బాబు వయసు.. అమరావతి సొగసు…!!

చంద్రబాబు వయసు డెబ్బయ్యేళ్ళు. ఇది అందరికీ తెలిసిన విషయం. మరి చంద్రబాబు మాత్రం తన వయసు ఇప్పటికింకా పాతికేళ్లే అంటున్నారు. తాను ఒక్కడిని చాలు 151మంది వైసీపీ [more]

Update: 2020-01-15 12:30 GMT

చంద్రబాబు వయసు డెబ్బయ్యేళ్ళు. ఇది అందరికీ తెలిసిన విషయం. మరి చంద్రబాబు మాత్రం తన వయసు ఇప్పటికింకా పాతికేళ్లే అంటున్నారు. తాను ఒక్కడిని చాలు 151మంది వైసీపీ ఎమ్మెల్యేలను జవాబు చెప్పగలను అంటూ మగధీరలో రాంచరణ్ మాదిరి భారీ డైలాగులు పేల్చుతున్నారు. అంతే కాదు, తాను మరో ఇరవయ్యేళ్ళు జీవిస్తానని, పూర్తి ఆరోగ్యంగా ఉంటానని పదే పదే చెప్పుకుంటున్నారు. అందువల్ల ముసలివాడినని, ఓడిపోయి వాడిపోయాయని ఎవ్వరూ బెంగపెట్టుకోవద్దు అని గట్టిగానే చెప్పుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకంటే మరో నాలుగు పర్యాయాలు తానే ఏపీకి సీఎం గా వస్తానని, అమరావతిని తానే కట్టి చూపిస్తానని చంద్రబాబు ఇస్తున్న గట్టి భరోసా అన్న మాట.

కట్టి తీరుతారా…?

చంద్రబాబుకు ఇపుడు అమరావతి కావాలి, దాని కోసం అధికారం కూడా కావాలి. అందుకే ఆయన అమరావతి రాజధాని పరిరక్షణ పేరు మీద జనాల్లోకి వెళ్తున్నారు. అమరావతి రాజధానిని అక్కడే ఉంచమనండి, ఎక్కడికీ కదపవద్దని జగన్ కి చెప్పండి, దీని కోసం గట్టిగా పోరాటం చేయండని జనాలకు పిలుపు ఇస్తున్నారు. అమరావతి నా కలల రాజధాని, మీ కోసమే నేను ఇలకు దానిని తెచ్చాను, మధ్యలో ఓడినా ముందున్న కాలమంతా నాదేనని కూడా చంద్రబాబు గట్టి ఆశలే పెడుతున్నారు. అమరావతి విషయంలో జగన్ కి చేతకాకపోతే అలాగే వదిలేయమనండి, దాని సంగతి నేను చూసుకుంటాను, నేను అధికారంలోకి వచ్చి కట్టి చూపిస్తానంటున్నారు చంద్రబాబు.

అప్పటిదాకా…..

చంద్రబాబు చెబుతున్న మాటలు వింతగా ఉన్నా కూడా ఆయన అలాగే మాట్లాడుతూపోతున్నారు. తాను ఆరోగ్య సూత్రాల‌ను గట్టిగా పాటిస్తానని, అందువల్ల మరో ఇరవయ్యేళ్ళ పాటు ఏ ఇబ్బందులూ లేకుండా జీవిస్తాన‌ని తిరుపతి సభలో చంద్రబాబు చెప్పుకున్నారు. తాను చేయాల్సిన పెద్ద పని అమరావతిని కూడా పూర్తి చేసి పెడతానని ఆయన అంటున్నారు. నిజమే చంద్రబాబు వరకూ ఆయన ఫిట్ గా ఉండొచ్చు. ఆరోగ్యం సహకరించి ఆయన చెబుతున్నట్లుగా అన్నేళ్ళు బతకవచ్చు, అదృష్టం ఉంటే మళ్ళీ సీఎం కూడా కావచ్చు. కానీ ఆయన‌ చెబుతున్నట్లుగా మరో ఇరవయ్యేళ్ళ పాటు జనం కూడా అంత ఆరోగ్యంగా జీవించి ఉండాలిగా. వారు కూడా చంద్రబాబు కట్టే అమరావతి చూడాలిగా. ఇప్పటితరానికి చంద్రబాబు చెబితే ఆయనకు భగవంతుడు ఆయుష్షు, అధికారం పుష్కలంగా ఇచ్చినా కూడా అమరావతి పూర్తి అయ్యేది మరో పాతికేళ్ళకు కదా. మరి ఈ జనాలు కూడా చూసేందుకు, అనుభవించేందుకు ఆయుష్షు, ఆరోగ్యం వారికీ ఉండాలిగా.

నమ్మగలరా…?

పోలవరం ప్రాజెక్ట్ కధ తీసుకుంటే అది భారీ బడ్జెట్ సినిమా కావడం వల్లనే ఇన్నాళ్ళు అయినా పూర్తి కాకుండా అలా పడిఉంది. ఎపుడో 1940ల దశకంలో పదివేల రూపాయలతో అనుకున్న ప్రాజెక్ట్ ఇప్పటికి దాదాపుగా అరవై వేల కోట్లకు ఎగబాకింది. అది పూర్తి అయ్యేటప్పటికి మరెన్ని వేల కోట్లు అవుతుందో తెలియదు. ఇక అమరావతి రాజధాని తీసుకుంటే ఇప్పటికి లక్షా పదివేల కోట్లు జగన్ సీఎంగా తొలి టెర్మ్ పూర్తి అయ్యేనాటికి అది లక్షన్నర కోట్లకు పై దాటుతుంది. ఇక చంద్రబాబు అధికారంలోకి వచ్చినా కూడా ఇలా లక్షల కోట్లకు పరుగులు తీస్తూనే ఉంటుంది. పెద్దాశకు, అంచనాలకు మధ్య ఆకాశమంతా దూరం పెట్టుకుని బాబు వేస్తున్న నిచ్చెన ఎప్పటికి ఆయన్ని అంచులకు చేర్చేను, ఆయన చెబుతున్న అమరావతి కధలు ఎప్పటికి కంచికి చేరేను. మరో వైపు చూసుకుంటే ఏపీకి అర్జంట్ గా ఆర్ధికంగా చోదక శక్తిగా నిలిచే మహానగరం కావాలి. ఈ నేపధ్యంలో అప్పులు సైతం జడుసుకునే భారీ బడ్జెట్ అమరావతి రాజధాని అంటే అది చంద్రబాబు వయసుకు, కలలకూ మధ్య జరిగే పోరాటంగానే చూడాలేమో.

Tags:    

Similar News