Chandrababu : షరతులు ఏవైనా సరే….చేతులు కలవాల్సిందేనట

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బీజేపీతో సయోధ్యకు చివరి నిమిషం వరకూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కేంద్రంలో అధికారంలో ఉండటంతో బీజేపీ అండ అన్ని రకాలుగా ఆయనకు [more]

Update: 2021-11-07 14:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బీజేపీతో సయోధ్యకు చివరి నిమిషం వరకూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కేంద్రంలో అధికారంలో ఉండటంతో బీజేపీ అండ అన్ని రకాలుగా ఆయనకు అవసరం. గత ఎన్నికల్లోనే ఆయన నిధులను నియోజకవర్గాలకు చేర్చేందుకు ఇబ్బంది పడ్డారు. తనకు సన్నిహితులైన వారు పార్టీకి నిధులు ఇవ్వకుండా ఐటీ, ఈడీ దాడులు జరగడంతో నిధుల కొరత గత ఎన్నికల్లోనే చంద్రబాబు ఎదుర్కొన్నారు.

కేంద్ర నాయకులతోనే…

అయితే ఈసారి ఖచ్చితంగా తనకు గెలుపు అవసరం కావడంతో బీజేపీతో మైత్రి ఆయనకు అవసరం. అందుకే ఆయన బీజేపీ నేతలు ఎన్ని మాటలన్నా, అపాయింట్ మెంట్ లు ఇవ్వకున్నా సర్దుకుపోతున్నారు. చివరి నిమిషంలోనైనా బీజేపీతో పొత్తు కుదురుతుందన్న నమ్మకం చంద్రబాబుకు ఉండటమే ఇందుకు కారణం. అందుకే బీజేపీ రాష్ట్ర నేతలను ఆయన పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. కేంద్ర నాయకత్వంతోనే ఆయన నేరుగా మాట్లాడే అవకాశాలున్నాయి.

బీజేపీని అప్పటి నుంచి….

2019 ఎన్నికలకు ముందు వరకూ బీజేపీపై కాలు దువ్విన చంద్రబాబు ఫలితాల తర్వాత మనసు మార్చుకున్నారు. మోదీతో తనకు వ్యక్తిగత విభేదాలు ఏమీ లేవని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాను వ్యతిరేకించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు. అప్పటి నుంచి పెట్రోలు, గ్యాస్ సిలెండర్లు ధరలు పెరుగుతున్నా, విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణ చేస్తామన్నా చంద్రబాబు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని పన్నెత్తు మాట అనలేదు.

మరోసారి ప్రయత్నాలు….

ఇక ఇటీవల ఢిల్లీ వెళ్లి కేంద్రం పెద్దలను కలుద్దామనుకున్నా వీలుపడలేదు. అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో ఆయన వెనుదిరిగి వచ్చారు. తర్వాత అమిత్ షా ఫోన్ చేయడంతో తిరిగి చంద్రబాబు లో ఆశలు పెరిగాయి. రెండు రోజుల క్రితం కూడా బీజేపీ పెద్దలతో చంద్రబాబు తరుపున కొందరు నేతలు మాట్లాడినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికలలో బీజేపీతో కలసి నడవాలనుకుంటున్నానని, షరతులు ఎలాంటవైనా పరవాలేదన్న సందేశాన్ని చంద్రబాబు పంపినట్లు పార్టీలో చర్చ జరుగుతుంది.

Tags:    

Similar News