Tdp : రేవంత్ తో ఢీ.. ఆయన ఆలోచనలకు చెక్

తెలంగాణలో టీడీపీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. నేతలు అందరూ పార్టీని వీడివెళ్లిపోయారు. అయితే ఇక్కడ చంద్రబాబు పార్టీని మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ఇక్కడ బలంగా ఉంటేనే ఏపీలో [more]

Update: 2021-11-08 11:00 GMT

తెలంగాణలో టీడీపీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. నేతలు అందరూ పార్టీని వీడివెళ్లిపోయారు. అయితే ఇక్కడ చంద్రబాబు పార్టీని మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ఇక్కడ బలంగా ఉంటేనే ఏపీలో రాజకీయాలు టీడీపీకి అనుకూలంగా మారతాయని అంచనా వేస్తున్నారు. అందుకే తమకు పట్టున్న ప్రాంతాల్లో పార్టీ నేతలు వీడిపోకుండా, అక్కడ కనీస స్థానాలను సాధించే లక్ష్యంతో పనిచేయాలని తెలంగాణ టీడీపీ నేతలకు సూచించారు.

కాంగ్రెస్ తో కలసి….

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా నియమితులు కావడంతో చంద్రబాబు కాంగ్రెస్ కూటమితో మరోసారి జట్టుకడతారని అందరూ భావించారు. కానీ రేవంత్ రెడ్డి కంటే ఏపీలో తన పార్టీ ముఖ్యమని భావించిన చంద్రబాబు బీజేపీతోనే జట్టుకట్టేందుకు సిద్ధమయ్యారు. ముందుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. ఇక్కడ బీజేపీ, జనసేనతో జట్టు కడితే అదే కాంబినేషన్ ఏపీలోనూ రిపీట్ అవుతుంది.

టి. బీజేపీ….

తెలంగాణ బీజేపీ నేతలు కూడా చంద్రబాబుతో పొత్తుకు సిద్ధంగానే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి నేతలు వెళ్లిపోయినా క్యాడర్, ఓటు బ్యాంకు బాగానే ఉందని భావిస్తున్నారు. తాము బలహీనంగా ఉన్న ఖమ్మం, నల్లగొండ వంటి జిల్లాల్లో టీడీపీతో పొత్తు తమకు బలం చేకూరుస్తుందని బీజేపీ నేతలు విశ్వసిస్తున్నారు. జనసేనను కూడా కలుపుకుని పోతే హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల్లో కూడా కొంత సానుకూల వాతావరణం ఏర్పడుతుందని భావించి, తెలంగాణ బీజేపీ నేతలు చంద్రబాబుతో పొత్తు పట్ల సానుకూలంగా ఉన్నారు.

కాంగ్రెస్ లోకి వెళ్లకుండా…

దీంతో రేవంత్ రెడ్డి తమ పార్టీ నేతలను కాంగ్రెస్ లోకి తీసుకెళ్లకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని తెలిసింది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన టీడీపీ నేతలకు ఫోన్ చేసి భవిష్యత్ ఉంటుందని, పార్టీలోనే కొనసాగాలని చంద్రబాబు భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఎన్నికల సమయానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చి కొంత హైప్ క్రియేట్ చేయాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారు. మొత్తం మీద రేవంత్ రెడ్డి ఆలోచనలకు వ్యతిరేకంగా చంద్రబాబు అడుగులు పడుతున్నాయన్నది వాస్తవం. ఇక్కడ పొత్తు కుదిరితే ఏపీలో సులువుగా అదే పొత్తుతో విజయం సాధించవచ్చన్నది చంద్రబాబు వ్యూహంగా తెలుస్తోంది.

Tags:    

Similar News