నిలదీయాలనుకుంటే…నిరాశేనా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు ప్రధాన పార్టీలు డుమ్మా కొట్టాయి. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంలు ఈ సమావేశానికి హాజరు [more]

Update: 2019-12-05 12:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు ప్రధాన పార్టీలు డుమ్మా కొట్టాయి. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంలు ఈ సమావేశానికి హాజరు కాలేదు. చంద్రబాబు సమావేశం పెట్టిన ఉద్దేశం నెరవేరలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని అమరావతి పనులను నిలిపేసింది. చంద్రబాబు ఎన్నిసార్లు అమరావతిపై ప్రశ్నించినా జగన్ నుంచి సమాధానం రాలేదు.

అందరినీ కలుపుకుని….

ఇటీవల రాజధాని అమరావతిని చంద్రబాబు సందర్శించారు. ఆయన కాన్వాయ్ పై దాడులు జరిగాయి. అయితే రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ పదే పదే అమరావతిపై వ్యాఖ్యలు చేస్తుండటాన్ని టీడీపీ ఎప్పటికప్పుడు తప్పుపడుతోంది. అందువల్లనే చంద్రబాబు అన్ని పార్టీల వాయిస్ ను బయటకు పంపాలని భావించారు. ప్రజా రాజధాని అమరావతి పేరిట రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయపార్టీలను , మేధావులను, వ్యాపార, వాణిజ్య వర్గాలను ఆహ్వానించారు.

ఊరూ…పేరు లేని….

అయితే ఈ సమావేశానికి పేరూ ఊరూ లేని పార్టీలన్నీ హాజరయ్యాయనే చెప్పాలి. చంద్రబాబు దీన్ని చూసి ఒకింత అసహనానికి గురయ్యారని చెబుతున్నారు. ఏపీలో అసలు ఊసేలేని ఫార్వర్డ్ బ్లాక్, సమాజ్ వాదీ పార్టీ, జనతాదళ్ యు, ఆమ్ ఆద్మీ, ఆర్ఎస్పీ, నవతరం పార్టీ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వంటి పార్టీల ప్రతినిధులు పేర్లను చంద్రబాబు చదువుతున్నప్పుడు ఆయనే ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరినీ కూడకడదామనుకున్న చంద్రబాబుకు ప్రధాన పార్టీలు హాజరుకాకపోవడంపై పార్టీ సీనియర్ నేతలను ఆరా తీసినట్లుసమాచారం.

ప్రధాన పార్టీలేవీ…..

ముఖ్యంగా బీజేపీ ఈ సమావేశానికి హాజరుకాలేదు. మరో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ నుంచి ఎవరూ రాలేదు. ఇక జనసేన తరుపున పోతిన మహేష్ హాజరయ్యారు. సమావేశానికి హాజరైన ముఖ్యనేతల్లో చంద్రబాబు తర్వాత సీపీఐ రామకృష్ణ ఒక్కరే కన్పించారు. ఇక టీడీపీ నేతలతో హాలంతా నిండిపోయింది. అమరావతి నిర్మాణంపై జగన్ ప్రభుత్వాన్ని నిలదీయాలని భావించిన చంద్రబాబుకు పార్టీలన్నీ షాకివ్వడంతో నిరాశకు గురయ్యారని తెలిసింది. దీనిపై కొందరు సీనియర్ నేతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం.

Tags:    

Similar News