కూల్చకుంటే ఊరుకునేలా లేరుగా

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇల్లు కూల్చేస్తున్నారహో….. అంటూ 9 గంటల బులెటిన్‌కు పావు గంట ముందే ఈటీవీ గోల మొదలెట్టింది. హడావుడిగా ఆఫీసులకెళుతూ ప్రపంచంలో ఏం [more]

Update: 2019-09-23 06:30 GMT

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇల్లు కూల్చేస్తున్నారహో….. అంటూ 9 గంటల బులెటిన్‌కు పావు గంట ముందే ఈటీవీ గోల మొదలెట్టింది. హడావుడిగా ఆఫీసులకెళుతూ ప్రపంచంలో ఏం జరుగుతుందో ఓ సారి టీవీ చూసి తెలుసుకుందామనుకునే సగటు జీవుల్లో చాలామంది ఈటీవీ హెడ్‌లైన్స్‌ కోసం కుదిరితే కళ్లో…. వీలైతే చెవులు ఆ వైపు పడేసి ఉంచుతారు. ఈనాడు – ఈటీవీ వార్తలంటే అప్పుడు, ఇప్పుడు అదే క్రేజ్….. మీడియాలో సైతం ఓసారి ఈటీవీ చూసి కన్ఫర్మ్‌ చేసుకుందామనుకునేంతా భరోసా దానిది. ఉదయాన్నే చంద్రబాబు ఇల్లును జగన్ ప్రభుత్వం కూల్చేస్తుంది అనగానే అలజడి. అంతా సాహసానికి దిగారా? అదేంటి వేరే ఎక్కడా ఏ ఛానల్లో కనిపించడం లేదు. పోనీ ఆన్ లైన్ ఎడిషన్‌ చూసి నిర్ధారించుకునే వాళ్లకు అక్కడా అదే వార్త. ఏక కాలంలో సోషల్ మీడియా పులులు రెచ్చిపోయాయి. ప్రభుత్వ మీడియా కో ఆర్డినేషన్ చూస్తోన్న ఓ “హ్యాండిల్ లో వికటాట్ట హాసంజ చేయలేమన్నారుగా. చేసి చూపించాం. కూల్చేస్తున్నాం అంటూ ఫోజు” “ఇదిగో మీ అధికారిక టీవీలోనే ఈ వార్త వస్తుందనే స్క్రీన్‌ షాట్….” కాసేపటికి అవన్నీ మాయం అనుకోండి.

ఇదేం విశ్వసనీయత…?

ఈనాడు-ఈటీవీ వార్తలంటే అదో నమ్మకం. రాజకీయంగా ఎన్ని విమర్శలు ఉన్నా వార్తల విషయంలో ఓ ఖచ్చితత్వం దాని సొంతం. అదంతా ఒకప్పుడు. ఇప్పుడదేం లేదు. కాకపోతే ఏళ్ల తరబడి వచ్చిన విశ్వసనీయత మీద అలా నెట్టుకొచ్చేస్తోందనిపించేలా దాని పనితీరు కనిపిస్తోంది. నిజానికి బెజవాడ మీడియా వర్గాల్లో ఓ సెటైర్‌ కూడా ఉంది. గత ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే అది జగన్మోహన్‌ రెడ్డి పుణ్యం. ఓడితే ఆ రెండు పత్రికల పుణ్యం. ఇంతకు మించి వేరే కారణాలేవి పెద్దగా ఉండవు అనేవారు. ఇటీవలి కాలంలో వార్తలు చూస్తుంటే అది నిజమే అనిపించేలా వాటి తీరు కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యూహాలు ఎలా ఆయన తప్పటడుగులు వేసేలా రెచ్చగొట్టే కథనాలు ప్రచురించడం. ప్రసారం చేయడం ద్వారా చంద్రబాబుకి మేలు చేయడం కంటే కీడే ఎక్కువ జరుగుతోంది.

తొలిగించేయాల్సిందేనా?

