టోకుగా మోసేయాలనేనా?

చంద్రబాబు అల్లుడురికం ఇంకా నందమూరి జమానాలో సాగడమే అసలైన చిత్రం. చంద్రబాబు తరువాత మూడు తరాల‌ అల్లుళ్ళు వచ్చినా కూడా చిన్నల్లుడికే నందమూరి వంశంలో పెద్ద పీట [more]

Update: 2020-01-19 05:00 GMT

చంద్రబాబు అల్లుడురికం ఇంకా నందమూరి జమానాలో సాగడమే అసలైన చిత్రం. చంద్రబాబు తరువాత మూడు తరాల‌ అల్లుళ్ళు వచ్చినా కూడా చిన్నల్లుడికే నందమూరి వంశంలో పెద్ద పీట వేయడమూ విశేషమే. తనకూ, పార్టీకి ఏ ఆపద వచ్చినా కూడా నందమూరి సెంటిమెంట్ తో ఆయింట్మెంట్ పూత పూయడం చంద్రబాబుకు అలవాటు. అది గత పాతికేళ్ళుగా తెలుగు రాజకీయం ఎరిగిన జనాలకు ఇది అలవాటే. నాడు అన్న గారిని దించాలనుకునప్పుడూ నందమూరి బిడ్డలనే ముందుంచి బాణాలు వేసిన చంద్రబాబు ఏకంగా సీఎం సీటు పట్టేశారు. ఇక ఎన్నికల్లో ఓడిన ప్రతీసారీ వారి చేత ప్రచారం చేయించుకోవడం, గెలిచిన తరువాత పక్కన పెట్టడమూ చంద్రబాబుకు అలవాటే. ఇపుడు అమరావతి రాజధాని ఆయనకు జీవన్మరణ సమస్యగా ఉంది.

సపరివారంగా….

దాంతో చంద్రబాబు గారు గ్రాండ్ ఐడియాతోనే ముందుకు వచ్చారు. అదే నందమూరి సపరివారాన్ని వెంటపెట్టుకుని మరీ రైతుల దీక్షల ముందుకు వచ్చారు. వారితోనే తనను పొగిడించుకుని జగన్ ని తిట్టించారు. నందమూరి రక్తం కూడా అమరావతి రాజధాని కోరుకుంటోందని, ఇక్కడ నుంచి తరలిస్తే అది సలసలా మరిగిపోతుందని కూడా చెప్పించారు. నిజానికి వారెవరూ ఎపుడూ రాజకీయం కాదు కదా మీడియా మైకుల ముందుకు కూడా వచ్చిన బాపతు కాదు. అలాంటి వారిని రప్పించి స్పీచులు ఇప్పించిన ఘనత మాత్రం అచ్చంగా బాబుదే.

వత్తాసుగా….

ఎటూ బావమరిది కమ్ వియ్యంకుడూ బాలకృష్ణ మద్దతూ బాబుకే ఉంది. దానితో పాటు చివరి బావమరిది రామక్రిష్ణ, పెద్ద వదిన లోకేశ్వరి వారి పిల్లలు, మిగిలిన వారసులు ఇలా నందమూరి కుటుంబం వచ్చి మరీ రైతుల దీక్షలకు వచ్చి బాబోరు మా చెడ్డ మంచోరు అంటూ వత్తాసు పలికారు. చంద్రబాబు ఉంటే ఇలా జరిగేదా అని కూడా అన్నారు. అన్ని ప్రాంతాలకూ మేలు చేసేది టీడీపీ ఒక్కటేనని కూడా నినదించారు. అమరావతిని మార్చే హక్కు జగన్ కి ఎక్కడిది అంటూ గట్టిగానే కేకలేశారు. ఇంత చేసినా ఇది వర్కౌట్ అవుతుందా అన్నదే పెద్ద ప్రశ్న.

వారు లేరుగా….?

ఇక హరికృష్ణ చంద్రబాబు గారి పెద్ద బావమరిది. ఆయన జీవించి ఉన్నంతవరకూ కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగానే ఉన్నారు. ఆయన ఇద్దరు కుమారులూ ఇపుడు జనాలకు పరిచయమైన వారు, సినీ హీరోలు, వారు కనుక వస్తే చంద్రబాబు సెంటిమెంట్ అస్త్రం బ్రహ్మాండంగా పనిచేసేది. కానీ జూనియర్ ఎన్టీయార్, కళ్యాణ్ రామ్ ఈ వైపు కూడా తొంగి చూడలేదు, వంగి వాలలేదు, ఇక హరికృష్ణ కుమార్తె సుహాసిని మాత్రం చంద్రబాబుకు బాసటగా అమరావతికి జై అంటున్నారు. మరి సినీ రంగంలో టాప్ హీరోలుగా ఉన్నా ఆ ఇద్దరూ ఎందుకు రాలేదు, అంటే చంద్రబాబు చేతిలో పావులు కాకూడదనే వారు దూరంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. మరి వచ్చిన వారు ఎటూ చంద్రబాబుతో బంధాలనూ గట్టి చేసుకున్న వారే కావడం వల్లనే మద్దతు ఇచ్చారని అంటున్నారు. ఇక మరో వదిన గారు పురంధేశ్వరి కూడా బాబుకు మద్దతుగా మాట్లాడడం లేదుగా. మొత్తానికి చూసుకుంటే నందమూరి ఫ్యామిలీ టోకున చంద్రబాబుని మోయకపోయినా, వచ్చిన వారు జనంలో ఎవరికీ తెలియకపోయినా అమరావతి విషయంలో చంద్రబాబు గారి తాపత్రయం మాత్రం ఎక్కడా తగ్గడంలేదుగా.

Tags:    

Similar News