వారు వీరయ్యారుగా… బాబు వ్యూహం ఫ‌లించేనా..?

రాష్ట్రంలో మ‌రోసారి రాజీనామాల రాజ‌కీయం తెర‌మీదికి వ‌చ్చింది. ఏపీకి ప్రత్యేక‌హోదా విష‌యంలో 2017-18 మ‌ధ్య కాలంలో వైసీపీ అధినేత‌, అప్పటి ప్ర‌తిపక్ష నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్‌.. ఇదే [more]

Update: 2021-07-31 15:30 GMT

రాష్ట్రంలో మ‌రోసారి రాజీనామాల రాజ‌కీయం తెర‌మీదికి వ‌చ్చింది. ఏపీకి ప్రత్యేక‌హోదా విష‌యంలో 2017-18 మ‌ధ్య కాలంలో వైసీపీ అధినేత‌, అప్పటి ప్ర‌తిపక్ష నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్‌.. ఇదే రాజీనామాల రాజ‌కీయంగా న‌డిపించారు. హోదా విష‌యంలో కేంద్రంలోని మోడీని నిల‌దీసేందుకు ఎంపీల‌తో రాజీనామాలు చేయించాల‌ని .. అప్పట్లో టీడీపీ అధినేత‌, సీఎం చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అయితే.. అప్పట్లో బాబు.. రాజీనామాలు చేయిస్తే.. హోదా ఇస్తారా ? అని ఎదురు ప్రశ్నించారు. త‌ప్ప.. జ‌గ‌న్ తో క‌లిసి న‌డుస్తాన‌ని చెప్పలేదు. పైగా చంద్రబాబు.. జ‌గ‌న్‌ను తీవ్రస్థాయిలో దుయ్యబ‌ట్టారు. అయితే జ‌గ‌న్ అప్పుడు తమ పార్టీకి లోక్‌స‌భ‌లో ఉన్న ఎంపీల‌తో రాజీనామా చేయించారు. అయితే చివ‌రి ఏడెనిమిది నెల‌లు ఉండ‌గానే ఎంపీలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేయ‌డంతో ఉప ఎన్నిక‌లు రాలేదు.

ఇప్పుడు చంద్రబాబు….

ఇక‌, ఇప్పుడు వారు వీరైన‌ట్టుగా చంద్రబాబు వ్యవ‌హ‌రిస్తున్నారు. గ‌తంలో జ‌గ‌న్ రాజీనామాల అస్త్రం తెర‌మీదికి తీసుకురాగా.. ఇప్పుడు చంద్రబాబు ఇదే విష‌యాన్ని ప్రస్తావిస్తున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌, ప్రత్యేక హోదాల‌పై కేంద్రాన్ని నిల‌దీయాల‌ని.. ఎట్టి ప‌రిస్తితిలోనూ వీటిని సాధించుకునేందుకు ఎంపీల‌తో రాజీనామాలు చేయించాల‌ని చంద్రబాబు తాజాగా డిమాండ్ తీసుకువ‌చ్చారు. ప్రస్తుతం టీడీపీకి లోక్‌స‌భ‌లో ముగ్గురు ఎంపీలు ఉన్నారు. వైసీపీకి 21 (ర‌ఘురామ మిన‌హ‌) మంది ఎంపీలు ఉన్నారు. వీరంద‌రితోనూ రాజీనామాలు చేయించి కేంద్రంపై ఒత్తిడి పెంచాల‌నేది చంద్రబాబు వ్యూహంగా క‌నిపిస్తోంది.

ఎవరూ పట్టించుకోవడం లేదా?

అయితే, ఇప్పుడు ఇదే విష‌యంపై చంద్రబాబు వ్యూహాన్ని ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఎందుకంటే.. రాజీనామాలు చేయ‌డం ద్వారా ఏమీ సాధించ‌లేర‌నే విష‌యాన్ని గ‌తంలో చెప్పిన చంద్రబాబు.. జ‌గ‌న్‌పై అనేక కామెంట్లతో విరుచుకుప‌డిన చంద్రబాబు.. ఇప్పుడు మ‌ళ్లీ అదే రాజీనామాల రాజ‌కీయం ఎంచుకోవ‌డం ఏంటి ? అనేది మేధావుల మాట‌. ఏదైనా విష‌యం ఉంటే.. ఖ‌చ్చితంగా ప్రజ‌ల ముందుకు వ‌చ్చి పోరాటాలు చేయాల్సిందే తప్ప.. ఇలా రాజీనామాలంటూ.. ఇరు పార్టీలు మ‌ళ్లీ క‌త్తి యుద్దానికి తెర‌దీయ‌డం వ‌ల్ల.. ప్రయోజ‌నం ఏంట‌ని ? అంటున్నారు.

మాట మీద నిలబడలేక..?

సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న చంద్రబాబు త‌న మాట మీద తాను నిల‌బ‌డ లేక‌పోతున్నార‌న్న విష‌యం మ‌రోసారి రుజువైంద‌న్న విమ‌ర్శలు వ‌స్తున్నాయి. అయినా ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో ఏకంగా 21 మంది ఎంపీల‌తో రాజీనామాలు చేయించి ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు జ‌గ‌న్ ఎంత మాత్రం ఇష్టప‌డ‌రు. కేంద్రంతో రాజీ లేదా స‌యోధ్య ధోర‌ణితోనే ముందుకు వెళ్లాల‌న్నదే జ‌గ‌న్ సిద్ధాంతంగా క‌నిపిస్తోంది. చంద్రబాబు రాజీనామాలు అంటూ అర‌చి అర‌చి అల‌సిపోవ‌డం త‌ప్పా అంత‌కు మించి జ‌రిగేదేం ఉండ‌దు.

Tags:    

Similar News