గెలిస్తేనే డిక్టేటర్‌…. లేకుంటే …?

గెలుపొటముల్ని చంద్రబాబు చాలా ఈజీగా తీసుకుంటారు. ఓడిపోగానే నీరుగారిపోయే తత్వం కాదు. అందివచ్చే ప్రతీ అవకాశాన్ని కసిగా రాజకీయంగా ఎలా వాడుకోవాలో ఆయన్ని చూసి నేర్చుకోవాలి. అవసరమైతే [more]

Update: 2019-09-17 12:30 GMT

గెలుపొటముల్ని చంద్రబాబు చాలా ఈజీగా తీసుకుంటారు. ఓడిపోగానే నీరుగారిపోయే తత్వం కాదు. అందివచ్చే ప్రతీ అవకాశాన్ని కసిగా రాజకీయంగా ఎలా వాడుకోవాలో ఆయన్ని చూసి నేర్చుకోవాలి. అవసరమైతే చాలా కిందకు దిగగలరు. లేకుంటే ఎవరూ అందనంత దూరంలో పెట్టగలరు. అవతలి వారితో అవసరాన్ని బట్టి సందర్బోచితంగా వ్యవహరించడంలో ఆయనకు సాటి వచ్చే నాయకులెవరు సమకాలీన రాజకీయాల్లో కనిపించరు. 100 రోజులు కూడా నిండని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పతాక స్థాయిలో జాతీయ మీడియాలో ఇటీవల కథనాలు పోటెత్తాయి. ఏకకాలంలో ఐదారు దినపత్రికలు ఒకే తరహా కథనాలు ప్రచురించాయి. వాటిని తెలుగు పత్రికలు అనువదించి అచ్చొత్తాయి. ఏపీలో అందరికి తెలిసిన విషయాలే అయినా ఢిల్లీ నుంచి వచ్చే పత్రికా సంపాదకీయాల్లో ఎలా వచ్చాయో ఎవరికి అంతుచిక్కలేదు. అదీ చంద్రబాబు చాణక్యం. వారాంతాల్లో హైదరాబాద్ పారిపోతున్నారని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తుంటే చంద్రబాబు తన పని తాను చేసుకుంటున్నారు.

ఎడిటర్లకు ఫోన్లు…. ఫిర్యాదులు…

….
మీడియా మేనేజ్‌మెంట్‌ విషయంలో చంద్రబాబు స్టయిలే వేరు. ప్రతిపక్షంలోకి వచ్చాక కొద్ది రోజులు ఓపిక పట్టినా వెంటనే చాడీలు ప్రారంభించారు. నేరుగా జాతీయ పత్రికల ఎడిటర్లకు ఫోన్లు చేయడం ఏపీలో తాను పడుతున్న బాధల్ని ఏకరువు పెట్టడం మొదలుపెట్టారు. చంద్రబాబులాంటి నాయకుడు., అందులోను జాతీయ రాజకీయాల్ని అంతో ఇంతో ప్రభావితం చేయగలిగిన వ్యక్తి జావగారిపోయి తమకు మొరపెట్టుకుంటే ఎవరికైనా కలుక్కుమనకపోదు. ఇక్కడే ఆయన సక్సెస్‌ అయ్యాడు. పుంకానుపుంఖాలుగా సమాచారాన్ని విశ్లేషించే నాలెడ్జ్‌ సెంటర్‌తో ప్రభుత్వ వైఫల్యాల మీద పత్రికలకు నివేదికలు సమర్పించడం ద్వారా కోరుకున్నది సాధించారు. చంద్రబాబు జట్టులో ఇలా మీడియా మేనేజ్‌మెంట్ కోసమే ఓ బృందం పనిచేస్తుంటుంది. ఢిల్లీలో అయినా…. ఏపీలో అయినా జర్నలిస్టుల్ని పెంచి పోషించడమే వీళ్లపని. మీడియా మిత్రుల్ని విందు వినోదాల్లో ముంచెత్తడం… వార్తల్లో అనుకూల లీకులు ఇప్పించడం కోసం అంతర్జాతీయ స్థాయి కన్సల్టెంట్లు ఆయన కోసం పనిచేస్తుంటారు. అధికారంలో ఉండగా నెలకు మూడు కోట్లు చెల్లించి మరీ ఇలాంటి సేవలు పొందేవారు. వ్యక్తిగత సిబ్బంది చాపకింద నీరులా పనిచేస్తూనే ఉంటారు.

