బాబుకు షాకిచ్చేస్తున్నారుగా

చంద్రబాబు రాజకీయం ఉచ్చులో పడకూడదని సొంత తమ్ముళ్ళే అనుకుంటున్నారంటే ఇక టీడీపీ కధ ఎక్కడికి చేరుతుందో మరి. మనసంతా అమరావతిని నింపుకున్న చంద్రబాబు తన మాటే శాసనం [more]

Update: 2019-12-26 15:30 GMT

చంద్రబాబు రాజకీయం ఉచ్చులో పడకూడదని సొంత తమ్ముళ్ళే అనుకుంటున్నారంటే ఇక టీడీపీ కధ ఎక్కడికి చేరుతుందో మరి. మనసంతా అమరావతిని నింపుకున్న చంద్రబాబు తన మాటే శాసనం అంటూ తమ్ముళ్ళను ఎక్కడికక్కడ కట్టడి చేయడం మొదలెట్టారట. అందులో భాగంగా ప్రతీ జిల్లాలోని టీడీపీ కమిటీల ద్వారా అమరావతి రాజధానిగా ఉండాలని తీర్మానం చేయించాలని ఆదేశించినట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే ఏపీలో తూర్పున ఉన్న తొట్ట తొలి జిల్లా శ్రీకాకుళంలోనే చంద్రబాబు మార్క్ ప్రతిపాదనకు తమ్ముళ్ళు గండి కొట్టి గట్టి ఝలక్ ఇచ్చేశారు. అలాంటిదేమీ లేదని కాదు పొమ్మనారు.

అదెలా కుదురుతుంది?

ఈ విషయంలో చంద్రబాబు తరుపున సమాచారం తెచ్చి జిల్లా పార్టీ మీటింగులో అమరావతే మన రాజధాని అంటూ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ తదితరులు తీర్మానాన్ని ప్రతిపాదించారు. అయితే దీని మీద మరో మాజీ మంత్రి కోండ్రు మురళీ మోహనరావు మాత్రం ససేమిరా అనేశారట. అసలు ఎలా తీర్మానం చేస్తమాంటూ తనదైన శైలిలో లాజిక్ పాయింట్ కూడా తీశారట. చాలాకాలంగా ఉత్తరాంధ్ర పడరాని పాట్లుపడుతోంది. ఇపుడు వైసీపీ సర్కార్ పరిపాలనా రాజధానికి ప్రకటించారు. ఈ సమయంలో ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా తీర్మానం చేయడం ఏంటని కోండ్రు గర్జించేసరికి మిగిలిన తమ్ముళ్ళు ఏం అనలేకపోయరట. మొత్తానికి తీర్మానం ఏదీ చేయకుండానే మీటింగు ముగిసిందని భోగట్టా.

ఆ రెండు జిల్లాలూ సైలెంట్ గా…

ఇదే తీరున చూసుకుంటే విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు కూడా ఇలాంటి తీర్మానాల విషయంలో సైలెంట్ గానే ఉన్నాయి. విశాఖలో గంటా సన్నిహితుడే టీడీపీ ప్రెసిడెంట్ గా ఉంటున్నారు. పైగా ఎమ్మెల్యేలు ఎవరూ విశాఖను రాజధానిగా చేయవద్దు అని బయటకు అసలు అనడంలేదు. ఇపుడు తీర్మానం కనుక పెడితే ఉన్న పరువే కాదు, పదవి కూడా పోతుందన్న కంగారు వారిలో ఉంది. మరి ఎక్కడో అమరావతిలో చంద్రబాబు కూర్చుని ఇక్కడే రాజధాని ఉండాలని కోరితే సరిపోతుందా అన్న మాట కూడా తమ్ముళ్ళ నుంచి వస్తోంది.

ధిక్కరించినట్లేనా…?

అవును, అధికారంలో ఉన్నపుడు వెనకబడిన జిల్లాలకు చెందిన నిధులను కూడా అమరావతి ఖాతాలో కలిపేసుకున్న చంద్రబాబు పాలనను గుర్తు చేసుకుంటున్న తమ్ముళ్ళకు ఓ విధంగా జగన్ తీసుకున్న నిర్ణయం ఎంతో ఆశావహంగా ఉందని అంటున్నారు. గడచిన ఏడు దశాబ్దాల కాలంలో రాజధాని అంటే హైదరాబాద్, అమరావతి అంటూ పరుగులు తీసే తమకు ముంగిట్లోనే దాన్ని పెట్టడం కంటే ఆనందం లేదని తమ్ముళ్ళు అంటున్నారు. అందుకే వారు చంద్రబాబు నిర్ణయాన్ని సైతం ధిక్కరించి గట్టిగా నిలబడుతున్నారు. మొత్తానికి ఇన్నాళ్ళు తమ్ముళ్ళకు షాకులు ఇచ్చిన బాబుకు ఇపుడు వారే రివర్స్ లో ఇస్తున్నారు. అదే రాజకీయ చిత్రం మరి.

Tags:    

Similar News