మైండ్ సెట్ మారలేదే

ఏపీ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు అటు రాజ‌కీయ‌, ఇటు పాల‌న విష‌యాల్లో అనుభ‌వం మెండుగానే ఉంది. ఈ విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి సందేహం లేదు. [more]

Update: 2019-11-25 15:30 GMT

ఏపీ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు అటు రాజ‌కీయ‌, ఇటు పాల‌న విష‌యాల్లో అనుభ‌వం మెండుగానే ఉంది. ఈ విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి సందేహం లేదు. 40 సంవ‌త్సరాల రాజ‌కీయ అనుభ‌వం… 14 సంవ‌త్సరాలు సీఎంగా ఆయ‌న ప‌నిచేశారు. నిజానికి ఈ అనుభ‌వం కార‌ణంగానే 2014 లో ప్రజ‌లు ఏపీలో ఆయ‌నకు అధికారం అప్పగించారు. రాజధాని అమ‌రావ‌తి విష‌యంలో చంద్రబాబు అనుభ‌వం బాగానే ప‌నికి వ‌చ్చింది. విదేశీ కంపెనీల‌ను తీసుకురావ‌డంలోనూ ఆయ‌న దూకుడు ప్రద‌ర్శించారు. లోటు బ‌డ్జెట్‌తో ఉన్న రాష్ట్రానికి కేంద్రం పెద్దగా స‌హ‌క‌రించ‌క‌పోయినా కూడా రాష్ట్రాన్ని ముందుకు న‌డిపించ‌డంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు సాగారు. ఈ విష‌యంలో ఆయ‌న‌కు ఎదురులేద‌నే విష‌యంలో ఎలాంటి విమ‌ర్శలూ లేవు.

పార్టీని కాపాడుకునేందుకు…

అయితే, క్షేత్రస్థాయిలో త‌మ్ముళ్ల హ‌వా పెరిగిపోవ‌డం, ప్రజ‌ల‌కు, చంద్రబాబుకు మ‌ధ్య భారీ గ్యాప్ పెరిగిన నేప‌థ్యంలోనే ఎన్నిక‌ల్లో ప్రజ‌లు టీడీపీని దూరం పెట్టారు. వైసీపీకి అధికారం అప్పగించారు. అయితే, ఇప్పుడు ఎన్నిక‌లు ముగిసి ఆరు మాసాలు అవుతున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు త‌న పార్టీని నిల‌బెట్టుకునేందుకు అనేక ప్రయాస‌లు ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ ప్రభుత్వంపై విమ‌ర్శలు గుప్పిస్తు న్నారు. ఇసుక నుంచి ఇంగ్లీష్ వ‌ర‌కు, అమ‌రావ‌తి నుంచి పోల‌వ‌రం వ‌ర‌కు ప్రభుత్వంపై విమ‌ర్శలు చేస్తున్నారు. పోలీసుల‌ను సైతం హెచ్చరిస్తున్నారు. నిత్యం ఏదో ఒక సంచ‌ల‌న కామెంట్‌తో మీడియాకు ఎక్కుతున్నారు.

మారలేదంటూ….

అయితే, దీనివ‌ల్ల చంద్రబాబుకు రేటింగ్ కానీ, రేంజ్‌కానీ పెరుగుతోందా ? ప‌్రజ‌ల్లో చంద్రబాబుకు మంచి మార్కు లు ప‌డుతున్నాయా ? అంటే లేద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. పైగా జ‌గ‌న్ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చి ఇంకా పురిటి వాస‌న‌లు కూడా పోలేదు. ఇంత‌లోనే ఇన్నేసి విమ‌ర్శలు చేస్తుండ‌డంపై ఓ వ‌ర్గం ప్రజ‌లు చంద్రబాబుపై అస‌హ‌నం వ్యక్తం చేస్తున్నారు. “బాబు మార‌లేదు“ అనే టాపిక్ స‌ర్వత్రా వినిపిస్తోంది. అలా కాకుండా అధికారమే ప‌ర‌మావ‌ధిగా భావించ‌కుండా.. త‌న‌కున్న సూచ‌న‌ల‌ను, స‌ల‌హాల‌ను జ‌గ‌న్‌తో పంచుకుంటే.. ప్రజ‌ల్లో టీడీపీకి రేటింగ్ పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు.

జగన్ అంగీకరిస్తారా?

అయితే, ఇక్కడ స‌హ‌జంగానే సందేశాలు ఉంటాయ్‌. “నేను స‌ల‌హా ఇస్తే.. జ‌గ‌న్ తీసుకుంటాడా?“ అనే మాట చంద్రబాబు నుంచి వ‌చ్చే అవ‌కాశం ఉంది. కానీ, అనుభ‌వం ఉన్న నాయ‌కుడిగా, ప్రపంచం మెచ్చిన నేత‌గా చంద్రబాబు అమ‌రావ‌తి, పోల‌వ‌రం స‌హా అనేక విష‌యాల్లో.. మంచి స‌ల‌హాల‌ను ఇచ్చి, వాటిని ప‌త్రికా రూపంలోనో మీడియా రూపంలోనో ప్రజ‌ల‌కు కూడా వివ‌రిస్తే.. ప్రజ‌ల్లో కూడా చంద్రబాబుపై పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది క‌దా! అంటున్నారు. కేవ‌లం విమ‌ర్శల‌కే ప‌రిమిత‌మైతే.. చంద్రబాబుకు, సాధార‌ణ నేత‌కు తేడా ఏం ఉంటుంద‌ని ప్రశ్నిస్తున్నారు. మ‌రి చంద్రబాబు ఇప్పటికైనా త‌న మైండ్ సెట్ ను మార్చుకుంటారో లేదో ?చూడాలి.

Tags:    

Similar News