కరకట్ట కలసి వస్తుందా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పుడు ఏం చేయనున్నారు? సీఆర్డీఏ నోటీసులకు చంద్రబాబు స్పందిస్తారా? ఇల్లు ఖాళీ చేస్తారా? లేక ప్రభుత్వం కూల్చివేసిందాకా అక్కడే ఉంటారా? ఇదే [more]

Update: 2019-09-21 11:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పుడు ఏం చేయనున్నారు? సీఆర్డీఏ నోటీసులకు చంద్రబాబు స్పందిస్తారా? ఇల్లు ఖాళీ చేస్తారా? లేక ప్రభుత్వం కూల్చివేసిందాకా అక్కడే ఉంటారా? ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశమయింది. ఉండవల్లి కరకట్ట మీద చంద్రబాబునాయుడు నివాసముంటున్న సంగతి తెలిసిందే. ఈ భవనం ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్ ది. ఏపీ విభజన తర్వాత అమరావతిని రాజధానిగా చేసిన చంద్రబాబు అప్పటి నుంచి కరకట్టమీదనే నివాసముంటున్నారు. గత ఐదేళ్లుగా అక్కడే ఉంటున్నారు.

ప్రజావేదికను కూల్చేసి…..

భవనం పెద్దదిగా ఉండటం, భద్రత దృష్ట్యా చంద్రబాబు లింగమనేని భవనంలోనే ఉండాలని ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నిర్ణయించుకున్నారు. గత ఐదేళ్లు అది ముఖ్యమంత్రి అధికారిక నివాసంగానే ఉంది. కానీ ఇటీవల జరిగిన ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కరకట్ట భవనం హాట్ టాపిక్ అయింది. అక్కడే వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం నిర్మించిన ప్రజా వేదికను జగన్ సర్కార్ కూల్చివేసింది. దీనిపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేసినా ఏ మాత్రం స్పందించలేదు. ప్రజా వేదిక కూల్చి వేయడతో నెక్ట్స్ చంద్రబాబు భవనమే టార్గెట్ అన్నది అందరికీ తెలిసిన విషయమే.

అక్రమ నిర్మాణమని….

చంద్రబాబు నివాసం అక్రమ నిర్మాణమని వైసీపీ ప్రభుత్వం పదే పదే చెబుతోంది. ఇటీవల కృష్ణా నదికి వరదలు రావడంతో నోటీసులు కూడా ఇచ్చింది. అయితే వరదలు వచ్చిన సమయంలో చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్నారు. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేయడంతో కరకట్ట పైన ఉన్న చంద్రబాబు నివాసం ప్రభుత్వం కూల్చి వేయడానికే నిర్ణయించుకుందని తెలుస్తోంది. అయితే సీఆర్డీఏ నోటీసు ప్రకారం భవనంలో ఉన్న ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, స్విమ్మింగ్ పూల్ , డ్రెస్సింగ్ రూమ్ లు అక్రమంగా నిర్మించినవని నోటీసుల్లో పేర్కొంది. అయితే భవన యజమాని లింగమనేని రమేష్ మాత్రం అన్నీ నిబంధనలను అనుసరించే నిర్మించామని చెబుతున్నారు.

సీఆర్డీఏ చట్టాన్ని…..

కానీ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సీఆర్డీఏ చట్టాన్ని చాలా పకడ్బందీగా, కఠినంగా రూపొందంచారు. సీఆర్డీఏను ప్రశ్నించే అధికారం ఎవరికీ లేని విధంగా చట్టాన్ని తీసుకొచ్చిన చంద్రబాబుకు అదే చట్టం ఇప్పుడు తన నివాసం విషయంలో ఇబ్బందిగా మారింది. అయితే చంద్రబాబు భవనం ఖాళీ చేసేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. తాను భవనంలో ఉండగా అధికారులు వచ్చి ఎలా కూలగొట్టే సాహసం చేయరన్నది టీడీపీ విశ్వాసం. భవనాన్ని కూల్చివేస్తే చంద్రబాబుకు జరిగే నష్టం పెద్దగా ఉండదని, సానుభూతి వస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది. అందుతున్న సమచారం ప్రకారం ఆయన అధికారులు చర్యలకు దిగేంత వరకూ ఇల్లు ఖాళీ చేసే అవకాశం లేదు.

Tags:    

Similar News