రెడ్ సిగ్నల్ పడినేట్లేనా?

చంద్రబాబుకు గత రెండేళ్ళుగా రోజులు అస్సలు బాగోలేవు. లేకపోతే కామధేనువు లాంటి కేంద్రాన్ని నాడు ఎందుకు కాదనుకుంటారు. మోడీ మీద తిట్ల దండకం ఎందుకు అందుకుంటారు. అమిత్ [more]

Update: 2020-02-06 06:30 GMT

చంద్రబాబుకు గత రెండేళ్ళుగా రోజులు అస్సలు బాగోలేవు. లేకపోతే కామధేనువు లాంటి కేంద్రాన్ని నాడు ఎందుకు కాదనుకుంటారు. మోడీ మీద తిట్ల దండకం ఎందుకు అందుకుంటారు. అమిత్ షా కారు మీద రాళ్ళేయించార‌న్న చెడ్డ పేరును ఎందుకు కోరి తెచ్చుకుంటారు. ఆ మీదట జరిగిన కధలో ఏపీలో అన్నీ పోయి అధికారం కూడా ఎందుకు పోగొట్టుకుంటారు. పోనీ ఎన్నికల తరువాత అయినా నాలిక్కరచుకుని పాహిమాం అంటున్నా మోడీ షా కరుణించడంలేదే. మీరే దిక్కు, మీకు మించిన దేవుడు లేడంటూ వీర భక్తుడి లెవెల్లో ప్రార్ధిస్తున్నా కూడా దయ రావడంలేదే. కటాక్షించడంలేదే. పైగా వైసీపీ సర్కార్ కి జగన్ కి అనుకూలంగా కేంద్రం కదులుతోంది. జగన్ చేసింది కరెక్ట్ అంటోంది. ఇక్కడే కదా చంద్రబాబుకు మండుకొస్తోంది. ఏపీలో ఇంత జరుగుతూంటే కేంద్రం ఏంచేస్తోంది అని ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ అమాయకంగా ప్రశ్నిస్తోంది. నిజంగా చంద్రబాబు అయోమయానికి జాలి పడాల్సిందేగా మరి.

చెళ్ళున కొట్టినట్లుగా….

ఏపీ రాజధాని విషయం అన్నది రాష్ట్ర పరిధిలోనిది అని కుండబద్దలు కొట్టినట్లుగా కేంద్రం చెప్పేసింది. వారి పరిధిలోకి మేము వెళ్ళం, అది వారి ఇష్టమంటూ కూడా సానుకూల సంకేతాలు ఇచ్చేసింది. అంతేనా ఏపీలో రాజధానులు, సరిహద్దులు ఇవన్నీ అక్కడి సర్కార్ చూసుకోవాల్సినవి అంటూ సన్నసన్నగా తప్పుకుంది. ఇదంతా టీడీపీ అతి ఉత్సాహంతో అడిగిన ప్రశ్నలకు పార్లమెట్ సాక్షిగా కేంద్రం ఇచ్చిన సమాధానాలు. ఇలా కోరి మరీ వైసీపీ నెత్తిన పాలు పోసిన ఘనత మాత్రం టీడీపీ ఎంపీలదే. దీని వెనకాల ప్లాన్ వేసి చిత్తు అయిన క్రెడిట్ మాత్రం చంద్రబాబుదే. ఇంకా అధికారికంగా కేంద్రానికి మూడు రాజధానుల కధని వైసీపీ వినిపించలేదు. ఈ పనిని టీడీపీ ఎంపీలు పూర్తి చేసి జగన్ కి ఎంతగానే సాయపడ్డారు. పక్కా క్లారిటీ కూడా కేంద్రం నుంచి ఇప్పించేశారు. దీంతో కేంద్ర జోక్యం. రాజధానిని ఆపుతాం అని బీరాలు పలికిన వారికి చెంప చెళ్ళున కొట్టినట్లైంది.

అమరావతి శాశ్వతం కాదుట…

ఇంతవరకూ సరేననుకుంటే అమరావతి రాజధాని ఏమీ శాశ్వతం కాదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మరో బాంబు పేల్చారు. 2015 ఏప్రిల్ 23న అప్పటి సీఎం చంద్రబాబు అమరావతి రాజధాని అని జీవో ఇస్తే దాన్ని నోటిఫై చేశాం, ఇపుడు జగన్ మూడు రాజధానుల మీద జీవో తయారు చేసి పంపిస్తే దానినికూడా నోటిఫై చెస్తామని ఇంత చక్కగా జీవీఎల్ చెప్పాక టీడీపీకి ఏమైనా డౌట్లు ఉంటాయా. ఉంటే మాత్రం అక్కడ తీర్చెదెవరని. అమరావతి ప్రధాని శంఖుస్థాపన చేసిన రాజధాని. అక్కడ నుంచి అంగుళం కదల్చలేరు అంటూ బీజేపీ కొత్త పూజారి సుజనా చౌదరి, టీడీపీ ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్ లాంటి వారి హూంకరింపులకు ఒక్క దెబ్బతో సమాధానం వచ్చేసింది. అమరావతే కాదు, ఏ రాజదాని అయినా మార్చేసుకోవచ్చు. ఆ హక్కు ప్రజల నుంచి ఎన్నుకున్న ప్రభుత్వానికి ఉంది. ఇలా రాజ్యాంగంలో ఉన్న దాన్నే జీవీఎల్ చెప్పారు. ఆయన మరో మాట అన్నారు, 50 శాతం పైగా ఓట్లతో గెలిచిన జగన్ సర్కార్ తీసుకునే నిర్ణయాలను కేంద్రం ఎందుకు అడ్డుకుంటుందని కూడా అడిగారు. సో. జగన్ మూడ్ కి అనుగుణంగానే మూడు రాజధానుల కధకు కేంద్రం ఇలా ముగింపు ఇచ్చిందనుకోవాలి.

పవన్ అంతేనా ?

మరో వైపు కేంద్రంతో ఒప్పించి మూడు రాజధానుల ప్రకటనను వెనక్కి తీసుకునేలా చేస్తామని జనసేనాని పవన్ ఆర్భాటించారు. అంతటితో ఆగకుండా తాను అందుకే ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతున్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. ఇక తాను బీజేపీతో పొత్తు పెట్టుకున్నది కూడా ఈ మహత్తర కార్యక్రమం సాధన కోసమేనని కూడా ఆయన చెప్పుకున్నారు. మరి బీజేపీ స్వయంగా జగన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాక పవన్ ఏం చెబుతారో. పొత్తు పార్టీగా ఆయన ఎలా స్పందిస్తారో. బాబుతో పాటు నడిచి ఒక్క అమరావతే కావాలి, మిగిలిన ప్రాంతాలు వద్దు అంటూ దూకుడుగా ముందుకెళ్ళినందుకు, రాజకీయ అవగాహన లేకుండా బీజేపీతో ఆరాటపడి పొత్తు పెట్టుకున్నందుకు పవన్ పార్టీ పుట్టె ఇలా మునిగిందని అంటున్నారు.

Tags:    

Similar News