Chandrababu : అందుకే అమిత్ షా ఫోన్ చేశారా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. అపాయింట్ మెంట్ కొన్ని సమావేశాల కారణంగా ఇవ్వలేకపోయానని చెప్పారు. అంతేకాదు తనను కలసి [more]

Update: 2021-10-28 03:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. అపాయింట్ మెంట్ కొన్ని సమావేశాల కారణంగా ఇవ్వలేకపోయానని చెప్పారు. అంతేకాదు తనను కలసి ఏం చెప్పాలో తెలపాలని అమిత్ షా ఫోన్ లోనే చంద్రబాబును కోరినట్లు టీడీపీ అనుకూల మీడియాలో వార్తలు వచ్చాయి. త్వరలోనే కలుసుకుందామని కూడా అమిత్ షా చంద్రబాబుతో అన్నట్లు కథనాలు వచ్చాయి. అయితే షా ఫోన్ చేయడానికి ప్రధాన కారణం బద్వేలు ఉప ఎన్నికేనట.

ఉప ఎన్నిక నేపథ్యంలో….

బద్వేలు ఉప ఎన్నిక ఈ నెల 30వ తేదీ జరగబోతోంది. తెలుగుదేశం పార్టీ బద్వేలు ఎన్నికలలో పోటీ చేయడం లేదు. దీంతో ఆ పార్టీ ఓట్ల కోసం ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం ఎవరికి ఓటు వేయాలన్నది చెప్పలేదు. స్థానిక నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు రెండు రోజుల పాటు మోదీ, షా ల అపాయింట్ మెంట్ కోసం పడిగాపులు గాచారు. వీలుకుదరక వెనక్కు తిరిగి వచ్చారు.

రాష్ట్ర నేతల విజ్ఞప్తితో…

దీంతో రాష్ట్ర బీజేపీ నేతలు పార్టీ అధిష్టానానికి చెప్పినట్లు తెలిసింది. అపాయింట్ మెంట్ ఇవ్వని కారణంగా టీడీపీ సానుభూతి పరుల ఓట్లు కాంగ్రెస్ కు వెళ్లే అవకాశముందని వివరించినట్లు చెబుతున్నారు. చంద్రబాబు పర్యటనతో తాము బద్వేలు లో ఇబ్బంది పడతామని కూడా వారు వేడుకున్నట్లు తెలిసింది. దీంతో అమిత్ షా నేరుగా ఫోన్ చేసి చంద్రబాబు ఢిల్లీ వచ్చిన ముఖ్య ఉద్దేశ్యాన్ని తెలుసుకున్నారంటున్నారు.

ఫోన్ కాల్ తర్వాత…?

బద్వేలు ఉప ఎన్నిక మాత్రమే చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ చేసేలా చేసిందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి కేంద్రంలో బీజేపీ నేతలు చంద్రబాబు తీరుపట్ల వ్యతిరేకంగా ఉన్నారని, బద్వేలు ఉప ఎన్నిక తర్వాత చంద్రబాబును మళ్లీ పట్టించుకోరని కూడా వారు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. మొత్తం మీద చంద్రబాబుకు షా ఫోన్ చేయడంతో బద్వేలు టీడీపీ క్యాడర్ లో కూడా ఉత్సాహం కన్పిస్తుందని, తమకే వారు ఓటు వేస్తారని బీజేపీ నేతలు సంతోషంతో ఉన్నారు.

Tags:    

Similar News