ఎమోషనల్ టచ్ లేనే లేదు

రాజకీయాలు ఫక్తు బిజినెస్ గా మారిపోయాయి. అలా ఆంధ్రప్రేదేశ్ రాజకీయాలు మారిపోవడానికి రాజకీయ చాణుక్యుడు చంద్రబాబే కారణం అన్నది ఆ పార్టీ నుంచి బయటకు ఎవరు వచ్చినా [more]

Update: 2019-11-17 14:30 GMT

రాజకీయాలు ఫక్తు బిజినెస్ గా మారిపోయాయి. అలా ఆంధ్రప్రేదేశ్ రాజకీయాలు మారిపోవడానికి రాజకీయ చాణుక్యుడు చంద్రబాబే కారణం అన్నది ఆ పార్టీ నుంచి బయటకు ఎవరు వచ్చినా చెప్పే మొదటి మాట. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం ఘోర పరాభవం తరువాత ఓటమి పై జరిగిన అంతర్గత చర్చల్లో పలువురు నేతలు బహిరంగంగానే చంద్రబాబు ముందు ఎమోషనల్ టచ్ టిడిపి లో లేకుండా పోయిందని నేరుగా అధినేత ముందే వాపోయారు. దాంతో అప్పటినుంచి ఈ విషయాన్నీ చంద్రబాబు సీరియస్ గానే తీసుకుని అందరితో భోజనాలు, టీలు, టిఫిన్స్ లాగిస్తున్నారు. తాను మారిపోయాననే సంకేతాలు బలంగానే కిందిస్థాయికి పంపుతున్నారు. అయితే ఇదంతా అధికారంలోకి ఆయన వచ్చే వరకే అని నేతలు సణుక్కోవడం గమనార్హం.

ముఖ్యమంత్రి కావడానికి వారిని వాడుకుని …

ఎన్టీఆర్ కి దెబ్బకొట్టేందుకు గట్టి ప్రణాళికనే చంద్రబాబు అమలు చేశారు. ముందుగా నందమూరి హరికృష్ణ చేతే తిరుగుబాటు చేయించి పార్టీ అధినేతను మానసికంగా దెబ్బతీశారు. ఆ తరువాత తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉపముఖ్యమంత్రి పదవి ఆశపెట్టి ఆయనకు హ్యాండ్ ఇచ్చారు. రాజకీయం ముందు మిత్రులు, బంధువులు అనే తేడా కానీ ఎమోషనల్ అటాచ్ మెంట్ లు సెంటిమెంట్ లు చంద్రబాబు కి ఉండనే ఉండవని ఈ సంఘటనలు చాటి చెబుతున్నాయి. అలాగే ఎన్నికల ముందు మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత హోదాలో 2014 లో పవన్ కళ్యాణ్ తో రాజకీయ అవసరాన్ని గుర్తించి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లిపోయారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో విజయం సాధించాక ఒక పక్క తన మంత్రులు ఇతర నేతలతో పవన్ ను తిట్టిస్తూ మరోపక్క స్నేహం నటిస్తూ జనసేనాని పూర్తిగా వాడుకుని వదిలేశారు చంద్రబాబు అన్నది ఆ పార్టీలో ఉన్నవారు అంగీకరించే సత్యం.

బ్లాక్ మెయిలింగ్ మాత్రం వుంది …

టిడిపి లో ఎన్టీఆర్ మరణం తరువాత కార్పొరేట్ స్టైల్ పాలిటిక్స్ కి తెరలేచింది. అంగ అర్ధబలం వున్న నేతలకు ఒక రేంజ్ లో ట్రీట్ మెంట్ లభిస్తే నాలుగు దశాబ్దాలుగా పార్టీ జండా మోసిన కార్యకర్తలకు మాత్రం సాదా సీదా గుర్తింపు లభిస్తూ వస్తుంది. ఇక పదవుల పందేరంలో ఈ అంశం క్రిస్టల్ క్లియర్ గా అందరికి తేటతెల్లం అయ్యేది. రాజ్యసభ ఎమ్యెల్సీ పదవుల పంపకాల్లో బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పడిన టిడిపి లో అర్ధబలం వున్నవారికే అందలం దక్కుతూ పోతుంది. రాత్రికి రాత్రి వచ్చి పార్టీలో చేరిన టిజి వెంకటేష్, పక్క పార్టీనుంచి వచ్చిన పితాని సత్యనారాయణ, ఎన్నికల్లో ఆర్ధిక సాయానికి ప్రతిగా ప్రజలనుంచి పోటీ లేకుండా ఎమ్యెల్సీ ఇచ్చి మంత్రి చేసిన నారాయణ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది బడాబాబులకు చంద్రబాబు పెద్దపీట వేస్తూ తన మార్క్ పాలిటిక్స్ తో తన గొయ్యి తానే తవ్వుకుంటూ పోయారు. దీనివల్లే ఎమోషనల్ టచ్ పోయి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ మాత్రమే పసుపు పార్టీలో రాజ్యం ఏలుతుందని తమ్ముళ్ళు లబోదిబో అంటున్నారు.

