అమ‌రావ‌తిలో వ్యూహం మార్చారే

నిన్న మొన్నటి వ‌ర‌కు అమ‌రావ‌తి మార్పుపై ఒక్క పెట్టున రంగంలోకి దిగిన క‌మ్మ సామాజిక వ‌ర్గం నాయ‌కులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఆ వెంట‌నే అన్ని వ‌ర్గాల‌కు [more]

Update: 2020-01-12 14:30 GMT

నిన్న మొన్నటి వ‌ర‌కు అమ‌రావ‌తి మార్పుపై ఒక్క పెట్టున రంగంలోకి దిగిన క‌మ్మ సామాజిక వ‌ర్గం నాయ‌కులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఆ వెంట‌నే అన్ని వ‌ర్గాల‌కు చెందిన‌ మ‌హిళ‌లు ఒక్కసారిగా రంగం లోకి దిగేశారు. వీరిలోనూ క‌మ్మ వ‌ర్గానికి చెందిన‌వారే ఎక్కువ మంది ఉన్నా కూడా పురుషుల సంఖ్య మాత్రం చాలా త‌క్కువ‌గా ఉంది. ఇంత‌లో ఇంత ఇదిగా హ‌ఠాత్తుగా ఎందుకు మార్పు వ‌చ్చింది? అస‌లు ఏం జ‌రిగింది? అనేది కీల‌కంగా మారింది. రాజ‌ధాని విష‌యంలో ఆదిలో క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన‌ద‌నే ప్రచారం చేయ‌డంలో ప్రభుత్వం పూర్తిగా స‌క్సెస్ అయింది.

ప్రభుత్వ వాదనకు….

ఈ క్రమంలో ఏయే వ‌ర్గాల‌కు చెందిన నాయ‌కులు ఎవ‌రెవ‌రు.. ఎంత‌మంది.. ఎంత మొత్తంలో ఇక్కడ భూములు ముందుగానే కొన్నారో కూడా అసెంబ్లీకి సాక్ష్యాల స‌హితంగా వివ‌రించారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి. ఇది గత ప్రభుత్వాధినేత‌ చంద్రబాబును ఇర‌కాటంలోకి నెట్టింది. అయినా కూడా ఆదిలో రాజ‌ధానిని ఇక్కడే కొన‌సాగించాల‌ని డిమాండ్ చేస్తూ క‌మ్మ వ‌ర్గానికి చెందిన ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్‌, ప్రత్తిపాటి పులరావు, కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్‌, ఆల‌పాటి రాజేంద్ర ప్రసాద్ వంటివారు హ‌ల్‌చ‌ల్ చేశారు. దీంతో ప్రభుత్వ వాద‌న‌కు మ‌రింత బ‌లం చేకూరింది.

సెంటిమెంట్ పాళ్లు పెంచి….

దీంతో ఉలిక్కిప‌డిన చంద్రబాబు వ్యూహం మార్చిన‌ట్టు టాక్‌. ఎంత‌సేపూ క‌మ్మ వ‌ర్గమే ఇక్కడ క‌నిపిస్తుంటే ప్రభుత్వం చేసే విమ‌ర్శల‌కు చెక్ పెట్టడం క‌ష్టమ‌ని భావించారు. ఈ క్రమంలో మ‌హిళల‌ను రంగంలోకి దించారు. దీంతో గ‌డిచిన వారం రోజులుగా మ‌హిళ‌ల సంఖ్య పెరుగుతోంది. పైగా ఇప్పుడు పండ‌గ సీజ‌న్ కావ‌డంతో అంద‌రూ సొంత ఊళ్లకు వ‌చ్చారు. దీనిని కూడా త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయ‌త్నం చేశారు చంద్రబాబు. పండ‌గ‌కోసం వ‌చ్చినా కూడా వారిని కూడా వ‌దిలి పెట్టకుండా సెంటిమెంటు పాళ్లు పెంచార‌న్న టాక్ కూడా ఉంది.

సైలెంట్ చేసేసి….

ఫ‌లితంగా ఇప్పుడు పోలీసు నిషేధాజ్ఞలు సైతం ఉల్లంఘిస్తున్న మ‌హిళ‌లు.. నిర‌స‌న‌ల‌తో హోరెత్తిస్తున్నారు. ఈ ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌ల్లో మిగిలిన వార్గాల‌కు చెందిన వారు కూడా స్వచ్ఛందంగా బ‌య‌ట‌కు వ‌స్తోన్న ప‌రిస్థితి. కులం ఏదైనా, మ‌తం ఏదైనా రాజ‌ధానిని ఇక్కడ నుంచి త‌ర‌లించేందుకు ఇష్టంలేని వాళ్లంతా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఆందోళ‌న‌ల్లో కూడా క‌మ్మ వ‌ర్గం హ‌వా ఎక్కువ ఉంటే అది మొద‌టికే మోసం వ‌స్తుంద‌నే చంద్రబాబు వారిని వ్యూహాత్మకంగా త‌గ్గేలా చేశార‌ని అంటున్నారు. దీంతో క‌మ్మ వ‌ర్గానికి చెందిన పురుషులు, నాయ‌కులు, టీడీపీ నేత‌లు అంద‌రూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.

Tags:    

Similar News