బాబు గారు లాజిక్ మిస్ అయ్యారా..?

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై చిన్న త‌ర‌హా యుద్ధాన్ని ప్ర‌క‌టించిన ఢిల్లీ వీధుల్లో మోడీకి వ్య‌తిరేకంగా స‌వాళ్లు విసురుతున్నారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. న‌రేంద్ర మోడీ అవినీతిప‌రుడు [more]

Update: 2019-02-14 06:30 GMT

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై చిన్న త‌ర‌హా యుద్ధాన్ని ప్ర‌క‌టించిన ఢిల్లీ వీధుల్లో మోడీకి వ్య‌తిరేకంగా స‌వాళ్లు విసురుతున్నారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. న‌రేంద్ర మోడీ అవినీతిప‌రుడు అని ప‌దే ప‌దే విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. “చౌకీదార్ చోర్ హై” అంటూ కాంగ్రెస్ నినాదాన్ని వినిపిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి న‌రేంద్ర అన్యాయం చేశార‌ని ఆరోపిస్తున్నారు. కేవ‌లం న‌రేంద్ర మోడీని వ్య‌తిరేకించ‌డానికే మూడున్న‌ర ద‌శాబ్దాలుగా ప్ర‌త్య‌ర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో జ‌ట్టుక‌ట్టారు. మ‌హాకూట‌మిలో చంద్ర‌బాబు భాగ‌మ‌య్యారు. కూట‌మిలోని పార్టీలకు ఎక్క‌డ ఏ ఇబ్బంది వ‌చ్చినా వెంట‌నే చంద్ర‌బాబు సైతం స్పందిస్తున్నారు. మ‌మ‌తా బెన‌ర్జీ క‌ల‌క‌త్తాలో దీక్ష చేస్తే వెళ్లివ‌చ్చారు. కేజ్రీవాల్ దీక్ష‌కు హాజ‌ర‌య్యారు. అల‌హాబాద్ ఎయిర్‌పోర్టులో అఖిలేష్ యాద‌వ్ ను యూపీ పోలీసులు అడ్డుకుంటే చంద్ర‌బాబు ఖండించారు. స‌రే ఒక్క కూట‌మిలో ఉన్నందున ఇవ‌న్నీ స‌హ‌జ‌మే. అయితే, వీటిల్లో లాజిక్ మిస్ అవ్వ‌డమే ఇప్పుడు చంద్ర‌బాబుకు స‌మ‌స్య అయ్యేలా ఉంది. ఎందుకంటే గ‌తంలోలా మీడియా రాసిందే వార్త అన్న‌ట్లుగా ఇప్పుడు ప‌రిస్థితి లేదు. సోష‌ల్ మీడియాలో అన్ని పార్టీలూ చేస్తున్న త‌ప్పుల‌ను క్ష‌ణాల్లో బ‌య‌ట పెడుతున్నారు. దీంతో ప్ర‌జ‌లు అన్ని కోణాల్లో ఆలోచించ‌గ‌లుగుతున్నారు.

ఆ అవ‌కాశం ఇచ్చిందే కాంగ్రెస్ క‌దా..?

