బాబూ అంత సెంటిమెంటే ఉంటే?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పదే పదే రాజధాని అమరావతి అంశం కేవలం 29 గ్రామాలకే సంబంధించింది కాదని, ఐదు కోట్ల ఆంధ్రుల సమస్యల అని [more]

Update: 2020-01-16 12:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పదే పదే రాజధాని అమరావతి అంశం కేవలం 29 గ్రామాలకే సంబంధించింది కాదని, ఐదు కోట్ల ఆంధ్రుల సమస్యల అని అంటున్నారు. చంద్రబాబు దృష్టిలో ఇది నిజమే కావచ్చు. తొలుత ఆ గ్రామాలకే పరిమితమయిన ఉద్యమాన్ని క్రమంగా చంద్రబాబు పూనుకుని రాష్ట్రం మొత్తం విస్తరించేలా చేస్తున్నారు. అమరావతి పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసి తాను దన్నుగా వెనక ఉండి నడిపిస్తున్నారు. నిజంగా ఐదు కోట్ల మంది ప్రజలు అమరావతిని కోరుకుంటున్నారా? చంద్రబాబు చెప్పేదానిలో నిజమెంత? అన్నది తేలాలంటే ఆయన చేతిలోనే ఉందంటున్నారు.

ఉప ఎన్నికల్లో గెలిచి…..

తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. అనేక సార్లు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయించారు. ఫలితంగా సెంటిమెంట్ నిలబడింది. మరింత బలపడింది. ప్రతి ఉప ఎన్నికల్లోనూ కేసీఆర్ విజయం సాధించారు. అందుకే ప్రజలు ఆయన పక్షాన ఉన్నారని భావించి కాంగ్రెస్ అధిష్టానం సయితం రాష్ట్రం ఇవ్వడానికి అంగీకరించిందంటారు. నిజంగా అంత సెంటిమెంట్ అమరావతి మీద ఐదుకోట్ల మందిలో ఉందని చంద్రబాబు నిజంగా భావిస్తే కేసీఆర్ తరహాలో రాజీనామాలు చేయవచ్చు కదా? అన్న ప్రశ్న బలంగా వినపడుతుంది.

వైసీపీ నేతలకు అనవసరం….

ిఇటీవల కాలంలో 151 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రిఫరెండం కోరదామని కూడా చంద్రబాబు పిలుపునిచ్చారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలే అవుతుంది. వాళ్లు రాజీనామాలు చేసే అవకాశం లేదు. పోనీ సెంటిమెంట్ అంతగా ఉన్నప్పుడు చంద్రబాబు తన ఎమ్మెల్యేల చేత ఎందుకు రాజీనామా చేయించకూడదన్న సందేహం వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడపీీకి 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడివెళ్లారు. మరికొంత మంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

రాజీనామా చేయించి గెలిస్తేనే…..

ఇప్పుడు నిజంగా తన ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి అమరావతి కోసం ఎన్నికలకు వెళ్లి గెలిచి వస్తే చంద్రబాబు వాదనను అందరూ నమ్ముతారు. కానీ అందుకు మొన్న గెలిచిన ఎమ్మెల్యేలు ఎంతమంది సహకరిస్తారన్నదీ సందేహమే. అంతేకాకుండా సెంటిమెంట్ బలంగా ఉందనకుంటున్న కృష్ణా జిల్లాలో ఇద్దరు మాత్రమే మిగిలారు. గుంటూరులో ఇద్దరు ఇప్పటికి ఉన్నారు. ఇక విశాఖలో నలుగురు, ప్రకాశం లో నలుగురు ఉన్నారు. రాయలసీమలో ముగ్గురే ఉన్నారు. మరి మిగిలిన ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే గెలుస్తారా? అన్న అనుమానం కూడా ఉంది. దీంతో పాటు చంద్రబాబు ఆ ప్రతిపాదన తెస్తే రాజీనామా చేయబోయేది నలుగురైదుగురికి మించరన్న కామెంట్లు కూడా వినపడుతున్నాయి. మొత్తం మీద చంద్రబాబు అమరావతి సెంటిమెంట్ ఐదుకోట్ల మందిలో బలంగా ఉందనుకుంటే కేసీఆర్ తరహా ఉప ఎన్నికలకు వెళ్లాలన్న సూచనలు బాగానే వస్తున్నాయి.

Tags:    

Similar News