రివ్యూలు లేవ్… ఇక రిలాక్స్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇక జిల్లా సమీక్షలను పక్కన పెట్టేసినట్లే. రాజధాని అమరావతి ఉద్యమం ఊపందుకోవడంతో జిల్లా సమీక్షలను ఇక నిర్వహించకూడదని డిసైడ్ అయ్యారు. ఎన్నికలు [more]

Update: 2020-01-13 11:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇక జిల్లా సమీక్షలను పక్కన పెట్టేసినట్లే. రాజధాని అమరావతి ఉద్యమం ఊపందుకోవడంతో జిల్లా సమీక్షలను ఇక నిర్వహించకూడదని డిసైడ్ అయ్యారు. ఎన్నికలు జరిగి ఏడు నెలలు కావస్తుండటం, ఇప్పటికే ప్రభుత్వం పై పార్టీ వివిధ రకాల ఉద్యమాలు నిర్వహిస్తుండటంతో జిల్లా సమీక్షలు పెట్టి నేతలను ఇబ్బంది పెట్టకూడదని చంద్రబాబు డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాల సమాచారం.

జిల్లాల సమీక్షలతో….

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత చంద్రబాబు వరసగా జిల్లాల సమీక్షలను ప్రారంభించారు. అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప, నెల్లూరు, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, గుంటూరు, విశాఖపట్నం, కృష్ణా జిల్లాలను సమీక్షలను చేశారు. ఆ జిల్లాకు వెళ్లి మూడు రోజుల పాటు అక్కడే చంద్రబాబు మకాం వేసి ఓటమికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. కొన్ని జిల్లాల్లో ముఖ్యనేతలు సమీక్షలకు హాజరుకాకపోవడం, మరికొన్ని జిల్లాల్లో నేతల మధ్య విభేదాలు సమీక్ష సమయంలోనే తలెత్తడం వంట ఘటనలు చోటు చేసుకున్నాయి.

ఉపయోగపడ్డాయి కాని….

అయితే జిల్లా సమీక్షలు పార్టీ నేతల్లోనూ, క్యాడర్ లోనూ నిస్తేజాన్ని పారదోలడానికి ఉపయోగపడ్డాయనే చెప్పాలి. ముఖ్య కార్యకర్తలందరూ చంద్రబాబుతో సెల్ఫీ దిగేంత సమయాన్ని కేటాయించారు. దీనికితోడు పార్టీకి కష్టపడే వారిని తాను ఇకపై వదులుకోబోనని, వారిని గుర్తుంచుకుంటానని చంద్రబాబు పదే పదే సమీక్షల్లో చెబుతూ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారనే చెప్పాలి.

రాజధాని అంశంతో….

కానీ తాజాగా రాజధాని అమరావతి అంశం అత్యంత ప్రాధాన్యమైంది. తాను కలలు కన్న రాజధాని అమరావతి నుంచి తరలి పోతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటారు? అందుకే అమరావతి అంశంపై ఆయన అన్ని జిల్లాలను చుట్టివచ్చేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే మచిలీపట్నం, రాజమండ్రి,తిరుపతి వంటి ప్రాంతాలకు వెళ్లివచ్చారు. దీంతో జిల్లా పార్టీ సమీక్షలకు ఆయన స్వస్తి చెప్పారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మొత్తం మీద జిల్లా నేతలు రివ్యూల నుంచి రిలాక్స్ అయినట్లే కనపడుతోంది.

Tags:    

Similar News