బాబులో అందుకే గాబరా

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యూహాలను రచించడంలో దిట్ట. అలాగే మైండ్ గేమ్ లోనూ ఆయనను కొట్టేవారే లేరు. శాసనమండలి రద్దు అయ్యే సంకేతాలు కన్పించడం, ప్రభుత్వం ఆ [more]

Update: 2020-01-25 05:00 GMT

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యూహాలను రచించడంలో దిట్ట. అలాగే మైండ్ గేమ్ లోనూ ఆయనను కొట్టేవారే లేరు. శాసనమండలి రద్దు అయ్యే సంకేతాలు కన్పించడం, ప్రభుత్వం ఆ దిశగా వెళుతుండటంతో టీడీపీ ఎమ్మెల్సీలు జారి పోతారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పోతుల సునీత వైసీపీ కండువా కప్పేసుకున్నారు. శివనాధ్ రెడ్డి సయితం అదే దారిలో ఉన్నారు. డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా చేశారు. మరికొందరు వైసీపీ నేతలకు టచ్ లో ఉన్నారు.

పదవులు పోతాయని….

ప్రధానంగా స్వతంత్రంగా ఉన్న ఎమ్మెల్సీలు ఆందోళనలో ఉన్నారు. శాసనమండలి రద్దయితే తమ పదవులకు ఎసరు వస్తుందని భావించిన వారు టీడీపీ ఎమ్మెల్సీలతో వారే రాయబారం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీతో కూడా ఆ నేతలు టచ్ లోకి వెళ్లి మండలిని రద్దు చేయవద్దని తాము ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పినట్లు తెలిసింది. అయితే దీనికి వైసీపీ నుంచి కొన్ని షరతులు పెట్టినట్లు చెబుతున్నారు. షరీఫ్ ను శాసనమండలి ఛైర్మన్ పదవి నుంచి దింపేసి వైసీీపీ ఎమ్మెల్సీని కూర్చోబెట్టడమే ప్రధాన షరతు. అయితే అతి స్వల్ప సంఖ్యలో ఉన్న వైసీపీకి ఈ పదవి దక్కుతుందా? లేదా? అన్న దానిపై కొందరు ఎమ్మెల్సీలు చర్చలు జరపుతున్నారు.

బలం లభిస్తే….

శాసనమండలిలో తమకు బలం లభిస్తే రద్దు చేయమన్న హామీని కొందరు ఎమ్మెల్సీలకు ఇప్పటికే లభించిందంటున్నారు. అయితే టీడీపీ ఎమ్మెల్సీలు వెళతారా? లేదా? అన్నది పక్కన పెడితే మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో చంద్రబాబులో కొంత గాబరా కనపడుతుంది. అందుకే ఆయన తమ ఎమ్మెల్సీలకు పెద్దయెత్తున వైసీపీ ఆఫర్లు ఇచ్చారని ఆరోపించారు. ఫ్లాట్లు, కోట్ల రూపాయల నగదును కూడా వైసీపీ ఆఫర్ చేసినా టీడీపీ ఎమ్మెల్సీలు వెళ్లలేదని చెప్పారు.

అందుకే బాబు భరోసా…..

అంతేకాదు ఒకవేళ రద్దు చేసినా మరో ఒకటిన్నర, రెండున్నరేళ్లు ఎమ్మెల్సీ పదవిలోనే ఉంటారని, రద్దు ఇప్పటికిప్పుడు కాదని భరోసా కల్పించారు. మరో రెండేళ్లకు తిరిగి తాము అధికారంలోకి వచ్చి శాసనమండలిని పునరుద్ధరిస్తామని కూడా తెలిపారు. అంతేకాదు ఇప్పుడు త్యాగం చేసిన వారికి ఖచ్చితంగా పదవులు లభిస్తాయని కూడా చంద్రబాబు నేరుగా హామీ ఇవ్వడం విశేషం. భవిష్యత్ మనదే అని భరోసా కల్పించడంలోనే చంద్రబాబు గాబరా పడుతున్నారని అర్థమవుతోంది.

Tags:    

Similar News