బాబు ఆరాటమే కానీ…? అందుకు ఒప్పుకుంటారా?

అప్ప ఆరాటమే కానీ బావ బతికేట్టు లేడని ఒక ముతక సామెత ఉంది. అలాంటిదే ఇపుడు చంద్రబాబు పరిస్థితి కూడా. ఆయన‌కు కేంద్రంలోని బీజేపీతో దోస్తీ కట్టాలని [more]

Update: 2020-06-20 00:30 GMT

అప్ప ఆరాటమే కానీ బావ బతికేట్టు లేడని ఒక ముతక సామెత ఉంది. అలాంటిదే ఇపుడు చంద్రబాబు పరిస్థితి కూడా. ఆయన‌కు కేంద్రంలోని బీజేపీతో దోస్తీ కట్టాలని ఉంది. కానీ కాషాయ ధారులు మాత్రం కాదు పొమ్మంటున్నారు. ఇక చంద్రబాబు అయితే బీజేపీ చెలిమి కావాలని ఏపీలో ఓడిన మరుక్షణం నుంచి తన ప్రయత్నాలు తాను గట్టిగానే చేస్తున్నారు. మోడీని ఎప్పటికపుడు పొగుడుతున్నారు. ఆయన ఏంచేసినా భేష్ అంటున్నారు. మరో వైపు దేశ హోం మంత్రి అమిత్ షా పుట్టిన రోజును గుర్తు పెట్టుకుని మరీ గ్రీట్ చేస్తున్నారు. బీజేపీ తనకు దన్నుగా ఉంటే ఏపీని దున్నేయవచ్చు అన్నది చంద్రబాబు మార్క్ పాలిటిక్స్. కానీ కమలనాధులు కనీసం కన్ను కూడా కొట్టడంలేదుగా.

బాబు మీద సెటైర్లు…

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మోడీ, అమిత్ షాలకు తలలో నాలుక లాంటి రాం మాధవ్ చంద్రబాబు మీద గట్టిగానే సెటైర్లు వేయడం బీజేపీకి టీడీపీకి మధ్య దూరం ఎంతో చెబుతోంది. నాలుగేళ్ళు మాతో కలసి ఉన్న చంద్రబాబు ఎన్నికలకు ఏడాది ముందు తెగదెంపులు చేసుకుని వెళ్ళారు. ఆయన‌కు ప్రధాని మోజు పుట్టి అలా చేశారని, తెప్పతగలేశారని రాం మాధవ్ గట్టిగానే తగులుకున్నారు. బీజేపీ వర్చువల్ ర్యాలీలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. చంద్రబాబుకు బీజేపీకి చాలా దూరం ఉందని కూడా ఆయన చెప్పేశారు. చంద్రబాబుతో అసలు కుదరదు అంటూ తేల్చేశారు.

బాబుకు బెయిల్….

ఇది నిజంగా కొత్త మాటే. చంద్రబాబు ఎపుడూ కోర్టు మెట్లు ఎక్కలేదు. ఆయన చేతికి మట్టి అంటకుండా స్టేలు తెచ్చుకుంటారు. ఆయన తాను నిజయతీపరుడిని అని తరచూ చెబుతారు కానీ తన మీద వచ్చిన కేసుల మీద స్టేకు వెళ్ళినట్లు మాత్రం చెప్పరు. అదే ఆయన గడుసుదనం, రాజకీయ లౌక్యం. అటువంటి చంద్రబాబు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని రాం మాధవ్ హాట్ కామెంట్స్ చేశారు. బెయిల్ అంటే అరెస్ట్ కాకుండా తప్పంచుకోవడాకి, మరి చంద్రబాబు అరెస్టులు, జైలూ ఇదంతా బీజేపీ పెద్దాయన చెబుతున్నారంటే చంద్రబాబు విషయంలో కేంద్రం ఆలోచనలు వేరేగా ఉన్నాయనుకోవాలి. ఆయన సర్కార్ లో అవినీతి జరిగిందని భావిస్తున్నట్లుగా కూడా నమ్మాలి.

తప్పు చేయరా..?

ఏపీలో ఉన్న బీజేపీ నాయకుల ఆలోచనలు ఎలా ఉన్నా కూడా కేంద్రంలోని పెద్దలు మాత్రం మళ్ళీ ఆ తప్పు చేయకూడదు అనుకుంటున్నారుట. ఆ తప్పు ఏంటి అంటే చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం. ప్రతీ పొత్తుని చిత్తు చేసి తాను మాత్రమే రాజకీయంగా గరిష్ట లాభాన్ని చంద్రబాబు పొందుతారు. అదే సమయంలో జనంలో బలం ఉన్నా కూడా బీజేపీని మూలన పెట్టేస్తారు. ఈసారి అంటే 2024 ఎన్నికలకు మాత్రం ఆ తప్పు చేయకూడదని, తామే అతి పెద్ద పార్టనర్ కావాలని, వీలుంటే జనసేన లాంటి కొత్త పార్టీతో కలసి ఎన్నికలకు పోవాలన్నదే బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది. ఏపీకే చెందిన రాం మాధవ్, మరో నేత జీవీఈల్ నరసింహారావు లాంటి వారు చంద్రబాబుతో పొత్తు అసలు పడనివ్వరు. ఆ ఇద్దరే ఇపుడు ఏపీ బీజేపీలో కీలకం. సో చంద్రబాబు ఆశలు నిరాశేనని అంటున్నారు.

Tags:    

Similar News