పల్నాడు పగబడుతుందా? లేక?

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పుడు పల్నాడు సెంటిమెంట్ ను పట్టుకున్నట్లుంది. ఆయన పల్నాడు టాపిక్ ను పదే పదే చెబుతుండటం దీనికి అద్దం పడుతుంది. పల్నాడు, పులివెందుల [more]

Update: 2019-09-07 12:30 GMT

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పుడు పల్నాడు సెంటిమెంట్ ను పట్టుకున్నట్లుంది. ఆయన పల్నాడు టాపిక్ ను పదే పదే చెబుతుండటం దీనికి అద్దం పడుతుంది. పల్నాడు, పులివెందుల రెండింటిని పోల్చి చూపిస్తూ ఆయన వ్యాఖ్యలు సాగుతున్నాయి. నిజానికి పులివెందుల పంచాయతీ అంటూ వైసీపీపై ఒంటికాలి మీద లేస్తున్న చంద్రబాబు గత ఎన్నికల ప్రచారంలోనూ ఇదే చేశారు. అయితే ఫలితాలు అనుకూలంగా రాలేదు. అయినా చంద్రబాబు మాత్రం పులివెందుల పంచాయతీని వదలడం లేదు.

పల్నాడు ప్రాంతంలో…..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పల్నాడు ప్రాంతంలో ఎక్కువగా ఘర్షణలు జరిగిన మాట వాస్తవం. సహజంగా ఎన్నికలకు ముందు, ఎన్నికల అనంతరం గ్రామస్థాయిలో ఘర్షణలు చోటు చేసుకోవడం సహజం. ఆగ్రహంతో ఓటమి పాలయిన పార్టీ కార్యకర్తలు, ఉత్సాహంతో గెలిచిన పార్టీ క్యాడర్ మధ్య ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి. ఇది కొత్తేమీ కాదు. పల్నాడుకు మాత్రమే పరిమితమయిన విషయం కాదు. సిల్లీ రీజన్ లకు కూడా తలలు పగిలిన సంఘటలను గతంలో అనేకం చూశాం. అయితే పులివెందుల పంచాయతీ అంటూ చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఒక ప్రాంతం వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

అక్కడి టీడీపీ నేతలపైనే….

నిజానికి పల్నాడు ప్రాంతంలోనే ఎక్కువగా టీడీపీ నేతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమకు పట్టున్న ప్రాంతంలో ఓటమిపాలు కావడంతో టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. కోడెల శివప్రసాద్, యరపతినేని శ్రీనివాసరావు లాంటి నేతలపై కేసులు నమోదు అవ్వడం వెనక కారణాలు కూడా లేకపోలేదు. యరపతినేని శ్రీనివాసరావు సుద్దపూస ఏం కాదు. దాదాపు దశాబ్దకాలం ఎమ్మెల్యేగా ఉండి అక్రమ మైనింగ్ చేశారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే సీబీసీఐడీ విచారణ చేసిన యరపతినేని అక్రమాలకు పాల్పడ్డారని నివేదిక కూడా ఇచ్చింది. హైకోర్టు సయితం సీబీఐకి అప్పగించాలని అంటూ, యరపతినేని బ్యాంకు అకౌంట్ల లావాదేవీలపై అనుమానాలనూ వ్యక్తం చేసింది.

పదే పదే అన్నప్పటికీ…..

ఇక కోడెల శివప్రసాద్ విషయం చెప్పనవసరం లేదు. ఆయనపైనా, ఆయనకుటుంబ సభ్యులపైనా లెక్కకు మిక్కిలి కేసులు నమోదయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు పల్నాడు పాట అందుకోవడాన్ని తెలుగుదేశం పార్టీ నేతలే తప్పుపడుతున్నారు. పులివెందులను కించపర్చేలా చేస్తున్న వ్యాఖ్యలను కూడా వారు అభ్యంతరం తెలుపుతున్నారు. ఎన్నికల సమయంలోనూ పులివెందుల పంచాయతీ అంటూ, వివేకా హత్య పైనా పదే పదే చంద్రబాబు చెప్పడం వల్లనే జగన్ పై మరింత సానుభూతి పెరిగిందని టీడీపీ నేతల అభిప్రాయం. మరి చంద్రబాబు ఎత్తుకున్న పల్నాడు టాపిక్ చంద్రబాబును పగపడుతుందా? కాపాడుతుందా? అనేది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News