విజన్ 2020… బాబు గ్రాఫ్ ఇదే

ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు తరచూ ఒకే మాట చెప్పేవారు. తనది విజన్ 2020 అని. నిజంగా అప్పటివరకూ తానే సీఎంగా ఉంటానని బాబు అతి విశ్వాసం [more]

Update: 2019-12-31 13:30 GMT

ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు తరచూ ఒకే మాట చెప్పేవారు. తనది విజన్ 2020 అని. నిజంగా అప్పటివరకూ తానే సీఎంగా ఉంటానని బాబు అతి విశ్వాసం అలా వ్యక్తం చేసేవారు. అయితే సీన్ కట్ చేస్తే అందులో పదేళ్ళ పాటు విపక్ష స్థానమే బాబుకు దక్కింది. ఇక 2019 ఎన్నికల్లో ముచ్చటగా మూడవసారి ఓడిన చంద్రబాబు టీడీపీ చరిత్రలో దారుణమైన పరాజయాన్ని తలకెత్తుకుని తాను ఎంతగానో కలవరించిన 2020లోకి అడుగుపెడుతున్నారు. మొత్తం ఈ రెండు దశాబ్దలకాలంలో చంద్రబాబు పొలిటికల్ గ్రాఫ్ తీసుకుంటే అకాశం నుంచి పాతాళానికి అమాంతం జారిపోయిందనిపించక మానదు.

జగన్ పుట్టలేదుగా…?

చంద్రబాబు విజన్ 2020 అన్న కాలానికి వైఎస్సార్ ముఖ్యమంత్రి కూడా కాదు, విపక్షంలో కూడా ఆయనకు ప్రధాన నాయకుడి స్థానం దక్కక పెద్ద ఫైట్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ లో అగ్ర నాయకుల నుంచి మద్దతు కరవై వైఎస్సార్ ఓ విధంగా రాజకీయ వైరారాగ్యంలో ఉన్నారు. ఇక వైఎస్ కుమారుడుగా జగన్ పేరు కూడా ఎవరికీ తెలియని రోజులు అవి. వైఎస్సార్ సైతం కడప తప్ప బయట ప్రాంతాలకు అంతగా పరిచయం లేని రాజకీయ నేతగా ఉన్న కాలమది. ఆ సమయంలో సరైన ప్రతిపక్షం కూడా లేదు. అపుడు చంద్రబాబు నుంచి పుట్టుకొచ్చిన నినాదమే విజన్ 2020.

జ్యోతిబసు స్పూర్తిగా….

చంద్రబాబు 1995లో ముఖ్యమంత్రి అయ్యేనాటికి కాంగ్రెస్ 26 సీట్లతో పడి ఉంది. సరైన లీడర్ షిప్ ఆ పార్టీకి లేదు. చంద్రబాబు యువ ముఖ్యమంత్రిగా జోరు మీద ఉండేవారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ కనుమరుగై వాజ్ పేయి, బీజేపీ రైజింగ్ లో ఉన్నారు. దాంతో ఏపీలో మరి పోటీగా ముందుకు వచ్చే పార్టీలు కూడా లేకపోవడంతో చంద్రబాబుకు సుదీర్ఘ కాలం తానే ముఖ్యమంత్రిగా ఉంటానని భావించేవారు. ఆయన అప్పటి పశ్చిమ బెంగాల్ సీఎం జ్యోతిబసుని ఆదర్శంగా తీసుకునేవారు. ఆక్కడ ఆయన 23 ఏళ్ళకు పైబడి ముఖ్యమంత్రిగా నిరంతరంగా కొనసాగారు. దాంతో తాను ఆ రికార్డ్ ని తిరగరాయాలనుకున్నారు. అంటే 2020 వరకూ సీఎం గా ఉంటే ఉమ్మడి ఏపీకి పాతికేళ్ళ పాటు పనిచేసినట్లు అవుతుందని లెక్కలేసుకున్నారు.

సీన్ కట్ చేస్తే…?

ఆ తరువాతనే పరిణామాలు వేగంగా మారిపోయాయి. ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఊపిరిపోసుకోవడం, టీఆర్ఎస్ నేతగా కేసీఆర్ ముందుకు రావడం, దాంతో వైఎస్సార్ చరిష్మా తో దూకుడు రాజకీయం చేయడంతో 2004లో చంద్రబాబు ఓడిపోయారు. తిరిగి ఆయన సీఎం అయింది 23 జిల్లాల ఉమ్మడి ఏపీ నుంచి 13 జిల్లాల నవ్యాంధ్రకు మాత్రమే. ఇక 2019 ఎన్నికలలో ఆయన పార్టీ కేవలం 23 ఎమ్మెల్యే సీట్లను మాత్రమే సాధించింది. ఇపుడు మూడు రాజధానుల ప్రకటనతో జగన్ వేసిన రాజకీయ ఎత్తులకు, జిత్తులకు చిత్తైన చంద్రబాబు కేవలం రెండు జిల్లాల కోసం పోరాడే నేతగా మరిపోయారు. చంద్రబాబు కలలు కన్న 2020 ఏడాది ప్రవేశిస్తున్న వేళ 23 జిల్లాల ముఖ్యమంత్రి కాస్తా 2 జిల్లాల విపక్ష నేతగా కుదించుకుపోవడం అంటే నిజంగా రాజకీయ విషాదమే మరి.

Tags:    

Similar News