బాబు నిర్ణయం కోసం…?

ఏపీ ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. పైకి పార్టీ అధినేత చంద్రబాబు చెబుతున్న ట్టుగా క్షేత్రస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ప‌రిస్థితి లేదు. చాలా [more]

Update: 2020-01-21 00:30 GMT

ఏపీ ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది. పైకి పార్టీ అధినేత చంద్రబాబు చెబుతున్న ట్టుగా క్షేత్రస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ప‌రిస్థితి లేదు. చాలా నియోజ‌వ‌క‌ర్గాల్లో పార్టీకి ఇంఛార్జులు లేని దుస్థితి దాపురించింది. మ‌రి కొద్ది రోజుల్లోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల‌కు ఎన్నిక‌లు రానున్నాయి. మ‌రి ఈ ఎన్నిక‌ల్లో అయినా టీడీపీ పుంజుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి వ్యూహాత్మకంగా చంద్రబాబు అడుగులు వేయాలి. లేక‌పోతే.. పార్టీ ప‌రిస్థితి దారుణ‌మ‌నే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఆయన తప్ప…..

ప్రస్తుతం రాష్ట్రంలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ ప‌రిస్థితి దారుణంగా ఉంది. రాజ‌ధాని న‌గ‌రం గుంటూరు జిల్లా లోని బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీని ప‌ట్టించుకునేవారు క‌రువ‌య్యారు. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా అన్నం స‌తీష్ పోటీ చేసి కోన ర‌ఘుప‌తిపై ఓట‌మిపాల‌య్యారు. అయితే, ఆ త‌ర్వాత ఆయ‌న ఏకంగా టీడీపీకి బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇక్కడ ఎవ‌రూ కూడా పార్టీ ప‌గ్గాలు పుచ్చుకోలేదు. కాదు కాదు ఇక్కడ వేగేశ్న న‌రేంద్ర వ‌ర్మ పార్టీ బాధ్యత‌ల కోసం ఎదురు చూస్తున్నా చంద్రబాబు ఆయ‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో వ‌ర్మ త‌ప్ప పార్టీకి ఎవ్వరూ దిక్కులేరు.

పట్టించుకునే వారు లేక…

అదే స‌మ‌యంలో గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి నుంచి పోటీ చేసిన ఓడిన‌, దివంగ‌త కోడెల శివ‌ప్రసాద‌రావు స్థానం కూడా ఖాళీగానే ఉంది. ఇక‌, ఇదే జిల్లాలోని మాచ‌ర్ల నుంచి పోటీ చేసి గెలుపు గుర్రం ఎక్కలేక పోయిన అన్నప‌రెడ్డి అంజిరెడ్డి త‌నంత‌ట తానే పార్టీకి దూరంగా ఉంటూ వ్యాపారాలు చేసుకుంటున్నారు. దీంతో రాజ‌ధానిలోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితి దారుణంగా ఉంది. ప్రత్తిపాడు నుంచి మాజీ మంత్రి డొక్కా ఓడిపోయారు. ఆయ‌న కూడా పార్టీలో ఉండాలా ? వెళ్లాలా ? అన్న ఊగిస‌లాట‌లో ఉండ‌డంతో అక్కడ కూడా పార్టీని ప‌ట్టించుకునే వాళ్లే లేరు.

పార్టీ నుంచి వెళ్లిపోయినా….

ఇక‌, తూర్పు గోదావ‌రి జిల్లాలోని పి.గ‌న్నవ‌రం ఇంచార్జ్‌గా ఉన్న‌ నేల‌పూడి స్టాలిన్ బాబు స‌స్పెండ్ అయ్యారు. దీంతో ఇక్కడ కూడా ఎవ‌రినీ ఇంచార్జ్‌గా నియ‌మించ‌లేదు. అదే జిల్లాలోని ప్రత్తిపాడులో పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు వ‌ర‌పుల రాజా రిజైన్ చేశారు. అక్కడ కూడా ఎవ్వరిని ఇన్‌చార్జ్‌గా నియ‌మించ‌లేదు. కాకినాడ రూర‌ల్‌లో పోటీ చేసి ఓడిపోయిన పిల్లి అనంత‌ల‌క్ష్మి కూడా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. ఇక‌, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా చింత‌ల‌పూడిలో గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ క‌ర్రా రాజారావు ఔట్ డేటెడ్ అయిపోయారు. దీంతో ఇక్కడ కూడా పార్టీని ప‌ట్టించుకునేవారు లేరు. అయితే, మాజీ మంత్రి పీత‌ల సుజాత ఇక్కడ బాధ్యత‌లు చూసేందుకు రెడీ అవుతున్నా.. బాబు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

పార్టీకి దూరమయినా….

ఇక‌, ఇదే జిల్లాలోని కొవ్వూరు లో గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన వంగ‌ల‌పూడి అనిత త‌న పాత నియోజ‌క‌వ‌ర్గం పాయ‌క‌రావుపేట‌కు వెళ్లిపోయారు. దీంతో ఇక్కడ కూడా టీడీపీని ప‌ట్టించుకునేవారు క‌రువ‌య్యారు. ఇక‌, ఏలూరు నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన మాజీ ఎమ్మెల్యే బ‌డేటి బుజ్జి ఇటీవ‌ల మృతి చెందారు. దీంతో ఇక్కడ కూడా చంద్రబాబు ఎవ‌రినీ నియ‌మించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం. అక్కడ బుజ్జి రేంజ్ నాయ‌కుడు దొరికే ప‌రిస్థితి లేదు. అదేవిధంగా అనంత‌పురం జిల్లా ధ‌ర్మవ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో ఓడిపోయిన‌ వ‌ర‌దాపురం సూరి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో వెంట‌నే పార్టీ ఇంచార్జ్‌ను నిల‌బెట్టాల‌నుకున్నప్పటికి ఎలాంటి నిర్ణయ‌మూ తీసుకోలేదు. కృష్ణాజిల్లా గ‌న్నవ‌రంలో వంశీ పార్టీకి దూర‌మ‌య్యారు. అక్కడ పార్టీకి ఇన్‌చార్జ్ లేరు.

ఓటమి పాలయిన చోట…

ఇక గుడివాడ‌లో ఓడిపోయిన దేవినేని అవినాష్ వైసీపీలోకి వెళ్లిపోవ‌డంతో అక్కడ కూడా పార్టీ త‌ర‌పున స‌రైన నాయ‌కుడు లేని ప‌రిస్థితి. పార్టీకి కంచుకోట‌గా ఉన్న ఒక్క కృష్ణా జిల్లాలోనే రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ దుస్థితి నెల‌కొంది. ఇక అదే జిల్లాలోని నందిగామ‌, పామ‌ర్రు, పెడ‌న నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన అభ్యర్థులు రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యే ప‌రిస్థితి ఉంది. ఇక గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరి పార్టీకి దూరం అవ్వనుండ‌డంతో బాబు అక్కడ మాత్రం కోవెలమూడి నానికు పార్టీ ప‌గ్గాలు అప్పగించారు. ఏదేమైనా ఎస్సీ, ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాల్లో చాలా చోట్ల ఎన్నిక‌ల్లో ఓడిన నేత‌లు పార్టీకి దూర‌మ‌వుతున్నారు. ఇలా స్థానిక సంస్థల‌కు ఎన్నిక‌లు సమీపిస్తున్న నేప‌థ్యంలో పార్టీ ప‌రిస్థితి గంద‌ర‌గోళంగా త‌యారైంది.

Tags:    

Similar News