ఊడ్చిపెట్టుకుపోయినట్లేనా?

ఇంతకాలం ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ తాను లేస్తే మనిషిని కానన్నట్లుగా చంద్రబాబు పెద్ద స్పీచులే ఇచ్చారు. ఆయన గతంలో ఉమ్మడి ఏపీలో ప్రతిపక్షంలో ఉన్నపుడు [more]

Update: 2020-01-21 12:30 GMT

ఇంతకాలం ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ తాను లేస్తే మనిషిని కానన్నట్లుగా చంద్రబాబు పెద్ద స్పీచులే ఇచ్చారు. ఆయన గతంలో ఉమ్మడి ఏపీలో ప్రతిపక్షంలో ఉన్నపుడు పెద్దగా పోరాటలు చేసి ఫలితాలు సాధించినవి లేకపోయినా మరీ ఇంతలా తగ్గిపోయిన సంఘటనలు మాత్రం లేవనే చెప్పాలి. తన కొడుకు వయసు వాడైన జగన్ సీఎంగా ఉన్న ఏపీలో చంద్రబాబుకు ఎనిమిది నెలల పాలనలోనే చుక్కలు చూపిస్తున్నారు. చంద్రబాబు రాజకీయం ఎక్కడికక్కడ ఫెయిల్ కావడమే కాదు ఆయన పోరాటం పూర్తిగా నీరుకారుతోంది.

చేతులెత్తేశారుగా…?

నెల రోజుల పాటు అమరావతి ఉద్యమాన్ని తెర వెనక నుంచి నడిపించిన చంద్రబాబు అంతన్నాడు, ఇంతన్నాడు అన్నట్లుగా చివరకు చేతులెత్తేశారు. అసెంబ్లీలో చంద్రబాబు ప్రసంగం చప్పగా సాగింది. ఆయన అమరావతి రాజధానిగా ఎందుకు కొనసాగించాలో స్పష్టంగా చెప్పలేకపోయారు. అలాగే తాను ఎందుకు అక్కడే రాజధానిని ఎంపిక చేశాను అన్న దాని మీద నమ్మతగ్గ విషయాలు సభ ముందుంచలేకపొయారు. మరో వైపు విశాఖ, ఉత్తరాంధ్రుల ఆవేదన, వెనకబాటుతనం మీకు పట్టదా బాబూ అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు చెడుగుడు ఆడుతూంటే చంద్రబాబు కార్నర్ అయ్యారు. చాలా బేలగా, జాలిగా సాగిన చంద్రబాబు స్పీచ్ చూసిన అమరావతి రైతులకు భ్రమలన్నీ చంద్రబాబు అలా తొలగించేశారు. తనని నమ్ముకుంటే క్లైమాక్స్ ఇంతేనని ఆయన చెప్పకనే చెప్పేశారు.

ఇదేనా రాజకీయం…?

చంద్రబాబు అనుభవం ముందు జగన్ వయసు ఎటూ చాలదు, కానీ జగన్ ఎత్తుల ముందు మాత్రం చంద్రబాబు చిత్తు వరసగా అవుతున్నారు. మాటి మాటికీ మందబలం ఉంది కాబట్టి తీర్మానం ఆమోదించుకోండి అంటూ బేలగా చంద్రబాబు చెబుతున్నారే తప్ప తన వాదనలో పస ఎంత అన్నది ఆయన చెప్పలేకపోయారు. అమరావతి అంటూ పట్టుకుని నెల రోజుల పాటు అక్కడే ఉద్యమాలు చేసిన చంద్రబాబు అసెంబ్లీలో కళ్ళు తెరిచేసరికి కీలకమైన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఎంత వ్యతిరేకత వచ్చిందీ తెలిసి మౌనం దాల్చారు. అన్ని ప్రాంతాల నేతగా ఉండాల్సిన పెద్దాయన అసెంబ్లీ వేదికగా అమరావతిని గట్టిగా సమర్ధించలేక మిగిలిన ప్రాంతాలకు చెడ్డ కాలేక మమ అనిపించేశారు.

ఒంటరిగానే….

ఈ మూడు రాజధానుల పోరు మొత్తం ఎపిసోడ్ తీసుకుంటే రాజకీయంగా చంద్రబాబు ఒంటరి అయ్యారన్నది క్లారిటీగా తేలిపోయింది. కేంద్రం వత్తాసు పలుకుతుందని, మోడీ అండగా ఉంటారని పడ్డ ఆశలు అడియాసలు అయ్యాయి. పవన్ సైతం తన వైపునకు వస్తారనుకున్నా ఆయన ఎంచక్కా బీజేపీ చెంకనెక్కి కూర్చున్నారు. ఒక్క నెలరోజుల పరిణామాల్లో చంద్రబాబు రాజకీయంగా మరింతగా గ్రాఫ్ తగ్గించుకున్నారు. ఆయన‌ది ఒంటరి పోరు అయింది. ఆయన్ని నమ్ముకున్న అమరావతి రైతులు కూడా మరో ఆర్టీసీ కార్మికులు అయ్యారు. రేపటి రోజుల ఎటూ ప్రభుత్వం వారితో చర్చలు జరుపుతుంది, అక్కడ వారి డిమాండ్లు పరిష్కారం అయితే చంద్రబాబు ఊసు కూడా అమరావతి గ్రామాల్లో ఇక వినిపించదేమో.

Tags:    

Similar News