జగన్ కు సలామ్ చేయరా…??

ఆంధ్రప్రదేశ్ లో ముస్లింల ఓట్లే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కా వ్యూహం అమలు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్న మైనారిటీల ఓట్లు ఈసారి [more]

Update: 2019-04-06 02:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో ముస్లింల ఓట్లే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కా వ్యూహం అమలు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్న మైనారిటీల ఓట్లు ఈసారి తమ ఖాతాలోకే వేసుకోవడమే టీడీపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే మైనారిటీలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు మైనారిటీలకు ఓ భారీ హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో టీడీపీకి దూరంగా ఉన్న మైనారిటీలను ఈసారి తమ వైపు తిప్పుకునేందుకు ఈ నిర్ణయం ప్రకటించారు. ఇప్పటికే ఆరు నెలల క్రితం ముస్లింలకు మంత్రి పదవి ఇచ్చి వారిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో జగన్ నరేంద్ర మోడీతో కలిశారని ఆరోపిస్తూ ముస్లింలను జగన్ కు దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

30 నియోజకవర్గాల్లో ప్రభావం….

ఆంధ్రప్రదేశ్ లో సుమారు 30 నియోజకవర్గాల్లో ముస్లింలు గెలుపోటములు ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. ముఖ్యంగా రాయలసీమలో వీరి ప్రభావం ఎక్కువ. కర్నూలు, కడప, గుంటూరు తూర్పు, నంద్యాల, నెల్లూరు టౌన్, విజయవాడ పశ్చిమ, రాయచోటి, హిందూపురం, కదిరి, మదనపల్లె, అనంతపురం, కదిరి, తాడిపత్రి, చిలకలూరిపేట, నరసరావుపేట, ఆళ్లగడ్డ, గురజాల, మాచర్ల, పెదకూరపాడు, పొన్నూరు, తెనాలి, బాపట్ల, సత్తెనపల్లి, రేపల్లె, మార్కాపురం, గుంతకల్లు, రాయదుర్గం, ధర్మవరం, ప్రొద్దుటూరు, ఆదోని, శ్రీశైలం, బనగానపల్లె, నందికొట్కూరు నియోజకవర్గాల్లో ముస్లింలు అధికంగా ఉన్నారు. ఈ స్థానాల్లో ముస్లింలు గెలుపోటములను ప్రభావితం చేయగలరు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఈ స్థానాలు, ఇక్కడి ముస్లిం ప్రజల మనస్సులు గెలుచుకోవడం ప్రధానం. అందుకే వీరిని ఆకర్షించేందుకు తెలుగుదేశం పార్టీ, వైసీపీ ప్రయత్నిస్తున్నాయి.

వైసీపీ వైపు ముస్లింలు…

గత ఎన్నికల్లో ముస్లింలు ఎక్కువగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం ద్వారా ముస్లిం విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ రెండు నిర్ణయాలు ముస్లింలకు చాలా మేలు చేశాయి. తెలంగాణ అసెంబ్లీలో సైతం ఈ విషయంలో వైఎస్ ను కీర్తించారు అక్కడి ముస్లిం ఎమ్మెల్యేలు. దీంతో గత ఎన్నికల్లో ముస్లింలలో మెజారిటీ ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ వైపే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కూడా వైసీపీకి కలిసి వచ్చింది. గత అసెంబ్లీలో గెలిచిన నలుగురు ముస్లిం ఎమ్మెల్యేలూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. ఈసారి కూడా ముస్లింలకు టిక్కెట్ల కేటాయింపులో వైసీపీ బాగానే ప్రాధాన్యత ఇచ్చింది. గత ఎన్నికల్లో రెడ్డిలకు ఇచ్చిన కర్నూలు, మదనపల్లె టిక్కెట్లు ఈసారి ముస్లింలకు ఇచ్చింది. ఇక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముస్లింలకు ప్రతినిధిగా ఉన్న ఎంఐఎం పార్టీ కూడా పూర్తి మద్దతు ఇస్తోంది. ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా పెద్దగా బలం లేకున్నా తమ పార్టీ అనే భావన మాత్రం ముస్లింలలో ఉంది. జగన్ సభల్లో కూడా ఎంఐఎం శ్రేణులు పాల్గొంటున్నాయి. దీంతో ఈసారి కూడా ముస్లింలు తమ వైపే ఉంటారని జగన్ భావిస్తున్నారు.

బీజేపీతో దూరమైన నాటి నుంచి

అయితే, జగన్ కు చెక్ పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. బీజేపీతో కలిసి ఉన్నప్పుడే ముస్లింలు ఎక్కువగా ఉన్న నంద్యాల ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు లేకుండా పోటీ చేసింది. అదే సమయంలో ముస్లింలు ఎక్కువగా లేని కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం బీజేపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసింది. ఇక, బీజేపీ నుంచి దూరమయ్యాక ఆయన తన వ్యూహానికి పదును పెట్టారు. ఆరు నెలల క్రితం ముస్లిం వర్గానికి చెందిన ఫరూక్ కు ఎమ్మెల్సీ ఇచ్చారు. తర్వాత మంత్రివర్గంలోకి కూడా తీసుకొని ముస్లింలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక, ముస్లింలకు పెళ్లి కానుక, రంజాన్ తోఫా వంటి పథకాలను అమలు చేయడం కూడా కలిసివస్తుందని భావిస్తున్నారు. ఇక, చివరి అస్త్రంగా ఈసారి గెలిస్తే ముస్లింలకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. ఇదే సమయంలో మోడీ – జగన్ ఒక్కటే అనే ప్రచారాన్ని ముస్లిం ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. మరి, చంద్రబాబు ప్రయత్నాలు ఫలించి ముస్లింలు ఆ పార్టీ వైపు ఉంటారో లేదో చూడాలి.

Tags:    

Similar News