సీనియర్లు హెచ్చరించినా …

పార్టీ సిద్ధాంతానికి విరుద్ధంగా ఎన్టీఆర్ ఆశయానికి తూట్లు పొడుస్తూ కాంగ్రెస్ తో చేతులు కలిపేశారు చంద్రబాబు. ఈ విషయాన్ని టిడిపి లో వున్న సీనియర్లు సీరియస్ గానే వ్యతిరేకించారు. చింతకాయల అయ్యన్న పాత్రుడు వంటివారు ప్రజలు గుడ్డలు వూడతీసి తమను కొడతారంటూ ధైర్యంగా ఘాటు గానే హెచ్చరించారు. అయినా చంద్రబాబు ఆ విషయాన్నీ విస్మరించారు. అయ్యన్న చెప్పినట్లే ప్రజలు కాంగ్రెస్ తో చంద్రబాబు దోస్తీని ఛీ కొట్టారు. రాజకీయ వలువలు ఊడతీసి 23 సీట్లే కట్టబెట్టారు. ఎంపీ స్థానాల్లోనూ అదే రీతిలో మూడు స్థానాలే దక్కేలా చేశారు. ఇక మరో ఫౌండర్ మెంబర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసిపి నుంచి ఎమ్యెల్యేలను చేర్చుకుని మంత్రి పదవులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. టిడిపి అధినేత ధోరణి ఇలానే కొనసాగితే గట్టి దెబ్బలు తగులుతాయని హెచ్చరించారు. ఆ హెచ్చరికలను అధినేత చంద్రబాబు పక్కన పెట్టారు.

పెద్దలు చెప్పిన మాటలను….

బుచ్చయ్య చెప్పినట్లే జరిగింది. ప్రజలు ఈ ఫిరాయింపు దారులకు గట్టిగా బుద్ధి చెప్పారు. దాంతో బాటు టిడిపి సీట్లు ఘోరంగా తగ్గిపోవడానికి ఈ వ్యవహారం కూడా కారణం గా నిలిచింది. ఇక ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కేఈ కృష్ణ మూర్తి చంద్రబాబు తీరును తప్పుపట్టారు. కాంగ్రెస్ తో దోస్తీ పార్టీకి చేటు తెస్తుందని బాహాటంగానే ధ్వజం ఎత్తారు. అయినా చంద్రబాబు విస్మరించారు. అంతే కాదు ఇలా పార్టీ అధినేత చేస్తున్న తప్పులను ఎత్తి చూపే వారికి చంద్రబాబు గట్టి కౌన్సిలింగ్ లే ఇచ్చారు. 150 సీట్లు గెలుస్తామంటూ బీరాలు పోయి ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చూసి కుదేలు అయ్యారు. ఫలితాలు పూర్తి రివర్స్ లో రావడంతో ఆ షాక్ నుంచి ఇప్పటికి చంద్రబాబు అండ్ కో తేరుకోలేక పోతున్నారంటే సీనియర్లు చెప్పిన హితవచనాలు పెడచెవిన పెట్టిన ఫలితమే అని పార్టీ వర్గాలు వాపోతున్నాయి. అయితే ఇప్పటికైనా పార్టీ అభివృద్ధికి నిరంతరం ఆలోచించే పెద్దల మాట చంద్రబాబు వింటారా లేక లోకేష్ విజన్ లో ముందుకు నడుస్తారా అన్నది చూడాలి.

Tags:    

Similar News