చంద్ర‌బాబు స‌ర్వే.. గ‌డ్డు ప‌రిస్థితిలో ఆ ఎమ్మెల్యేలు..!

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ అధికార పార్టీ టీడీపీలో టికెట్ల వేట మొద‌లైంది. అందుకే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న నాయ‌కులు పార్టీ అధినేత చంద్ర‌బాబును క‌లిసేందుకు అమ‌రావ‌తిలో [more]

Update: 2019-02-06 04:30 GMT

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ అధికార పార్టీ టీడీపీలో టికెట్ల వేట మొద‌లైంది. అందుకే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న నాయ‌కులు పార్టీ అధినేత చంద్ర‌బాబును క‌లిసేందుకు అమ‌రావ‌తిలో వాలి పోతున్నారు. గెలిచే స‌త్తా ఉన్న నాయ‌కుల‌కే టికెట్లివ్వ‌ని నిర్ణ‌యించుకున్న టీడీపీ అధినేత అందుకు అనుగుణంగానే నేత‌ల‌పై స‌ర్వే చేయిస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే చాలా మంది జాత‌కం చంద్ర‌బాబు చేతిలో ఉన్న‌ట్లు స‌మాచారం. అందుకే మీరెవ్వ‌రు నా ద‌గ్గ‌రికి రావాల్సిన ప‌నిలేదు.. గెలుస్తార‌ని న‌మ్మితే త‌ప్ప‌కుండా పిలిచి టికెట్ ఇస్తాన‌ని ఖ‌రాకండి చెప్పేస్తున్నార‌ట‌. సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు ఈ సూచ‌న వ‌ర్తిస్తుంద‌ని చెప్ప‌క‌నే చెప్పారు. గ‌తంలో కూడా చంద్ర‌బాబు స్వ‌యంగా ఈ విషయాన్ని వెల్ల‌డించారు. ఇదిలా ఉంటే సీఎం చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొంద‌రికి సీటు గుబులు స్టార్ట్ అయ్యింది.

మంత్రిగారి నియోజ‌క‌వ‌ర్గం మారుతుందా..?

ఇటీవ‌ల ఐవీఆర్‌ఎస్‌ (ఇంట్రాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టం) పేరుతో సర్వే చేపట్టారు. ఇంకో వైపు ఎప్పటికప్పుడు అనుచరుల ద్వారా ఎమ్మెల్యేలపై నివేదికలు తెప్పించుకునే పనిలో పడ్డారు. మంత్రి అమరనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సత్యప్రభ, సుగుణమ్మ, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తలారి ఆదిత్య, శంకర్‌యాదవ్‌పై ప్రధానంగా దృష్టి సారించినట్లు విశ్వసనీయ సమాచారం. ఏయే నియోజక వర్గాల్లో ఎవరికి తిరిగి టికెట్‌ ఇవ్వాలో తెలుసని, తనపై ఎవ్వరూ ఒత్తిడి చెయ్యవద్దని ఆయన తేల్చిచెప్పినట్లు ఎమ్మెల్యేలు తమ అనుచరుల వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ప‌ల‌మ‌నేరులో అమ‌ర్‌నాథ్‌రెడ్డికి ఎదురుగాలి వీస్తోంద‌ని చంద్ర‌బాబుకు నివేదిక అందిందంట‌. ఇప్పుడు ఆయ‌న‌కు టికెట్ కేటాయించాలా..? వ‌ద్దా ..? అనే మీమాంసలో చంద్ర‌బాబు ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే సిట్టింగ్ మంత్రిగా ఉండ‌డంతో ఆయ‌న్ను త‌ప్పించ‌క‌పోవ‌చ్చు.

బొజ్జ‌ల స్థానంలో ఎవ‌రికి..?

అదే టైంలో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం మార్పు విష‌యంలో కూడా చ‌ర్చ న‌డుస్తోంది. పలమనేరులో కాకుండా ఆయ‌న్ను పుంగనూరులో పోటీకి దింపాలనే ఆలోచ‌న‌లో కూడా ఉన్న‌ట్లు స‌మాచారం. చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభపై కూడా వ్య‌తిరేక‌త ఉంద‌ని తేలిందంట‌. స్థానికులకు అందుబాటులో ఉండక‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మంట‌. అలాగే మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి అనారోగ్య కారణంతో ఈసారి టికెట్‌ ఇవ్వటం లేదని తేలిపోయింది. కృష్ణారెడ్డి భార్య బృందమ్మ, కుమారుడు సుధీర్‌రెడ్డి టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వారికి టికెట్ కేటాయిస్తే పార్టీకి ఇబ్బంది త‌ప్ప‌ద‌ని స‌ర్వేలో తేలిందంట‌. అందుకే మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు వైపు చంద్రబాబు మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది.

వారికి కూడా టిక్కెట్ డౌటే..

తంబళ్లపల్లె ఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌పైనా నియోజకవర్గంలో అసంతృప్తి చాలా ఉంద‌ని ఆ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిస్థితులే చెపుతున్నాయి. అందుకే ఇక్క‌డ మ‌రొక‌రిని బరిలో నిల‌పాల‌ని భావిస్తున్నార‌ట‌. సత్యవేడు ఎమెల్యే తలారి ఆదిత్యపై అవినీతి అక్రమాల ఆరోప‌ణ‌లు వ‌స్తుండ‌టంపై ఇక్కడ కూడా వేరొకరికి టికెట్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నార‌ట. ఇక తిరుపతిలో ఈసారి సిటింగ్‌ ఎమ్మెల్యే సుగుణమ్మకు కాకుండా వేరొకరికి ఇచ్చేందుకే చంద్ర‌బాబు మొగ్గు చూపుతున్న‌ట్లు స‌మాచారం. చిత్తూరు, తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల ఎంపిక‌లో సామాజిక స‌మీక‌ర‌ణలు బ్యాలెన్స్ చేసుకుని సీట్లు ఇవ్వాల‌ని బాబు భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

 

Tags:    

Similar News