ఆయన వర్రీస్ అన్నీ జనానికి చుట్టేస్తున్నారు

రాష్ట్రంలో ప్రధాన ప్రతిప‌క్షంగా ఉన్న టీడీపీ.. గ‌డిచిన ఆరు మాసాల్లోనూ ఏం చేసింది ? విప‌క్ష నాయ‌కుడిగా ఉన్న చంద్రబాబు.. గ‌డిచిన ఆరు మాసాల్లోనూ మంచి ప్రతిప‌క్ష [more]

Update: 2019-12-04 08:00 GMT

రాష్ట్రంలో ప్రధాన ప్రతిప‌క్షంగా ఉన్న టీడీపీ.. గ‌డిచిన ఆరు మాసాల్లోనూ ఏం చేసింది ? విప‌క్ష నాయ‌కుడిగా ఉన్న చంద్రబాబు.. గ‌డిచిన ఆరు మాసాల్లోనూ మంచి ప్రతిప‌క్ష నేత‌గా పేరు తెచ్చుకున్నారా ? మేధావులు ఈ కోణంలోనూ ఆలోచిస్తున్నారు. త‌న బాధ‌ను ప్రపంచ బాధ‌గా మ‌లిచేవాడు ఆత్రేయ‌, ప్రపంచం బాధ‌ను త‌న బాధ‌గా మ‌లిచిన వాడు శ్రీశ్రీ అని క‌వులు ఒక మాట చెప్పుకొంటూ ఉంటారు. వీరిలో మొద‌టి త‌ర‌హాకు చెందిన నాయ‌కుడిగా చంద్రబాబు మిగిలిపోయారా ? ఆయ‌న త‌న బాధను రాష్ట్ర ప్రజ‌ల బాధ‌గా అభివ‌ర్ణించ‌డంలోనే ఈ ఆరు మాసాలు గ‌డిచిపోయాయా? అంటే ఔననే స‌మాధాన‌మే వ‌స్తోంది.

ఆన్సర్ లేదే..?

ఆరు మాసాల కాలంలో చంద్రబాబు సాధించింది ఏమైనా ఉందా ? అంటే లేద‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అనేక కార్యక్రమాల‌కు ఆయ‌న పిలుపు ఇచ్చారు. రాష్ట్ర స‌ర్కారుపై అనేక రూపాల్లో నిర‌స‌న వ్యక్తం చేశారు. కానీ, వాటి వెనుక ప్రజా కోణం క‌న్నా స్వీయ కోణ‌మే ఉంద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ప్రజా వేదిక కూల్చివేత‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకున్నారు. అయితే, ఈ విష‌యంలో ప్రభుత్వం లేవ‌నెత్తిన అంశాల‌కు చంద్రబాబు స‌మాధానం చెప్పుకోలేక పోయారు. న‌దీ తీరం వెంబ‌డి నిర్మాణాలు సాగించ‌రాద‌నే కేంద్ర చ‌ట్టాన్ని ఏ విధంగా ప‌క్కకు పెట్టి ఇక్కడ ప్రజావేదిక నిర్మించార‌నే ప్రశ్నకు చంద్రబాబు వ‌ద్ద ఎలాంటి ఆన్సర్ లేక పోవ‌డం గ‌మ‌నార్హం.

ప్రజలకు ఉపయోగమేంటి?

అదే స‌మ‌యంలో త‌ను నివాసం ఉంటున్న అద్దె ఇంటిని కూడా నిబంధ‌న‌ల‌కు వ్యతిరేకంగా నిర్మించార‌ని, చ‌ర్యలు తీసుకుంటామ‌ని జ‌గ‌న్ స‌ర్కారు చెప్పిన‌ప్పుడు దీనిని త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు చంద్రబాబు ప్రయ‌త్నించారు. త‌న‌కు నిలువ నీడ కూడా లేకుండా చేసేందుకు ఎత్తులు వేస్తున్నార‌ని పెద్ద ఎత్తున ప్రజ‌ల్లోకి వ‌చ్చారు. ఈ కోణంలో ప్రజ‌ల‌కు ఉప‌క‌రించే విష‌యం ఏంటో ఆయ‌న చెప్పలేక పోయారు. ఇక‌, అత్యంత కీల‌క‌మైన విష‌యం ఇసుకను తీసుకున్నప్పుడు కూడా జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ విశాఖ‌లో లాంగ్ మార్చ్ నిర్వహించారు. దీనికి భారీ ఎత్తున స్పంద‌న వ‌చ్చిన మాట నిజ‌మే.

