కలవరం అందుకేనా?

మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని విడిచి వెళ్లిపోతుండటం తెలుగుదేశం పార్టీలో ఆందోళన కల్గిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ అనుభవించిన నేతలు విపక్షంలోకి రాగానే విడిచివెళ్లిపోవడంపై టీడీపీ అధినేత [more]

Update: 2019-09-15 11:00 GMT

మాజీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని విడిచి వెళ్లిపోతుండటం తెలుగుదేశం పార్టీలో ఆందోళన కల్గిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ అనుభవించిన నేతలు విపక్షంలోకి రాగానే విడిచివెళ్లిపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సయితం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పార్టీని విడిచి వెళ్లడంపై చంద్రబాబు ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. చివరి నిమిషంలో కూడా జ్యోతుల నెహ్రూ ద్వారా రాయబారం నడిపినా ఆయన వినకుండా పార్టీని వీడి వెళ్లారు.

అందరూ బీజేపీలోకే…..

నిజానికి ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచే తెలుగుదేశం పార్టీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. అయితే టీడీపీ నుంచి వెళ్లిపోయిన నేతలందరూ భారతీయ జనతా పార్టీలో చేరారు. దీనికి చంద్రబాబు కూడా పెద్దగా అభ్యంతరం పెట్టలేదు. కేసులు, వ్యాపారాలకు భయపడి తాత్కాలికంగా షెల్టర్ చూసుకున్నారని చంద్రబాబు కూడా కొంత సర్దుబాటు చేసుకున్నారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, అన్నెం సతీష్ కుమార్, వరదాపురం సూరి వంటి నేతలు ఈ కోవకు చెందిన వారే.

వైసీపీలోకి తొలిగా తోట…..

ఇప్పటి వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా టీడీపీ నేతలను దగ్గరకు రానివ్వలేదు. ఎమ్మెల్యేలను రాజీనామా చేసి వస్తే తప్ప చేర్చుకోమని చెప్పడం చంద్రబాబుకు కొంత ఊరట కల్గించే అంశమే. అయితే ద్వితీయ శ్రేణినేతలు కొందరు వైసీపీలో చేరుతున్నారు. కానీ తాజాగా తోట త్రిమూర్తులు వైసీపీలో చేరడంతో చంద్రబాబులో కొంతకలవరం ప్రారంభమయింది. ముఖ్యమైన నేతలకు వైసీపీ వల వేస్తుండటంతో చంద్రబాబు అప్రమత్తమయ్యారు.

అప్రమత్తమైన బాబు….

స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండటంతో బలమైన నేతలను వైసీపీ లాగేసుకుంటుందని తోట త్రిమూర్తులు వెళ్లిపోవడంతోనే అర్థమయింది. దీంతో చంద్రబాబు జిల్లాల నేతలతో టచ్ లోకి వెళుతున్నారు. పార్టీకి భవిష్యత్తు ఉంటుందని చెబుతున్నారు. కోస్తాంధ్రకు చెందిన ఒక బలమైన నేత వైసీపీలో చేరతారన్న ప్రచారం జరుగుతుండటంతో చంద్రబాబు నేరుగా ఆయనతో ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తోంది. మొత్తం మీద నేతలు బీజేపీలో చేరినా పెద్దగా పట్టించుకోని చంద్రబాబు వైసీపీలోకి వలసలు స్టార్టయ్యేసరికి కొంత ఆందోళనలో ఉన్నారు.

Tags:    

Similar News