అప్పుడే కేర్ తీసుకుని ఉంటే.. ఇప్పుడీ క‌ల్లోలం ఉండేదా?

నిన్న టీడీపీలో చిత్రమైన చ‌ర్చ జ‌రిగింది. కీల‌క నేత‌ల ఫోన్లన్నీ చాలా బిజీ అయిపోయాయి. ఈ మొత్తం వ్యవ‌హారం ముగిసిన త‌ర్వాత కొంద‌రు త‌మ్ముళ్లు.. త‌మ‌కు అత్యంత [more]

Update: 2020-06-10 12:30 GMT

నిన్న టీడీపీలో చిత్రమైన చ‌ర్చ జ‌రిగింది. కీల‌క నేత‌ల ఫోన్లన్నీ చాలా బిజీ అయిపోయాయి. ఈ మొత్తం వ్యవ‌హారం ముగిసిన త‌ర్వాత కొంద‌రు త‌మ్ముళ్లు.. త‌మ‌కు అత్యంత స‌న్నిహితులైన కొంద‌రు మీడియా మిత్రుల‌కు స‌మాచారం చేర‌వేశారు. చ‌ర్చల తాలూకు సారాంశంలో కొంత వివ‌రించేశారు. ఈ మొత్తం వ్యవ‌హారం అంతా కూడా జంపింగ్ జిలానీల‌పైనే ఉండ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్రంలో ప్రతిప‌క్షంలో కూర్చుని టీడీపీకి ఏడాది ముగిసింది. ఈ ఏడాది కాలంలో పార్టీ నుంచి ముగ్గురు కీల‌క ఎమ్మెల్యేలు దూర‌మ‌య్యారు. అదే స‌మయంలో గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయ‌కుడు తోట త్రిమూర్తులు కూడా పార్టీ మారిపోయారు. ఇక‌, చాలా మంది పార్టీలోనే ఉన్నట్టే ఉన్నప్పటికీ.. పార్టీకి, పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా చాలా దూరంగా ఉంటున్నారు.

అండగా నిలవాలని…

ఈ విష‌యంలో వారు వీరు అనే తేడాలేకుండా చంద్రబాబుకు సొంత సామాజిక వ‌ర్గం నుంచి కూడా సెగ‌త‌గులుతూనే ఉంది. ఇక‌, ఇప్పుడు మాజీ మంత్రి, గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన శిద్దా రాఘ‌వ‌రావు..కూడా వైసీపీలో చేరిపోతున్నారు. ఈ నేప‌థ్యంలో పార్టీలో ఈ విష‌యంపై తీవ్రమైన చ‌ర్చ సాగింది. మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు త‌మ్ముళ్ల ఫోన్లు బిజీ అయ్యాయి. వీరి చ‌ర్చల్లో వ‌చ్చిన కీల‌క విష‌యాలేంటంటే.. పార్టీ వీడిన నాయ‌కులు.. ఇంకా వీడుతార‌ని భావిస్తున్న నాయ‌కులు కూడా చంద్రబాబుకు త‌మ ప‌రిస్థితిని వివ‌రించారు. గ‌తంలోనే అంటే పార్టీ ఓడిపోయిన త‌ర్వాత రెండు మూడు మాసాల‌కే వారి ఆవేద‌న‌ను పంచుకున్నారు. అంతేకాదు, త‌మ ప‌రిస్థితిపైనా.. ప్రభుత్వం నుంచి త‌మ‌కు ఎదురవుతున్న స‌మ‌స్యల‌పైనా కూడా చంద్రబాబుకు, పార్టీ వ‌ర్గాల‌కు వారు ఉప్పందించారు. త‌మ‌కు అండ‌గా నిల‌వాల‌ని కూడా కోరారు.

బాబుపై అసహనంతోనే….?

అయితే, చంద్రబాబు ఈ కోణాన్ని వ‌దిలి పెట్టి.. పార్టీ కార్యక్రమాలు లేదా.. వ్యక్తిగ‌త ల‌బ్ధి కోసం చేసిన ప్రయ‌త్నం కార‌ణంగా.. పార్టీ నేత‌ల‌పై ఉదాసీన వైఖ‌రి ప్రద‌ర్శించార‌నే విమ‌ర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఉదాసీన‌తే.. నేత‌ల‌కు ఇబ్బందిక‌ర ప‌రిణామంగా మారింద‌ని తాజా చ‌ర్చల్లో సీనియ‌ర్లు కూడా అంగీక‌రించ‌డం గ‌మ‌నార్హం. అదే స‌మ‌యంలో కొంద‌రు నేత‌లు.. గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యంలోనే చంద్రబాబుపై కొంత ఆగ్రహంతో ఉన్నార‌ని అంటున్నారు. తాము కోరుకున్న చోట టికెట్లు ఇవ్వకుండా.. త‌మ స్థాయికి మించిన స్థానాల్లో ఇచ్చి.. ఓడేలా చేశార‌నే అక్కసు కూడా ఉంద‌ని అంటున్నారు. ఇందుకు శిద్ధా రాఘ‌వ‌రావు ఉదాహ‌ర‌ణ‌. గ‌త ప్రభుత్వంలో ఆయ‌న మంత్రిగా ఉన్నారు. ద‌ర్శి ఎమ్మెల్యేగా ఉన్న ఆయ‌న్ను చంద్రబాబు బ‌ల‌వంతంగా ఒంగోలు ఎంపీగా పోటీ చేయించారు. ఆయ‌న భారీగా ఖ‌ర్చు పెట్టి చిత్తుగా ఓడారు.

ఉదాసీన వైఖరి కారణంగానే?

ఇక అద్దంకి సీటు అడిగిన క‌ర‌ణం బ‌ల‌రాంను చంద్రబాబు బ‌ల‌వంతంగా చీరాల‌కు పంపారు. మొత్తంగా .. తాజాగా సీనియ‌ర్ త‌మ్ముళ్ల చ‌ర్చల్లో.. జంపింగ్‌ల వెనుక పార్టీ అధిష్టానం ఉదాసీన వైఖ‌రి స‌హా.. తీవ్రనిర్లక్ష్యం ఉంద‌నే మాట స్పష్టంగా వినిపించ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇప్పటికైనా మిగిలిన వారిని కాపాడుకుంటారో.. లేదా.. త‌మ‌కేమైంద‌నే భావంతో చూస్తూ ఊరుకుంటారో చూడాలి.

Tags:    

Similar News