జగన్‌ వ్యవహార శైలే కొండంత అండ…

పత్రికల్లో జగన్‌ వ్యతిరేక కథనాలు రావడానికి ఆయన వ్యవహార శైలే ప్రధాన కారణం. ఎవరితో మాట్లాడరు. ఎవరికి సమాధానం ఇవ్వరు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మీడియా సమావేశం నిర్వహించలేదంటే ఆయన స్టయిల్ అర్ధం చేసుకోవచ్చు. ఆయన అన్నింటికి., అందరికి బదులు చెప్పాల్సిన అవసరం లేకపోవచ్చు. కానీ ఆయన తరపున కూడా ఎవరు మాట్లాడరు. మంత్రులు., ఏరికోరి తెచ్చుకున్న అధికారులు కూడా ఆయన తరపున వకాల్తా పుచ్చుకోకపోవడమే అన్ని సమస్యలకు కారణం. మీడియా సహకారం ఉన్నా లేకున్నా ప్రజల మద్దతు ఉంటే చాలనుకుంటారు జగన్మోహన్‌ రెడ్డి. 2010 నుంచి 2019 వరకు ఏపీలో ప్రధాన స్రవంతి మీడియా అండగా లేకున్నా ప్రజలు ఆదరించారు కాబట్టే విజయం వరించిందని ఆయన భావిస్తారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే వైఖరితో ఉండటమే క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందనే విషయంలో స్పష్టత లేకుండా పోతోంది. వాస్తవ పరిస్థితికి., ఆయనకు అందే సమాచారానికి మధ్య చాలా సందర్భాల్లో బోలెడు అంతరం కనిపిస్తుంది.

చంద్రబాబుకు పోయేదేముంది…?

చంద్రబాబు అధికారంలో ఉన్నా లేకున్నా పెద్దగా ఇప్పుడు ఆయనకు వచ్చిన నష్టమేది ఉండదు. జగన్‌ మాదిరి బాబు ఎమోషనల్‌ కాదు. ఆచరణాత్మక రాజకీయవేత్త. 1978నుంచి ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. 1983 ఎన్నికల్లో సొంత మామ మీద సవాల్‌ చేసి, కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి ఓడినపుడే ఆయన రాజకీయ జీవితం పూర్తికావాల్సింది. ఏ మాత్రం సంకోచం లేకుండా 180 డిగ్రీలు వెనక్కి తిరిగి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. సాధారణ కార్యకర్తగా ఆ పార్టీలో చేరి ఓ ఇమేజ్ కోసం తీవ్రంగా శ్రమించిన నేపథ్యం చంద్రబాబుకుంది. 1984లో నాదెండ్ల వ్యవహారం….1985 ఎన్నికల్లో గెలుపు తర్వాత కూడా చంద్రబాబు ప్రయాణం నల్లేరు మీద నడక కాలేదు. 1989లో ఓటమి తర్వాత ఐదేళ్లు చంద్రబాబు పార్టీలో ఓపిగ్గా నెట్టుకొచ్చారు. 1994లో గెలిచిన తర్వాత కానీ ఆ‍యనకు అవకాశం రాలేదు. టీడీపీలో దశాబ్ద కాలం పని చేసిన తర్వాత ఆయన ఎన్టీఆర్‌ నుంచి ఒడుపుగా అధికారాన్ని లాగేయగలిగారు. బాబుకి రాజకీయాల్లో తనకు ఏం కావాలనే విషయంలో స్పష్టత ఉంది. తన బలం, బలహీనతల విషయంలో క్లారిటీ ఉంది. సిద్దాంతాలు., ఎమోషన్స్‌., మూర్ఖత్వం వంటి విషయాల జోలికి దూరంగా ఉంటారు. రాజకీయాల్లో ఎక్కడి నుంచి ఎక్కడికి సాగినా అది చంద్రబాబు చాతుర్యమే. రాజకీయ జీవితంలో భిన్నమైన సమయాల్లో విభిన్నమైన వ్యవహారాల శైలితో తన రూపును మార్చుకోగల సత్తా చంద్రబాబుకుంది.

ఆయన స్టైల్ వేరు…. తక్కువ అంచనా వద్దు….

కాంగ్రెస్‌లో మంత్రి స్థాయి నుంచి టీడీపీలో రకరకాల పదవుల్లో ఉండి…. ఎన్టీఆర్‌ కుడిభుజంగా ఉంటూనే ఆయన కుర్చీని సొంతం చేసుకున్న నేర్పు…. నేపథ్యం చంద్రబాబుకు ఉంది. 1998లో వాజ్‌పేయ్‌ని ప్రధాని కానివ్వనని శపథం చేసి ఎన్నికల తర్వాత నిస్సంకోచంగా ఆ‍యనకు మద్దతు ఇవ్వగలగడం ఆయన ప్రత్యేకత. పనిచేయడం ఎంత ముఖ్యమో…. పనిచేస్తున్నట్లు కనిపించడం కూడా ఆయనకు బాగా తెలుసు. అందుకే 20 ఏళ్ల క్రితమే జాతీయ… అంతర్జాతీయ మీడియాను సులువుగా ఆకర్షించగలిగారు. అలాంటి చంద్రబాబు మూడు నెలల్లోనే మళ్లీ తిరుగులేని ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ముందే వచ్చే జమిలీ కావొచ్చు, రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చనే ఆలోచన కావొచ్చు. చంద్రబాబు అండ్‌ కో కు ఉండే వ్యూహాలు కావొచ్చు. అందుకే దూకుడుగా ప్రభుత్వం మీదకు పోతున్నారు. ఈ విషయంలో తగిన వ్యూహాలు లేకపోతే జగన్మోహన్‌ రెడ్డికి చిక్కులు తప్పవు.

Tags:    

Similar News