సీన్ రివ‌ర్స్‌.. అవాక్కవుతున్న బాబు..ఏం జ‌రిగిందంటే?

ఓడ‌లు బ‌ళ్లు.. బ‌ళ్లు ఓడ‌లు.. అవుతాయ‌ని మ‌న పెద్దలు ఎప్పుడో చెప్పారు. అక్కడితో ఊరుకోలేదు..కాలం క‌లిసి రాక‌పోతే.. తాడు కూడా పామ‌వుతుంద‌ని పోరు పెట్టారు. ఏడాది కింద‌ట [more]

Update: 2020-06-11 11:00 GMT

ఓడ‌లు బ‌ళ్లు.. బ‌ళ్లు ఓడ‌లు.. అవుతాయ‌ని మ‌న పెద్దలు ఎప్పుడో చెప్పారు. అక్కడితో ఊరుకోలేదు..కాలం క‌లిసి రాక‌పోతే.. తాడు కూడా పామ‌వుతుంద‌ని పోరు పెట్టారు. ఏడాది కింద‌ట అప్పటి అధికార పార్టీ టీడీపీలో ఓ విష‌యంపై సీనియ‌ర్లు త‌ల‌లు ప‌ట్టుకున్నారు. ఎందుకండీ.. ఆయ‌నంత‌గా వ‌ద్దు.. వద్దని.. చెబుతున్నా.. మీరు మొండిగా ప‌ట్టుకుంటారు? అని నేరుగా పార్టీ అధినేత‌, అప్పటి సీఎం చంద్ర‌బాబును అడిగేశారు. లేదు.. అక్కడి నుంచి ఆయ‌నే పోటీ చేయాలి. ఎందుకు గెల‌వ‌రో నేను చూస్తాను. ఆయ‌న‌ను గెలిపించే బాధ్యత‌ను నేను తీసుకుం టాను! అని బాబు తెగేసి చెప్పేశారు. దీంతో అంద‌రూ సైలెంట్ అయ్యారు.

బాబు చెప్పబట్టే…?

ఆ విధంగా తాను వ‌ద్దని వారించినా… చంద్రబాబు బ‌లవంతం మేర‌కు చీరాల నుంచి అన్యమ‌న‌స్కంగానే పోటీకి దిగారు క‌ర‌ణం బలరాం. త‌ర్వాత ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు అదే క‌ర‌ణం బ‌ల‌రాం.. వైసీపీకి మ‌ద్దతిస్తున్నారు. స‌రే! రాజ‌కీయాలు అన్నాక‌..ఏ ఎండ‌కు ఆ గొడుగు ప‌ట్టాల్సిందే.. అని స‌రిపెట్టుకున్నా.. గ‌తంలో అధికారంలో ఉన్న ‌స‌మ‌యంలో చంద్రబాబు ఎలాంటి రికార్డు ప్లే చేయించారో.. ఇప్పుడు అదే రికార్డు మ‌న కరణం బ‌ల‌రాం కూడా ప్లే చేస్తున్నారు! అదీ ఇప్పుడు చిత్రం. గ‌తంలో వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు చెంత‌కు చేరిపోయారు.

సంక్షేమ పథకాలను చూసి…..

ఆ స‌మ‌యంలో చంద్రబాబు వారి నోటితో చెప్పించిన మాట‌.. చంద్రబాబు విజ‌న్‌.. చూసి, ఆయ‌న రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తున్న తీరు చూసి.. మేం బాబుకు మ‌ద్దతిస్తున్నాం.. అని మీడియా ను ఇళ్లకు పిలిచి మ‌రీ వాయించి వ‌దిలి పెట్టారు. ఇప్పుడు స‌రిగ్గా అదే సీన్‌.. క‌ర‌ణం బలరాం రిపీట్ చేశారు. ఏడాది పాలనలో సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నో గొప్ప సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారన్నారు. ఆయన పనితీరుకు మరింత మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు.

సంచలన వ్యాఖ్యలు చేసి…..

ఈ కారణంగా ఎంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు బయటకు వస్తారో ఇప్పుడే చెప్పలేమన్నారు. అధికారంలో ఉన్నప్పడు చంద్రబాబు నాయుడు ప్రజలను నిర్లక్ష్యం చేశారని, ఆయనపై టీడీపీ ఎమ్మెల్యేలకు ఎవరికీ నమ్మకం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు… ఇది చాల‌దా.. సీన్ రివ‌ర్స్ అయింద‌ని చెప్పుకోడానికి. చంద్ర బాబు ఏమంటారో చూడాలి. ఇదిలా ఉంటే అద్దంకిలో ద‌శాబ్దాలుగా ప‌ట్టున్న క‌ర‌ణం బలరాం గ‌త ఎన్నిక‌ల్లో చివ‌ర్లో అనూహ్యంగా చీరాల నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు. ఆయ‌న కుమారుడి రాజ‌కీయ భ‌విష్యత్తు కోస‌మే ఆయ‌న వైసీపీకి ద‌గ్గర‌య్యార‌న్న వార్తలు తెలిసిందే.

Tags:    

Similar News