ఆశలు వదిలేసుకున్నారా?

చంద్రబాబునాయుడు ఎపుడూ ఒక మాట అంటూంటారు. తాను సవాళ్ళ నుంచే ముందుకుపోతానని, సంక్షోభాల నుంచి పరిష్కారాలు వెతుక్కుంటానని. అయితే ఇపుడు చంద్రబాబు ఎందుకో ప్రతీదానికి మెత్తబడుతున్నారు. బహుశా [more]

Update: 2019-12-03 05:00 GMT

చంద్రబాబునాయుడు ఎపుడూ ఒక మాట అంటూంటారు. తాను సవాళ్ళ నుంచే ముందుకుపోతానని, సంక్షోభాల నుంచి పరిష్కారాలు వెతుక్కుంటానని. అయితే ఇపుడు చంద్రబాబు ఎందుకో ప్రతీదానికి మెత్తబడుతున్నారు. బహుశా అది వయసు మీద పడడం వల్ల వచ్చిన ఆలోచనల వల్ల కాబోలు. లేదా ఆయనకు తత్వం బోధపడిందని కూడా అనుకోవాలని అంటున్నారు. ఇపుడు చంద్రబాబుకు తనవారు ఎవరో పరవారు ఎవరో కూడా బాగా తెలిసివచ్చిందని అంటున్నారు. పార్టీ అధికారంలో ఉంటే చండశాసనుడుగా కనిపించే చంద్రబాబు మాట ఇపుడు ఎవరూ వినడంలేదు. ఆయన ఆదేశాలను సైతం లెక్కలోకి తీసుకోవడంలేదు. దీనికంతటికీ కారణం ఎవరు అని ప్రశ్నించుకుంటే మళ్ళీ చంద్రబాబు వైపే చేతివేళ్ళు చూపిస్తూంటాయి. అయినా ఎన్నికల్లో ఘోరపరాజయం కాదు కానీ చంద్రబాబుకు పాలు, నీళ్ళకు మధ్య తేడా బాగానే తెలుస్తోందని అంటున్నారు.

క్యాడరే ముఖ్యమా…?

ఇదిలా ఉండగా తాజాగా జిల్లాల‌ సమీక్షా సమావేశాల సందర్భంగా చంద్రబాబు చేసిన కొన్ని కామెంట్స్ ఆయన ఆలోచనలను, పార్టీ మీద ఆయనకు ఉన్న నమ్మకాన్ని చాటి చెబుతున్నాయని అంటున్నారు. తనకు ఎవరు ఏమైపోయినా ఫరవాలేదు, పార్టీ క్యాడర్ ముఖ్యమని చంద్రబాబు ఒకటికి పది సార్లు చెబుతున్నారు. చంద్రబాబు పార్టీకి ఇపుడు ఏం తక్కువ లేదు. 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు లోక్ సభ, ఇద్దరు రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో ఎమ్మెల్సీలు ఉన్నారు. అయినా కానీ చంద్రబాబు తనకు క్యాడరే ముఖ్యమని అనడం ఇక్కడ విశేషం. మీరు నాకు కుటుంబం కంటే ఎక్కువ అని కూడా చంద్రబాబు వ్యాఖ్యానిస్తున్నారు. మీరుంటే చాలు మళ్ళీ కొత్త తెలుగుదేశాన్ని నిర్మిస్తానని కూడా చంద్రబాబు అంటున్నారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న మీరు నాకు అందరి కన్నా ఎక్కువేనని కూడా చంద్రబాబు చెబుతున్నారు. మీకు నేను సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా కొన్ని సందర్భాల్లో అన్యాయమే చేశాను, మీరు మాత్రం పార్టీనే అంటిపెట్టుకుని జెండాను మోశారంటూ చంద్రబాబు ఒకింత బావోద్వేగం ప్రదర్శిస్తున్నారు.

నమ్మకం తగ్గిందా….?

ఎంతటి చంద్రబాబు అయినా నచ్చచెప్పగలరు కానీ ఎవరినీ కట్టి పడేయలేరు కదా. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతారని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఒక నాయకుడిగా చంద్రబాబు చివరివరకూ తన ప్రయత్నం కొనసాగిస్తున్నారు. మీరు ఉండాలి. పార్టీ అన్ని విధాలుగా మీకు అండగా ఉంటుంది. మంచి రోజులు వస్తాయి. ఇదే ఎమ్మెల్యేలు అయినా ఇతర నాయకులు అయినా చంద్రబాబు చెబుతున్న సందేశం. మరి కాదని ఎవరైనా వెళ్ళిపోతే ఆయన సైతం ఏం చేయలేరు. అందుకే చంద్రబాబు గెలిచి పదవుల్లో ఉన్న వారి కంటే ఏ పదవీ లేకపోయినా జెండా అంటే అమిత ప్రేమ చూపిస్తున్న క్యాడర్నే నమ్ముకుంటున్నారు. బాబు జిల్లా టూర్ల వెనక కూడా ఉద్దేశ్యం ఇదే. నాయకులు ఎందరు వెళ్ళినా టీడీపీ చెక్కుచెదరకపోవడం వెనక ఉన్న రహ‌స్యం కూడా ఇదే. అందువల్ల చంద్రబాబు క్యాడర్నే తన కుటుంబం అనేశారు. బహుశా చంద్రబాబుకు అర్ధమైపోయి ఉంటుంది, అధికారంలో లేని నాడు నాయకులెవరూ వెంటనడవరని, అందువల్ల ఆయన క్యాడర్నే గట్టిగా నమ్ముకుని ముందుకు సాగుతున్నారు. మరి చూడాలి చంద్రబాబు వీరితో ఎలా రాజకీయ యుధ్ధం చేస్తారో.

Tags:    

Similar News