బాబుకు అండ ఏదీ?

రాజ‌ధాని అమ‌రావ‌తి కోసం అహ‌ర‌హం శ్రమిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సీఎంగా ఉన్నప్పుడు ఆయ‌న ఏవిధంగా క‌ష్టప‌డ్డాన‌ని చెప్పుకొన్నారో ఇప్పుడు రాజ‌ధాని కోసం కూడా అదే రేంజ్‌లో [more]

Update: 2020-01-19 17:30 GMT

రాజ‌ధాని అమ‌రావ‌తి కోసం అహ‌ర‌హం శ్రమిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సీఎంగా ఉన్నప్పుడు ఆయ‌న ఏవిధంగా క‌ష్టప‌డ్డాన‌ని చెప్పుకొన్నారో ఇప్పుడు రాజ‌ధాని కోసం కూడా అదే రేంజ్‌లో దూసుకుపో తున్నారు. రాజ‌కీయంగా త‌న ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చే రాజధాని మార్పును చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలోనే కార్యక‌ర్తల‌ను నేత‌ల‌ను ఆయ‌న ముందుండి న‌డిపిస్తున్నారు., మ‌హిళ‌ల‌ను రోడ్ల మీద‌కు తెచ్చారు. ఉద్యమాలు చేప‌ట్టారు. నినాదాలు చేస్తున్నారు. జోలె ప‌ట్టుకున్నారు. రోజుకోరూపంలో చంద్రబాబు దూకుడు ప్రద‌ర్శిస్తున్నారు.

బాబు వెంట…?

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా చంద్రబాబు ప్రయ‌త్నాలు రాజ‌ధాని జిల్లాలైన గుంటూరు, కృష్ణాల్లో ఊపు పెంచేనా? అనేది కీల‌క చ‌ర్చకు దారితీస్తోంది. వాస్తవంగా క్షేత్రస్థాయిపరిస్థితి చూస్తే.. అటు గుంటూరులో కానీ, ఇటు కృష్ణాజిల్లాలో కానీ.. టీడీపీ త‌ర‌ఫున చంద్రబాబు ఒక‌రిద్దరు నాయ‌కులు మిన‌హా కీల‌క నాయ‌కులుగా, వ‌రుస విజ‌యాలు సాధించిన మాజీ ఎమ్మెల్యేలుగా పేరు ప‌డ్డ నాయ‌కులు ఎవ‌రూ కూడా ముందుకు రావ‌డం లేదు. య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు, జీవీ ఆంజ‌నేయులు, ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్ వంటివారు స్థిర‌మైన రాజ‌కీయాల‌తో చంద్రబాబు వెంట న‌డ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

అనేక నియోజకవర్గాల్లో……

అదే స‌మ‌యంలో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరి పార్టీకి దూర‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇక కృష్ణా జిల్లాలో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో గ‌న్నవ‌రం ఎమ్మెల్యే వంశీ బాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసి పార్టీకి దూర‌మ‌య్యారు. మ‌రో ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ సైతం రాజ‌ధాని ఉద్యమ కార్యక్రమాల‌కు అంటీ ముట్టన‌ట్టుగా ఉంటున్నారు. స్థానికంగా కూడా నాయ‌కులు పెద్దగా చంద్రబాబుకు మ‌ద్దతివ్వడం లేదు. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ నాయ‌కులు స్తబ్దుగా ఉంటున్నారు. కీల‌క‌మైన గుడివాడ‌లో నాయ‌కులు కూడా ఎవ‌రూ బ‌య‌ట‌కు రావ‌డంలేదు. పెడ‌న స‌హా అవ‌నిగడ్డలోనూ నాయ‌కులు ఎవ‌రూ బ‌య‌ట‌కు రావ‌డం లేదు.

ఓడిన నేతలందరూ….

ఎన్నిక‌ల్లో ఓడిన నేత‌లు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హ‌డావిడి చేశారే త‌ప్పా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. వీరు పార్టీలో ఉన్నా.. పేరుకే త‌ప్ప.. ప్రధానంగా ఎవ‌రూ దూకుడు చూపించ‌డం లేదు. ఇక‌, తిరువూరులో ఓడిపోయిన మాజీ మంత్రి జ‌వ‌హ‌ర్ కూడా అక్కడ ఉండాలా వ‌ద్దా తిరిగి కొవ్వూరుకు జంప్ కొట్టేయాలా ? అన్న ఆలోచ‌న‌లో నే ఉన్నారు. మైల‌వ‌రంలో ఓడిన దేవినేని ఉమ చేస్తున్న విమ‌ర్శల‌కు తిరిగి స‌మాధానం చెప్పుకొనే ప‌రిస్థితి వ‌స్తోంది.

రెండు జిల్లాల్లోనూ…

ఇక‌, విజ‌య‌వాడ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక్క సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా త‌ప్ప ఎవ‌రూ మాట్లాడ‌డం లేదు. పెన‌మ‌లూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఒక్క మాట మాట్లాడితే.. ప‌దికేసులు న‌మోదయ్యేలా ఉంది ప‌రిస్థితి., ఇక‌, వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్‌.. జ‌గ‌న్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు. సో.. ఎలా చూస్తున్నా.. ఈ రెండు జిల్లాల్లోనూ చంద్రబాబు చేస్తున్న రాజ‌ధాని ఉద్యమం ప్ర‌జ‌ల్లో కాదు క‌దా.. కనీసం ఆయ‌న పార్టీ నేత‌ల్లోనే పెద్దగా ఊపును ఇవ్వలేద‌నేది వాస్తవం అన్నట్టుగా ఉంది ప‌రిస్థితి.

Tags:    

Similar News