బాబుకు భయమూ.. బెంగానట

చంద్రబాబు అధికారంలో ఉండగా ఏదీ పట్టదు. ముఖ్యంగా పార్టీ నేతలను పట్టించుకోరు. ఎంతసేపూ తాను హైలెట్ అవుతూనే ఉంటారు. అందుకే పార్టీ క్యాడర్ టీడీపీ అధికారంలోకి వచ్చినా [more]

Update: 2020-10-25 15:30 GMT

చంద్రబాబు అధికారంలో ఉండగా ఏదీ పట్టదు. ముఖ్యంగా పార్టీ నేతలను పట్టించుకోరు. ఎంతసేపూ తాను హైలెట్ అవుతూనే ఉంటారు. అందుకే పార్టీ క్యాడర్ టీడీపీ అధికారంలోకి వచ్చినా పెద్దగా ఆశలుపెట్టుకోదు. 2014లో ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పార్టీని ఏ మాత్రం పట్టించుకోలేదు. కనీసం నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేయలేకపోయారు. పోస్టులు భర్తీ చేస్తే విభేదాలు తలెత్తుతాయన్న భయమో? లేక వారంతా అవినీతికి పాల్పడతారని బెంగో తెలియదు కాని చంద్రబాబు మాత్రం నామినేటెడ్ పోస్టులను పార్టీ నేతలకు ఇచ్చేందుకు ఎప్పుడూ సుముఖంగా ఉండరు.

ఇతర పార్టీల నుంచి…..

ఇది పార్టీ నేతలే స్వయంగా అంగీకరిస్తున్న విషయం. కొన్ని పోస్టులు భర్తీ చేసినా అది ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. ఇతర పార్టీల నుంచి ఆకర్షించడానికే ఈ పదవులను కూడా భర్తీ చేశారంటారు. జూపూడి ప్రభాకర్ రావు, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి నామినేటెడ్ పదవులు ఇవ్వడం అటువంటి కోవలోనివే. కానీ పార్టీని ఏళ్లుగా నమ్ముకున్న వారిని మాత్రం పట్టించుకోలేదు.

జగన్ పెద్దయెత్తున….

ఇప్పుడు జగన్ ప్రభుత్వం బీసీలకు పెద్దయెత్తున పదవులు భర్తీ చేయడంతో చంద్రబాబు పార్టీ విషయంలో అనుసరిస్తున్న తీరు హాట్ టాపిక్ గా మారింది. జగన్ మొత్తం 56 బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవులను, 672 డైరెక్టర్ పదవులను కూడా భర్తీ చేశారు. చంద్రబాబు హయాంలో ఇంత పెద్దయెత్తున నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడం ఎప్పుడూ జరగలేదన్న విషయాన్ని సీనియర్ నేతలు సయితం అంగీకరిస్తున్నారు. ఒక విధంగా జగన్ పార్టీ నేతలకు పదవులు ఇవ్వడాన్ని వారు సమర్థిస్తున్నారు.

టీడీపీలో హాట్ టాపిక్……

పైకి జగన్ నిర్ణయాన్ని టీడీపీ నేతలు తప్పుపడుతున్నా, తమ నేత చంద్రబాబు చేయలేని పనిని జగన్ చేశారని చివరకు టీడీపీలోని బీసీ నేతలు సయితం అంగీకరిస్తున్నారు. చంద్రబాబుకు అధికారం వస్తే పార్టీ కనపడదని, విపక్షంలో ఉన్నప్పుడే క్యాడర్ కన్పిస్తుందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే ఈసారి చంద్రబాబు మారారని, ఈసారి అధికారంలోకి వస్తే పార్టీ నేతలకు పండగేనని చెబుతూ క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు పార్టీ నేతలపై అనుసరిస్తున్న వైఖరి మరోసారి టీడీపీలో చర్చనీయాంశంమైంది.

Tags:    

Similar News