ఎందుకా దీర్ఘాలు….ఎందుకా శోకాలు?

నిజమే కనుచూపు మేరలో ఆశాకిరణం ఏదీ కనిపించడంలేదు. మరో వైపు చూస్తే పార్టీ చతికిలపడి ఏడాది అయినా కూడా కనీస కదలికలు లేకుండా పోయింది. నాయకుల తీరు [more]

Update: 2020-06-06 05:00 GMT

నిజమే కనుచూపు మేరలో ఆశాకిరణం ఏదీ కనిపించడంలేదు. మరో వైపు చూస్తే పార్టీ చతికిలపడి ఏడాది అయినా కూడా కనీస కదలికలు లేకుండా పోయింది. నాయకుల తీరు తలచుకుంటే ఏడుపు వస్తోంది. ఇంద్రుడు, చంద్రుడు అని అధికారంలో ఉన్నపుడు కీర్తించిన వారే ఇపుడు మెల్లగా సైడ్ అయిపోతున్నారు. వారసుడు అవుతాడు, గట్టిగా పక్కన నిలబడతాడు అనుకుంటే లోకేష్ ఇంకా బాల్యావస్థలోనే టైం పాస్ చేస్తున్నాడు. ఇవన్నీ చూసుకున్నపుడు చంద్రబాబుకు అసహనం కట్టలు తెంచుకోవడం సహజమే. దానికి తోడు ముదిమి వయసు కూడా మదిని కలవరపెడుతూంటే ప్రత్యర్ధి మీద తిట్ల పురాణం లంకించుకోవడమే మిగిలింది అంటున్నారు.

అలా జారుతూ ….

చంద్రబాబు రాజకీయాల్లో విలువలు గురించి చెబుతారు. అది ఎపుడు అంటే ఆయన అధికారంలో ఉన్నపుడు, చంద్రబాబు కోర్టు తీర్పుల గురించి కూడా చెబుతారు. విపక్షాలు కోర్టులకెక్కి తన పాలనను అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రిత్వం వెలగబెడుతున్నపుడు దాని మీద బాగానే గింజుకుంటారు. ఇక రాజకీయాలు ఎన్నికల వేళ మాత్రమే చేయాలని కూడా నీతి సూక్తులు వినిపిస్తారు. అది అధికారం ఉంటేనే. ఇక నాయకులు హుందాగా ఉండాలని, నోరుజారకూడదని ఆయన చెప్పే మాటే. అయితే ఇపుడు చంద్రబాబుకు ఇవన్నీ అసలు వర్తించవు. ఎందుకంటే ఆయన విపక్షంలో ఉన్నారు కాబట్టి ఎన్ని అయినా అనవచ్చు. ఎదుటివారు పడాల్సిందే.

బీహార్ తోనా…?

నిజానికి బీహార్ కూడా ఇపుడు బాగానే ఉంది. అక్కడ నితీష్ కుమార్ ఏలుబడిలో శాంతీ సౌఖ్యం బాగానే వర్ధిల్లుతున్నాయి. చెప్పుకోవాంటే దేశంలో మద్యపాన నిషేధం కూడా అక్కడే అమలుచేస్తున్నారు. అటువంటి బీహార్ తో ఏపీకి పోలిక చంద్రబాబు పెట్టారు. బాబు ద్రుష్టిలో కాంగ్రెస్ నాటి ఏలుబడిలో ఉన్న బీహార్ అనుకోవాలి. జంగిల్ రాజ్ అని రెండు దశాబ్దాల క్రితం అనేవారు. ఆ బీహార్ లా ఏపీ ఉందిట. ఏడాది జగన్ పాలనలో తెలుగువారు నవ్వులపాలు అయ్యారుట. ఇక జగన్ అసమర్ధ పాలనతో ఏపీ పరువే కాదు, దేశం పరువు కూడా పోయిందట.

దారుణమే…..

అధికారం లేకపోయేసరికి మరీ ఇంత దిగజారాలా బాబూ అంటున్నారు చూసినవారు, రాజకీయ విశ్లేషకులు. నిజానికి ఏపీలో గత ఏడాది పాలనలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయి. అవినీతి పాలనలో లేదు, బాగానే కట్టడి అయింది. కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులు, ఎమ్మెల్యేల పంచాయతీలు, మహిళా తాశీల్దార్లను జుట్టు పట్టి లాగి కొట్టడాలు అంతకంటే లేవు. అవన్నీ తన హయాంలో జరిగినపుడు బీహార్ గా ఏపీ మారుతోందని చంద్రబాబుకు తోచలేదు. ఏడాది పాటు అధికారం దూరమయ్యేసరికి మాత్రం దీర్ఘాలు తీస్తూ, శోకాలు పెడుతూ ఏపీ సర్వనాశనం అయిపోయిందని అంటున్నారు. ఇక జగన్ వల్లనే జాతీయ స్థాయిలో కూడా దేశ ప్రతిష్ట దెబ్బతిని కేంద్రానికి కూడా పెట్టుబడులు పుట్టడం లేదుట. మరీ జోక్ కాకపోతే బాబు ఇలా అనడమేంటి. నిజంగా జగనే జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారనుకుంటే ఇప్పటిదాకా కీర్తిస్తున్న మోడీ పలుకుబడి, పరువూ ఏమైపోయినట్లు. ఇలా లాజిక్ కి అందని విమర్శలు చేస్తూ చంద్రబాబు అధికార విరహాన్ని అనుభవిస్తున్నారని అంటున్నారు

Tags:    

Similar News