లేదు లేదు…కాదు..కాదంటూనే?

అమ‌రావ‌తి ప్రాంతంలో భముల‌ను క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వారే కొనుగోలు చేశారు. ఇక్కడ అభివృద్ది జ‌రిగితే.. కేవలం ఒక సామాజిక వ‌ర్గం మాత్ర‌మే డెవ‌ల‌ప్ అవుతుంది. [more]

Update: 2020-01-08 00:30 GMT

అమ‌రావ‌తి ప్రాంతంలో భముల‌ను క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వారే కొనుగోలు చేశారు. ఇక్కడ అభివృద్ది జ‌రిగితే.. కేవలం ఒక సామాజిక వ‌ర్గం మాత్ర‌మే డెవ‌ల‌ప్ అవుతుంది. ఇదీ వైసీపీ నేత‌లు కొన్నేళ్లుగా చేస్తున్న ఆరోప‌ణ‌లు. ఇక‌, అధికారంలోకి వ‌చ్చాక కూడా రాజ‌ధాని అమ‌రావ‌తి అంటే అంద‌రిదీ.. ఒక సామాజిక వ‌ర్గానికి మాత్రమే ప‌రిమితం కాదు అని మంత్రులే వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, దీనికి ఎప్పటిక‌ప్పుడు టీడీపీ నుంచి కౌంట‌ర్లు వ‌స్తున్నాయి రాజ‌ధాని ప్రాంతంలో క‌మ్మ సామాజిక వ‌ర్గం ఒక్కటే లేదు. ఇక్కడ తాడికొండ‌, ప్రత్తిపాడు వంటి ఎస్సీ నియోజ‌క‌వర్గాలు ఉన్నాయని 75 శాతం మంది ఎస్సీ వ‌ర్గాల‌కు చెందిన ప్రజ‌లే ఇక్కడ ఉంటున్నార‌ని టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ప‌లు సంధ‌ర్భాల్లో వ్యాఖ్యలు చేశారు.

తిప్పికొడుతూనే…

మొత్తంగా త‌మ‌పైనా… పార్టీపైనా వైసీపీ చేస్తున్న సామాజిక‌వ‌ర్గం ఆరోప‌ణ‌లు తిప్పికొట్టేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. అయితే, ఒక్కసారి చంద్రబాబు ఈ ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యంలో గుంటూరు జిల్లాలో తీసుకున్న నిర్ణయాలు ప‌రిశీలించినా.. ఆయ‌న ఎవ‌రెవ‌రికి టికెట్లు ఇచ్చార‌నే విష‌యాన్ని చూసినా.. ఆయ‌న లేదు లేదంటూనే క‌మ్మ సామాజిక వ‌ర్గాన్ని భుజాల‌పై ఎంత పొందిక‌గా మోస్తున్నారో ఇట్టే అర్ధమవుతుంది. జిల్లాలో రెండు పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. గుంటూరు, న‌ర‌సారావుపేట. ఈ రెండు టికెట్లను కూడా క‌మ్మ వ‌ర్గానికి చెందిన గ‌ల్లా జ‌య‌దేవ్‌.. రాయ‌పాటి సాంబ‌శివ‌రావుల‌కే కేటాయించారు. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ వీరిద్దరికి ఈ రెండు సీట్లను బాబు రిజ‌ర్వ్ చేసి పెట్టేశారు.

గత ఎన్నికలలో…..

ఇక‌, ఎమ్మెల్యే సీట్ల విష‌యానికి వ‌స్తే.. ఎనిమిది అసెంబ్లీ టికెట్లను క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన నాయ‌కుల‌కే కేటాయించారు. పొన్నూరు-ధూళిపాళ్ల న‌రేంద్ర కుమార్‌, స‌త్తెన‌ప‌ల్లి-దివంగ‌త కొడెల శివ‌ప్రసాద్‌రావు, వినుకొండ‌-జీవీ ఆంజ‌నేయులు, గుర‌జాల-య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు, తెనాలి-ఆల‌పాటి రాజేంద్రప్ర‌సాద్‌, పెద‌కూర‌పాడు-కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్‌, చిల‌క‌లూరి పేట-ప్రత్తిపాటి పుల్లారావుల‌కు టికెట్లు ఇచ్చారు. వీరంతా కూడా ప‌రాజ‌యం పాల‌య్యారు. ఇక తాను రాజ‌ధానిని డెవ‌ల‌ప్ చేశానని అంటూ మంగ‌ళ‌గిరిలో త‌న కుమారుడు లోకేష్‌ను పోటీ చేయించినా అక్కడ కూడా ప్రజ‌లు చిత్తుగా ఓడించారు.