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ రాష్ట్రానికి అన్యాయం చేశారు. ఈ వాద‌న అలా ఉంచితే.. మోడీకి వ్య‌తిరేకంగా చంద్ర‌బాబు క‌లిసింది కాంగ్రెస్ పార్టీతో. అయితే, రాష్ట్రానికి మోడీ అన్యాయం చేసేందుకు అవ‌కాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆద‌రాబాద‌రాగా రాష్ట్రాన్ని విభ‌జించిన కాంగ్రెస్ విభ‌జ‌న చ‌ట్టంలో కొన్ని త‌ప్పుల‌ను చేసింది. దీంతో బీజేపీ అవ‌కాశం ఉండి కొన్ని, అవ‌కాశం లేక కొన్ని విభ‌జ‌న హామీల‌ను నెర‌వేర్చ‌క రాష్ట్రానికి న‌ష్టం చేసింది. అయితే, ఇప్పుడు అన్యాయం చేసిన బీజేపీకి వ్య‌తిరేకంగా అన్యాయం చేయ‌డానికి అవ‌కాశం ఇచ్చిన కాంగ్రెస్ తో చంద్ర‌బాబు జ‌ట్టు క‌ట్టారు. రాష్ట్ర ప్ర‌జ‌ల అభీష్ఠానికి వ్య‌తిరేకంగా విభ‌జ‌న చేశార‌ని కాంగ్రెస్ పై ఆంధ్ర ప్ర‌జ‌లు ఇప్ప‌టికే పీక‌ల దాకా కోపంతో ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వారి కోపాన్ని ఓట్ల ద్వారా చూపించారు. చంద్ర‌బాబు ఏదో మ‌ద్ద‌తు తీసుకోవ‌డానికి క‌లిసిన‌ట్లుగా ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న లేదు. తాజాగా ఢిల్లీలో ఆయ‌న చేసిన దీక్ష‌కు కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు లైన్ క‌ట్టి మ‌రీ సంఘీభావం తెలిపారు. అలా వ‌చ్చిన వారిపై చంద్ర‌బాబు… చంద్ర‌బాబుపై వారు ప్ర‌శంస‌లు గుప్పించారు. ఏకంగా విభ‌జ‌న చ‌ట్టాన్ని త‌యారుచేసిన జైరాం ర‌మేశ్ వంటి వారు కూడా వ‌చ్చి చంద్ర‌బాబు ప‌క్క‌న కూర్చున్నారు. వీరి వైఖ‌రి చూస్తుంటే.. ఎన్నో ఏళ్ల అనుబంధం ఉన్న‌వారిలా క‌నిపించారు. అయితే, మోడీకి వ్య‌తిరేకంగా రాష్ట్రానికి మొద‌ట అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీతో క‌ల‌వ‌డంలో లాజిక్ మిస్ అయ్యిందంటున్నారు విశ్లేష‌కులు.

రాహుల్ కూడా అదే చేస్తే..?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాహుల్ గాంధీ ప్ర‌ధాని అవుతార‌ని, ప్ర‌త్యేక హోదా ఇస్తార‌ని చంద్ర‌బాబు అంటున్నారు. అయితే, ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఏ స‌ర్వే చూసినా రాహుల్ గాంధీ ప్ర‌ధాని అయ్యే అవ‌కాశాలు చాలా త‌క్కువే అంటున్నాయి. స‌రే, ఒక‌వేళ నిజంగానే రాహుల్ ప్ర‌ధాని అయినా.. ప్ర‌త్యేక హోదా ఇస్తార‌ని క‌చ్చితంగా ఎలా చెప్ప‌గ‌ల‌రు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కూడా ఇలానే న‌రేంద్ర మోడీ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని ఎన్నిక‌ల్లో గెలిచాక మోసం చేశారు క‌దా. రేపు రాహుల్ గాంధీ కూడా ప్ర‌ధాని అయ్యాక ఏదో సాకు చూపించి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం కుద‌ర‌దు అంటే ప‌రిస్థితి ఏంటో మ‌రి. ఇక‌, న‌రేంద్ర మోడీపై చంద్ర‌బాబు ప‌దే ప‌దే అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. మోడీపై వ‌చ్చిన ప్ర‌ధాన ఆరోప‌ణ రాఫేల్ కుంభ‌కోణం. ఇటువంటి కుంభ‌కోణాలు ప‌దేళ్ల యూపీఏ హ‌యాంలో ప‌దుల సంఖ్య‌లో వ‌చ్చాయి. మ‌రి, అటువంటి వారిని ప‌క్క‌న పెట్టుకొని మోడీపై విమ‌ర్శ‌లు చేయ‌డంలో ప‌స ఉందా అంటే టీడీపీకే తెలియాలి. ఇక‌, ఓ కార్య‌క్ర‌మానికి వెళ్తున్న అఖిలేష్ యాద‌వ్‌ను పోలీసులు ఎయిర్‌పోర్టులో అడ్డుకోవ‌డాన్ని చంద్ర‌బాబు ఖండించారు. త‌ప్పులేదు. అయితే, ఇదే చంద్ర‌బాబు.. విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్టులో జ‌గ‌న్ ను రాష్ట్ర పోలీసుల‌ను పంపించి అడ్డుకున్న విష‌యాన్ని మ‌రిచిపోయారు. మొత్తానికి చంద్ర‌బాబు చ‌ర్య‌ల్లో ఎక్క‌డో లాజిక్ మిస్ అవుతుంద‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

Tags:    

Similar News