దీక్షలు చేసినా….

నిజానికి న‌దుల‌కు పెద్ద ఎత్తున వ‌ర‌ద‌లు రావ‌డం వ‌ల్లే ఇసుక ల‌భ్యత లేకుండా పోయింద‌న్న ప్రభుత్వ వాద‌న‌ను సైతం పెడ‌చెవిన పెట్టిన నాయ‌కులు ఇసుక‌ను అస్త్రంగా చేసుకున్నారు. ఇక‌, ప‌వ‌న్ క‌న్నా ముందుగానే జిల్లాల్లో నిర‌స‌న‌లకు పిలుపు ఇచ్చిన చంద్రబాబు.. ఇవి స‌క్సెస్ కాక‌పోవ‌డం, ప‌వ‌న్ లాంగ్ మార్చ్‌కు భారీ స్పంద‌న రావ‌డంతో క్రెడిట్ కోసం త‌పించి పోయార‌న్న టాక్ కూడా ఉంది. ఈ క్రమంలోనే విజ‌య‌వాడ వేదిక‌గా చంద్రబాబు ఇసుక దీక్ష చేశారు. దీని వ‌ల్ల కూడా ఆశించిన ఫ‌లితం వ‌చ్చిందా ? అంటే లేద‌నేది వాస్తవం.

ఆత్మకూరు విషయంలోనూ….

ఈ క్రమంలోనే చంద్రబాబు గుంటూరులోని ఆత్మకూరులో టీడీపీ కార్యకర్తల‌ను వైసీపీ నాయ‌కులు త‌రిమి కొట్టార‌ని, వారికి ర‌క్షణ లేద‌ని గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు యాగీ చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ స‌భ్యుల‌ను తీసుకువ‌చ్చి.. ఇక్కడ తిప్పారు. ప‌రిస్థితిని గ‌మ‌నించిన క‌మిష‌న్ స‌భ్యులు అంతా బాగానే ఉంద‌ని, చిన్న చిన్న ఘ‌ర్షణ‌లు ఎక్కడైనా ఉన్నవేన‌ని చెప్పింది. ఫ‌లితం.. చంద్రబాబు ప్రయ‌త్నం వృథా. ఇక‌, ఆఖ‌రి అస్త్రంగా అమ‌రావ‌తిని ఎంచుకున్నారు. తాను ఇప్పుడు అధికారంలో లేక పోవ‌డం వ‌ల్లే అమ‌రావ‌తిని జ‌గ‌న్ నాశ‌నం చేస్తున్నార‌ని తీవ్ర విమ‌ర్శలు చేశారు. చేస్తున్నారు.

చెప్పాలనుకున్నది…..

తాను స్వయంగా రంగంలోకి దిగి ఇక్కడి నిర్మాణాల‌ను ప‌రిశీలించారు ఎక్కడివ‌క్కడే ఉన్నాయి. అయితే, ఈ క్రమంలో ప్రజ‌ల‌కు చంద్రబాబు చెప్పాల‌ని అనుకున్నది ఏంటో క్లారిటీ లేకుండా పోయింది. పైగా రాళ్లు, చెప్పుల దాడితో చంద్రబాబు వ్యూహం బెడిసి కొట్టింది. ఇలా మొత్తంగా ఎన్నిక‌ల‌కు ముందు ఉన్న సైలెంట్‌ వ్యతిరేక‌త‌ను కిల్ చేసుకోవ‌డంలోను, ఉత్తమ ప్రతిప‌క్షంగా పేరు తెచ్చుకోవ‌డంలోనూ చంద్రబాబు ఇంకా చాలా చేయాల్సి ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News