అది ఇస్తే ఒకేనా?

అమరావతి లోనే రాజధాని ఉండేలా టిడిపి అధినేత చంద్రబాబు ఎపి అంతా కలియ తిరుగుతున్నారు. ఒక పక్క రైతులు ఆ ప్రాంతం లో ఉద్యమం చేస్తుంటే చంద్రబాబు [more]

Update: 2020-01-19 09:30 GMT

అమరావతి లోనే రాజధాని ఉండేలా టిడిపి అధినేత చంద్రబాబు ఎపి అంతా కలియ తిరుగుతున్నారు. ఒక పక్క రైతులు ఆ ప్రాంతం లో ఉద్యమం చేస్తుంటే చంద్రబాబు జోలె పట్టుకుని మరీ స్పీడ్ పెంచారు. ప్రతీ చోటా ఆ ప్రాంత రైతులను, యువతను, మహిళలను ఆయన తెగ రెచ్చగొడుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోతుందని గగ్గోలు పెడుతున్నారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ తన కోసం కాదని భావితరాలకోసం అంటూ చంద్రబాబు చండ్ర నిప్పులే విరజిమ్ముతున్నారు.

అధికారపార్టీ అలా …

మరో పక్క అధికారంలో వున్న వైసిపి చంద్రబాబు అండ్ కో ఇన్ సైడ్ ట్రేడింగ్ కి పెద్ద ఎత్తున పాల్పడ్డారని ఆరోపిస్తుంది. పావలాకు పేద రైతుల దగ్గర భూములు కొని తమవారికి ముఖ్యంగా తన సామాజిక వర్గం లబ్ది పొందేలా అమరావతిని ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ గా మార్చారంటూ విరుచుకుపడుతూనే వుంది. అమరావతి లో క్యాపిటల్ ఎపి అభివృద్ధి కోసం కాదని చంద్రబాబు ఆయన కుటుంబం, తెలుగుదేశం అభివృద్ధికి అన్నది పదేపదే చెప్పుకొచ్చింది కూడా. ఈ ఆరోపణలు వైసిపి కొత్తగా చేసినవి కావు. విపక్షంలో ఉన్నప్పటినుంచి ఈ ఆరోపణలని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళింది వైసిపి. ఆ ఆరోపణలను నమ్మే జనం జగన్ కి అఖండ మెజారిటీ ఇవ్వడమే కాదు ఎపి లో పార్టీ ఉద్యమాలు తప్ప ప్రజా ఉద్యమాలుగా అమరావతి ఇష్యూ లేకుండా పోయింది. జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించకపోయినా ప్రజలు వ్యతిరేకించడం లేదు సరికదా మా ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి చేస్తారనే ప్రశ్నలనే అధికారపార్టీ కి సంధిస్తున్నారు.

ఎకరాకు పదికోట్ల రూపాయలు ….

అమరావతి లో ల్యాండ్ పూలింగ్ లో రైతులు ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. అంటే కేవలం అభివృద్ధి పరిచి ఆ భూముల్లో 33 శాతం వారికి ప్రభుత్వం ఇచ్చేలా. ఒక అపార్ట్ మెంట్ కానీ ఒక వెంచర్ కి భూ యజమాని బిల్డర్ నడుమ ఒప్పందం మాదిరి సర్కార్ నేరుగా అమరావతి రైతులతో వ్యాపారానికి దిగిపోయింది. ఇలా రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం రద్దు అయితే తదుపరి నష్టపరిహారాలు ఎంత ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేది సీఆర్డీఏ నిబంధనల్లో పేర్కొనలేదు. దాంతో రైతులు నష్టపోకుండా ఏం చేయాలనే అంశంపై ప్రభుత్వం ఒక పక్క కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో కొందరు రైతులు సర్కార్ ఇచ్చే తాయిలాలలకు ఉద్యమాన్ని వదిలి వెళ్లే అవకాశాలు కూడా వున్నాయి. అలా జరిగితే చంద్రబాబు, ఆయన పోరాటానికి అండగా నిలిచిన జెఎసి ఫెయిల్యూర్ అవుతాయి. దాంతో చంద్రబాబు ఒక కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. భూములు ఇచ్చి నష్టపోయిన రైతులకు పదికోట్ల రూపాయలు ఎకరాకు ఇవ్వాలన్నది ఆయన వాదన.

అనుకున్నట్లు వ్యాపారం జరిగి ఉంటే …

అమరావతి ప్రకటనకు ముందు ఎకరా 10 లక్షల నుంచి మూడు పంటల భూములు అయితే 30 లక్షల రూపాయల వరకు ఆ ప్రాంతంలో ధరలు పలికేవి. అయితే ఎప్పుడైతే రాజధానిగా అమరావతి ప్రకటించారో వెంటనే ఎకరం భూమి ప్రాంతాన్ని బట్టి కోట్లకు చేరుకుంది. చాలామంది రైతులు వచ్చిన అవకాశం వినియోగించుకుని అమ్ముకుని కోట్ల రూపాయలకు పడగలెత్తారు. మరికొందరు ఇంకా ఎక్కువ మొత్తమే దక్కుతుందని ఆశపడి అమ్మకానికి దిగలేదు. ఇక నాడు అధికారంలో వున్న నేతలు చాలామంది తమదగ్గర పోగేసిన సొమ్ము తోబాటు అప్పులు చేసి మరీ భూములు కొనిపాడేశారు. ఇదంతా చంద్రబాబు వ్యాపారదక్షతను చూసే అని ఆఫ్ ది రికార్డ్ టాక్. హైద్రాబాద్ ప్రాంతంలోని హైటెక్ సిటీ దగ్గర ఇదే రీతిలో తమ వారికి ముందే సమాచారం ఇచ్చి తక్కువ ధరకు భూములు కొని ఆ తరువాత కోట్లాదిరూపాయలు వారికి సమకూరేలా చంద్రబాబు చేయగలిగారన్న నమ్మకంతోనే పెట్టుబడి పెట్టామని కానీ అమరావతిలో సీన్ రివర్స్ కావడంతో బాబు చేసే పోరాటానికి వెనుక నిలబడక తప్పని పరిస్థితి ఏర్పడిందని వాపోయేవారు వున్నారు.

బాబు పదికోట్ల రాగం వెనుక …

అందుకే చంద్రబాబు పదికోట్ల రూపాయల డిమాండ్ తెచ్చి అందరిని ఓదార్చే పనిలో పడ్డారని అంటున్నారు. వ్యాపారం గా ఎపి క్యాపిటల్ ను చూసారు కనుక లాభం వస్తే ఆనందించడమే కాదు నష్టం వచ్చినా స్వీకరించాలని రైతులకు ఇప్పటివరకు చూపించిన గ్రాఫిక్స్ చాలని ఇప్పుడు మరిన్ని లేనిపోని ఆశలు వారిలో మొలకెత్తించి పదికోట్ల రూపాయలంటూ చెప్పడం విడ్డురమని వైసిపి ఎద్దేవా చేస్తుంది. మొత్తానికి చంద్రబాబు చేసిన తాజా ప్రకటన మాత్రం దేశంలో ఎక్కడా లేని ధరను సూచించడం మాత్రం మరో చర్చకు తెరతీసిందనే చెప్పొచ్చు.

Tags:    

Similar News