కృష్ణా కరకట్ట మీద ఉన్న అక్రమ కట్టడాల్లో ఆరింటికి రెండో విడత నోటీసుల్ని సిఆర్‌డిఏ అధికారులు గత వారం జారీ చేశారు. వాటిలో చంద్రబాబు ఉంటున్న లింగమనేని గెస్ట్‌ హౌస్ కూడా ఉంది. వారంలోగా ఆ భవనాన్ని కూల్చివేయాలన్నది ఆ తాఖీదు సందేశం….. ఇప్పటికి నాలుగు రోజులు గడిచాయి. అసలా నోటీసులు అమలవుతాయా? జగన్మోహన్‌ రెడ్డి మొండితనం ప్రజావేదిక మాదిరి చంద్రబాబు నివాసం విషయంలో సాధ్యమవుతుందా? అన్నది న్యాయస్థానాల పరిధిలోని విషయం. ఇప్పటికే చాలామంది కోర్టులనాశ్రయించి ఉపశమనం కూడా పొందారు. ఇప్పుడు కొత్తగా ఇచ్చిన నోటీసుల ద్వారా అద్భుతాలు జరిగి ఆ అక్రమ కట్టడాలన్నింటిని కూల్చివేస్తారా అన్నది సామాన్య జనం ఎవ్వరు చెప్పలేని ఓ బ్రహ్మ రహస్యం. ఎప్పుడు ఏది… ఎలా సాధ్యమన్నది బోలెడు సాంకేతిక., రాజకీయ., న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉంటుంది. ఆ మాత్రం కామన్‌ సెన్స్‌ కూడా లేకుండానే ఈటీవీలో వచ్చిన బ్రేకింగ్‌ అందరిలో అలజడి రేపింది. ఇవాళ కాకుంటే రేపైనా జరిగిదే కదా అని సరిపెట్టుకోడానికి లేని విషయం అది. మాజీ ముఖ్యమంత్రి., ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిని కూల్చివేస్తున్నారనే వార్త తొందరపాటుతోనో….పొరపాటుగానో ఇచ్చేది కాదు. పొరపాటును గుర్తించి కూడా దానిని వెంటనే సరిదిద్దుకోలేని దుస్థితి ఆన్ లైన్‌ ఎడిషన్‌లో కనిపించింది. మొత్తం మీద మీడియా పరిస్థితి దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండహో అన్నట్లు తయారైంది.

సోషల్ టైగర్స్‌ కాస్త కంట్రోల్……

అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా పులులకు పట్టపగ్గాల్లేకుండా పోతోంది. వార్తల నిర్దారణ, వాస్తవాలు తెలియక ముందే రెచ్చిపోవడం ఆనక వాటిని డిలీట్ చేయడం అలవాటైపోయింది. ఈటీవీ-ఈనాడు పొరపాటే ఇవి తరచూ చేస్తున్నాయి. దీని వల్ల పరువు పోగొట్టుకోవడం., విశ‌్వసనీయత తగ్గించుకోవడం తప్ప ఏమి లాభం ఉండదు. నిజానికి సోమవారం ఉదయం కరకట్ట దిగువున టీడీపీ నేత పాతూరి నాగభూషణం గెస్ట్‌ హౌస్‌ ఉన్న ఐదెకరాల పొలంలో నదిలోకి ర్యాంప్ నిర్మాణం చేపట్టారు. కృష్ణానదిలోకి 17మీటర్ల పొడవునా… 7.4 మీటర్ల వెడల్పుతో కాంక్రీట్ ర్యాంప్‌ను పిల్లర్లతో నిర్మించారు. నది సహజ ప్రవాహానికి అడ్డుగా చేపట్టిన నిర్మాణాన్ని సీఆర్డీఏ అధికారులు తొలగించారు. చంద్రబాబు నివాసంలో సయితం ఇలాంటి ర్యాంపు నిర్మాణం., బోటింగ్ జెట్టీ ఉన్నాయి. వీటి విషయంలో ఎలా వ్యవహరిస్తారనేది కూల్చే వరకు తెలీదు. ఎందుకంటే మధ్యలో బోలెడు ప్రక్రియల్ని అధిగమించాల్సి కాబట్టి…. అందాక అంతా గప్‌చుప్‌..

Tags:    

Similar News