బేరాలకు దిగారా?

అమరావతి రాజధాని విషయంలో దాని సృష్టి కర్త చంద్రబాబుకే కచ్చితమైన క్లారిటీ లేదా అన్న సందేహాలు వస్తున్నాయి. అమరావతి రాజధాని అంటూ పెద్ద ప్రకటనలు చేసిన చంద్రబాబు [more]

Update: 2020-01-07 08:00 GMT

అమరావతి రాజధాని విషయంలో దాని సృష్టి కర్త చంద్రబాబుకే కచ్చితమైన క్లారిటీ లేదా అన్న సందేహాలు వస్తున్నాయి. అమరావతి రాజధాని అంటూ పెద్ద ప్రకటనలు చేసిన చంద్రబాబు తీరా ఆచరణలో చతికిలపడ్డారు. ఇంతలో ఎన్నికలు రావడం, ఆయన కుర్చీ కదిలిపోవడం జరిగిపోయాయి. ఇక అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో ఎంత ఖర్చు అవుతుంది? ఎన్నేళ్ళ సమయం అవుతుంది? అన్నది విపక్షంలోకి వచ్చాక కూడా చంద్రబాబుకు అంచనాకు దొరకడం లేదా అన్న మాట వినిపిస్తోంది. చంద్రబాబు పూటకు ఒక విధంగా అమరావతి విషయంలో మాట్లాడుతున్న మాటలు మరింత గందరగోళానికి దారి తీస్తున్నాయి. పైగా ఆయన రాజకీయంగా విమర్శలకు వాడుకోవడానికే చూస్తున్నారు తప్ప అమరావతి మీద చిత్తశుద్ధి ఎంతవరకూ ఉంది అన్న డౌట్లు కూడా వస్తున్నాయి.

లక్షా పది వేలా..?

నిజానికి అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు అమరావతికి లక్షా పదివేల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పుకొచ్చేవారు. ఆ నిధుల కోసం తాను గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నానని కూడా ఆయన ప్రకటించుకునేవారు. ఆ సంగతి అలా ఉంచితే అమరావతి విశ్వ రాజధాని అంటూ చంద్రబాబు చెప్పిన మాటలు గుర్తున్నాయి. పైగా అమరావతిలో నవ నగరాల నిర్మాణం కూడా ఆయన స్వయంగా గ్రాఫిక్స్ తో డిజైన్లు వేయించారు. మరి వీటిని అయ్యే ఖర్చు తడిసిమోపెడు అవుతుందని ఆర్ధిక వేత్తలు కూడా లెక్కలు కట్టారు. అయితే తాను తలచుకుంటే నిర్మాణం చిటెకలో పని, నిధులు కూడా అలా వస్తాయని చంద్రబాబు అనడమూ చూశాం. అయితే జరిగింది వేరుగా ఉంది.

సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ…

విపక్షంలోకి వచ్చాక అదీ జగన్ సర్కార్ మూడు రాజధానుల ప్రతిపాదన చేశాక చంద్రబాబు గొంతు మారింది. అమరావతికి అంత ఖర్చు ఎందుకు అవుతుంది అంటూ కొత్త పాటను అందుకున్నారు. పైగా అమరావతి అంటేనే కామధేనువు లాంటిదని ఆయన అభివర్ణించారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అని, అక్కడ ఉన్న భూములను అమ్మేస్తే ఆ డబ్బులతో రాజధాని కట్టడమే కాకుండా చేతికి పైసా ఖర్చు కూడా తగలదని అంటూ వచ్చారు. అయితే అక్కడ భూములను ప్లాట్లుగా వేయడానికి ఎంత ఖర్చు అవుతుందో మాత్రం చంద్రబాబు చెప్పకుండా దాచారు. కానీ ఇదే చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు ఎకరానికి రెండు వేల కోట్లు ఖర్చు పెడితేనే తప్ప మౌలిక సదుపాయాలు సమకూరవని, ప్లాట్లుగా వేయడం కుదరదు అని కూడా అన్నారు. ఈ లెక్కన మళ్ళీ లక్ష కోట్లకే ఖర్చు చూపిస్తోంది.

మూడు వేలేనట….

ఇక ఇపుడు బోస్టన్ నివేదిక కూడా రావడంతో చంద్రబాబు మరింత ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. అసలు అమరావతికి పైసా కూడా ఖర్చు పెట్టనవసరం లేదని, కేవలం మూడు వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తే చాలంటూ సరికొత్త విషయాలు చెబుతున్నారు. అంటే మూడు వేల కోట్లను ఖర్చు చేస్తే మొత్తం మౌలిక సదుపాయాలు ముంగిట్లోకి వస్తాయట. దాంతో మిగిలిన పదివేల ఎకరాలు అమ్మేసి ఆ డబ్బుతో అమరావతి కట్టవచ్చుట. అంటే అమరావతికి ఎంత ఖర్చు అవుతుందో చంద్రబాబుకే సరైన అవగాహన లేదని పూటకో మాట ద్వారా చెప్పకనే చెప్పేశారంటున్నారు.

వ్యతిరేకమవుతోందిగా….

చంద్రబాబు లక్ష కోట్ల రాజధాని అనడమే ఇపుడు ఏకంగా అమరావతినే అక్కడ నుంచి తరలించేలా చేస్తోంది. దాంతో పాటు రైతులు కూడా రోడ్డున పడ్డామని వాపోతున్నారు. జగన్ ని ఈ విషయంలో విమర్శిస్తున్నా ఇంత దాకా కధ నడిపిన చంద్రబాబుని కూడా రైతులు తప్పు పడుతున్నారు. లక్ష కోట్లు, ప్రపంచ రాజధాని అంటూ చంద్రబాబు నాడు సినిమా చూపించారని, ఇపుడు అదే నెగిటివ్ గా మారిదని వారు రివర్స్ అవుతున్నారు. పైగా ఏపీలోని మిగిలిన జనంలో కూడా ఈ లక్ష కోట్ల రూపాయల ఖర్చు పెద్ద చర్చగా ఉంది.

ఒకే చోట ఇంత ఖర్చు చేస్తే….

ఒకే చోట ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేసి రాజధాని నిర్మిస్తే మా గతేంటి అన్న ప్రశ్న అంతటా వస్తోంది. అటువంటి ఖరీదైన రాజధాని కట్టమని చంద్రబాబు డిమాండ్ చేయడమేంటని కూడా అయన పట్ల కూడా వ్యతిరేకత పెంచుతోంది. దాంతో గొంతు మార్చిన చంద్రబాబు అబ్బే మూడు వేల కోట్లు రాజధాని కోసం చాలు అని ఇపుడు అంటున్నారు. అదే నిజం అయితే అయిదు వేల కోట్లు వరకూ ఖర్చు పెట్టిన చంద్రబాబు మరో మూడు వేల కోట్లు నాడే ఎందుకు ఖర్చు పెట్టలేక పోయారన్న ప్రశ్న కూడా వెంటనే వస్తోంది. ఇవన్నీ ఇలా ఉంచితే అమరావతి కోసం చంద్రబాబు రాజకీయ బేరాలు అడుతున్నారని మాత్రం కౌంటర్లు గట్టిగా పడుతున్నాయి.

Tags:    

Similar News