దండం పెడుతూనే… దడ పుట్టించాడుగా

ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దడ పుట్టించారు. శాసనసభలో మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టాన్ని సులువుగా ఆమోదింప చేసుకున్న [more]

Update: 2020-01-22 16:30 GMT

ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దడ పుట్టించారు. శాసనసభలో మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టాన్ని సులువుగా ఆమోదింప చేసుకున్న వైసీపీ శాసనమండలిలో మాత్రం చతికల పడింది. శాసనసభలో రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దంటూ జగన్ కు దండం పెట్టి మరీ వేడుకున్నారు. ఎన్ని వ్యూహాలు రచించినా వైసీపీ సక్సెస్ కాలేకపోయింది. మంత్రులందరూ గత రెండు రోజులుగా శాసనమండలిలో తిష్ట వేసి మరీ పావులు కదిపినా పైకిలేవలేకపోయింది. మంత్రులందరూ మొహరించినా ఏం చేయలేకపోయింది.

దూరం చేసేందుకు….

శాసనసభలో 151 మంది సభ్యులున్న వైసీపీ రెండు బిల్లులను తేలిగ్గా ఆమోదింప చేసుకుంది. ఇక శాసనమండలి విషయానికి వచ్చే సరికి టీడీపీకి బలం ఉంది. దీంతో అనేక ప్రయోగాలకు వైసీపీకి దిగింది. శాసనమండలిని రద్దు చేస్తున్నట్లు ప్రచారానికి దిగింది. టీడీపీ నుంచి ఎమ్మెల్సీలను దూరం చేయడానికి ప్రయత్నించింది. డొక్కా మాణిక్యవరప్రసాద్, శమంతకమణి, పోతుల సునీత, శివనాధ్ రెడ్డి వంటి వారు సమావేశాలకు దూరం కావడంతో టీడీపీ ఒక దశలో ఆందోళనలో పడింది.

వ్యూహరచన చేసి…

అయితే చంద్రబాబు నిన్న అర్థరాత్రి వరకూ సీనియర్ నేతలతో సమావేశమయి వ్యూహరచన చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మూడు రాజధానుల నిర్ణయాన్ని వాయిదా వేయించాలని గట్టిగా పట్టుబట్టారు. ఈరోజు శాసనమండలిలో దాదాపు మూడు గంటల పాటు శాసనమండలి గ్యాలరీలోనే చంద్రబాబు కూర్చున్నారంటే ఎంత పట్టుదలగా ఉన్నారో చెప్పకనే తెలుస్తుంది. మండలి ఛైర్మన్ జారిపోకుండా, అధైర్య పడకుండా గ్యాలరీలోనే కూర్చున్నారు చంద్రబాబు.

అధికార పార్టీకి షాక్…..

మొత్తం మీద చంద్రబాబు అమరావతి నుంచి రాజధానిని తరలించే ప్రక్రియను వ్యూహాత్మకంగా అడ్డుకున్నారు. ఈ విషయంలో వైసీపీ బలం లేకపోవడంతో ముందే చేతులెత్తేయాల్సి ఉన్నా లేనిపోని బింకాలకు పోయింది. రెండు బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపడంతో మూడు నెలల పాటు రాజధాని తరలింపు వాయిదా పడే అవకాశముంది. ఇది ఖచ్చితంగా అధికార పార్టీకి షాక్ అనే చెప్పాలి. శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది. మరి వైసీపీ ఏం చేస్తుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News