంది. పలు సందర్భాల్లో గతంలో ఆయన అన్న మాటలను జాగ్రత్తగా అసెంబ్లీ తెర మీద ఉంచి వైసీపీ ప్రభుత్వ పెద్దలు ప్లే చేస్తుంటే చంద్రబాబు గారు గుక్క తిప్పుకోలేకపోతున్నారు. ఫిరాయింపులపై చర్చ అయినా, అవినీతి బాగోతాలైనా, ఆఖరుకు మండలి రద్దు వంటి కీలక అంశ‌మైనా కూడా చంద్రబాబు వద్ద నో సౌండ్ అన్నంతగా వైసీపీ ఉచ్చు బిగించేసింది. 2004 లో మండలి వద్దు అన్న చంద్రబాబు ఇపుడు ముద్దు అంటున్నారు. దాంతోనే ఆయన సభకు హాజరై తన పార్టీ స్టాండ్ ఇదీ అని వాదించలేకపోయారు. దాంతో ఇండైరెక్ట్ గా మండలి రద్దుకు మద్దతు ఇచ్చినట్లైంది. ఇదే తీరున జగన్ దూకుడు ఉంటే ఫ్యూచర్లో చంద్రబాబు అసెంబ్లీకి వచ్చే అవకాశాలు ఇంకా తగ్గిపోతాయేమో.

Tags:    

Similar News