బాబు మోసపోతున్నట్లే ఉందిగా

అది నిజమేనా, అలా కూడా జరుగుతుందా. రాజకీయ గండరగండడు చంద్రబాబుని ఎవరైనా మోసం చేయగలరా. ఆయన వల్లనే తాము మోసపోయామని జాతీయ స్థాయిలో దిగ్గజ పార్టీ అయిన [more]

Update: 2019-12-21 06:30 GMT

అది నిజమేనా, అలా కూడా జరుగుతుందా. రాజకీయ గండరగండడు చంద్రబాబుని ఎవరైనా మోసం చేయగలరా. ఆయన వల్లనే తాము మోసపోయామని జాతీయ స్థాయిలో దిగ్గజ పార్టీ అయిన బీజేపీ నుంచిఆయనతో పొత్తు పెట్టుకున్న అనేక పార్టీలు ఇప్పటికీ చెబుతూ వాపోతాయి. ఇక అల్లుడు తనను వెన్నుపోటు పొడిచి కుర్చీ లాగేశాడని ఎన్టీఆర్ చివరి రోజుల్లో కార్చిన కన్నీరు అంతా ఇంతా కాదు కాదా. బాబు నమ్మించి మోసం చేశారని టికెట్లు ఇవ్వలేదని అనేకమంది రాజకీయ బాధితులు కూడా నాటి నుంచి నేటి వరకూ మీడియాకు ఎక్కి చెప్పడం కూడా తెలుగు జనం చూశారు. అటువంటి చంద్రబాబు మోసపోయారా. ఆయన్ని మోసం చేయడం నిజంగానే సాధ్యపడుతుందా.

బాధితుడు బాబు అట…

జేసీ దివాకర్ రెడ్డి స్టయిలే వేరుగా ఉంటుంది. ఆయన ఎపుడెవరికి పొగుడుతారో మరెప్పుడు విమర్శలు చేస్తారో కూడా ఎవరికీ అంతు పట్టదు. అనంతపురం టీడీపీ సమావేశంలో జేసీ చేసిన హాట్ కామెంట్స్ ఆ పార్టీలో మరో మారు వేడి పుట్టించాయి. చంద్రబాబు సమక్షంలోనే జేసీ ఊగిపోతూ అన్న మాటల అర్ధం పరమార్ధం రాజకీయ పండితులకు అర్ధం కానిది కూడా కాదు, చంద్రబాబు మోసపోయారని జేసీ అనడమే ఇక్కడ విడ్డూరం. చంద్రబాబుని ఎంతోమంది నాయకులు పక్కన చేరి మాయ మాటలు చెప్పి నిండా ముంచారట. ఇదీ జేసీ కనుగొన్న నిజం. చంద్రబాబు ఎందుకు ఓడిపోయారంటే తన పక్కన ఉన్న భజన‌ బ్యాచ్ ని నమ్మి మోసపోవడం వల్ల మాజీ అయిపోయారని జేసీ కరడు కట్టిన సత్యాన్ని పెద్దాయన ఎదుటే కుండబద్దలు కొట్టారు.

అసలు బాధా అదేనా…?

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తన చుట్టూ ఉన్న కోటరీని నమ్ముకున్నారని, వారు చంద్రబాబుని వంచించి తప్పుకున్నారని జేసీ అంటున్నారు ఆనాడు తన లాంటి వారి మాటలు చంద్రబాబుకు చేదుగా అనిపించాయని, అసలు తమను నమ్మలేదని కూడా జేసీ సెటైర్లు వేశారు. అంటే తనని నాడు పట్టించుకోలేదని, తన వాళ్లకు టికెట్లు ఇవ్వలేదని చంద్రబాబు ఎదుటనే జేసీ ఎత్తిపొడిచారన్నమాట. అస‌లు బాధ ఇలా ఉంటే చంద్రబాబు కోసమే తాను ఎన్నో చెబితే ఆయన వినలేదని జేసీ అనడం వింతగానే ఉందంటున్నారు. ఇక చంద్రబాబు మాత్రం ఏం చేస్తారు, ఓడిపోయి వచ్చారు. జేసీ ఎన్ని చెప్పినా వినాల్సిందే కదా.

జగన్ ని నమ్మారా…?

ఇది మరీ విచిత్రమైన వ్యాఖ్య. చంద్రబాబు జగన్ ని మంచి వాడిగా భావించి నమ్ముతున్నారని జేసీ అంటున్నారు. ఏ రోజూ చంద్రబాబు జగన్ ని మంచిగా చూడలేదు, నమ్మలేదు. ఈ సంగతి రాజకీయాల మీద కాస్త అవగాహన ఉన్న ఎవరికైనా అర్ధమయ్యేదే. కానీ జేసీ మాత్రం వైఎస్సార్ లాగానే జగన్ మంచి అనుకుంటూ చంద్రబాబు నమ్ముతున్నారని, కానీ ఆయన తన తాత రాజారెడ్డిని నూటికి నూరు శాతం పోలారని అంటున్నారు. జగన్ విషయంలో గట్టిగా ఉండమని కూడా తాను ఆనాడే చెప్పినా చంద్రబాబు వినలేదని కూడా జేసీ అంటున్నారు. ఇదెంతవరకూ నిజమో మరి.

రెండేళ్ళలో సీఎం….

ఇది కదా అసలైన మోసం అని జేసీ అంటున్నారు సొంత పార్టీ నేతలే. ఏపీలో మరో రెండున్నరేళ్ళలో ఎన్నికలు వస్తాయని, చంద్రబాబు మళ్ళీ సీఎం అవుతారని జేసీ చెబుతూండడమే ఇక్కడ విశేషం. అసలు ఎందుకు ఎన్నికలు ముందుగా వస్తాయి. దానికి ఉన్న తార్కికత ఏంటి, ఇదైనా సభలో జేసీ చెప్పకుండా త్వరగా ఎన్నికలు వచ్చేస్తాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అంటూ ఆయన్ని మళ్ళీ వూహాలోకంలో ఊరేగించి రాజకీయ పబ్బం గడుపుకోవడమే అసలైన‌ వంచన అని తమ్ముళ్ళే అంటున్నారు మరి.

Tags:    

Similar News