గుంటూరు వెస్ట్ లో కూడా….

ఇక‌, గుంటూరు వెస్ట్‌లో మాత్రం వైశ్య సామాజిక వ‌ర్గా నికి చెందిన మ‌ద్దాలి గిరిధ‌ర్‌కు టికెట్ ఇచ్చారు. ఈయ‌న మాత్రమే జ‌గ‌న్ సునామీని త‌ట్టుకుని మ‌రీ.. ఆయ‌న విజ‌యం సాధిం చారు. ఇక‌, ఇటీవ‌ల ఈయ‌న జ‌గ‌న్‌ను క‌లిసిన వెంట‌నే క‌నీసం మాట మాత్రం చెప్పకుండా గుంటూరు వెస్ట్‌లో పార్టీ ఇంచార్జ్‌గా కోవెల మూడి ర‌వీంద్రకుమార్‌ను చంద్రబాబు దింపేశారు. ఈయ‌న కూడా క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడే కావ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా చూస్తే.. చంద్రబాబు లేదులేదంటూనే క‌మ్మ సామాజిక వరానికి ప్రాధాన్యం ఇస్తున్నార‌న‌డంలో సందేహం లేదు.

కోవెల‌మూడి ర‌వీంద్ర ఎవ‌రంటే…

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కోవెల మూడి ర‌వీంద్ర ఉర‌ఫ్ నాని పార్టీలో కొనసాగుతోన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా అండగా నిలిచి తన సహకారాలు అందించారు. 2014లో ఆయనకు పశ్చిమ టిక్కెట్‌ వస్తుందని ఆశించారు. అయితే ఆ సమయంలో మోదుగుల వేణుగోపాల్‌రెడ్డికి టిక్కెట్‌ ఇవ్వాల్సి రావడంతో చంద్రబాబు పిలిచి మాట్లాడి నానిని ఒప్పించారు. ఆ ఎన్నికల్లో మోదుగుల గెలుపు కోసం నాని, ఆయన అనుచరగణం కృషి చేశారు. 2019 ఎన్నికలకు ముందు మోదుగుల పార్టీ మారడంతో ఈ సారి తనకు టిక్కెట్‌ వస్తుందని నాని ఆశించారు.

ఫాస్ట్ నిర్ణయంతో…..

అయితే సామాజిక సమీకరణాల్లో భాగంగా మరో సారి నానికి అదృష్టం కలిసి రాలేదు. అయితే ఇప్పుడు గిరి జ‌గ‌న్‌ను క‌లిసిన వెంట‌నే ఆఘ‌మేఘాల మీద నానికి ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ ప‌గ్గాలు ఇవ్వడంతో చంద్రబాబు మ‌ళ్లీ క‌మ్మ నేత‌ల‌ను ద‌గ్గర‌కు చేర‌దీసిన‌ట్లవుతోంది. పార్టీకి బై చెప్పిన వంశీ నియోజ‌క‌వ‌ర్గం గ‌న్నవ‌రంతో పాటు గుంటూరు జిల్లాలో ఇన్‌చార్జ్‌లు లేని బాప‌ట్ల, స‌త్తెన‌ప‌ల్లి, మాచ‌ర్లను వ‌దిలేసి మ‌రీ చంద్రబాబు వెస్ట్‌ను త‌న వ‌ర్గానికే చెందిన వ్యక్తికి క‌ట్టబెట్టడంతో జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో మిశ్రమ స్పంద‌న వ్యక్తమ‌వుతోంది.

Tags:    

Similar News