గుట్టు చెప్పేసుకున్న బాబు ?

చంద్రబాబు విచిత్రంగా కొన్ని సార్లు నిజాలు చెప్పేస్తూంటారు. ఎంతైనా ఆయన కూడా మనిషే కదా. ఎంత దాచుకున్నా కూడా ఎక్కడో ఒక చోట ఆయన నోరు జారి [more]

Update: 2020-06-03 03:30 GMT

చంద్రబాబు విచిత్రంగా కొన్ని సార్లు నిజాలు చెప్పేస్తూంటారు. ఎంతైనా ఆయన కూడా మనిషే కదా. ఎంత దాచుకున్నా కూడా ఎక్కడో ఒక చోట ఆయన నోరు జారి వాస్తవాలు అలా బయటకు వచ్చేస్తూంటాయి. పైగా ప్రస్తుతం పార్టీ ఉన్న తీరు, భారీ ఓటమి, కనుచూపు మేరలో కనిపించిని ధీమా ఇవన్నీ కలసి బాబుని కొంత నిస్సహాయునిగా మార్చేస్తున్నాయి. ప్రత్యర్ధుల మీద ఆయన మాటల దాడి మాత్రమే కాదు, వేదాంతాలు వల్లిస్తున్నారు. ఏదీ ఎవరికి శాశ్వతం కాదని పాత నీతులు చెబుతున్నారు. మహానాడులో చంద్రబాబు అన్న మాటలను ఒకసారి గుర్తుకుతెచ్చుకుంటే బాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అలా అనుకునేవారా అని ఆశ్చర్యం కలుగక మానదు.

అతి చేశారుగా…?

చంద్రబాబు జగన్ ని ఉద్దేశించి తాజాగా విమర్శిస్తూ అసలు గుట్టు చెప్పేశారు. పదవులు శాశ్వతం కాదు జగనూ అంటూ తన గురించి కూడా వల్లె వేసుకున్నారు. తాను కూడా ముఖ్యమంత్రి పీఠం శాశ్వతం అనుకునేవాడినని, కానీ అయిదేళ్ళకే దిగిపోయానని చంద్రబాబు వాపోయారు. జగన్ కూడా ఎపుడైనా దిగిపోతారు అన్న‌ సంత్రుప్తి నుంచి ఈ వేదాంతం పుట్టుకొచ్చిందో లేక తన చేదు అనుభవాన్ని వేదాంతానికి అన్వయించుకుని ఊరట చెందాలనుకున్నారో ఏమో కానీ బాబు ఇన్నాళ్ళకు, ఆయన ఇన్నేళ్ళ వయసుకు సరిపడే విధంగా మంచి మాటే చెప్పారని అంటున్నారు.

ఇంటి గుమ్మానికే….?

నిజంగా పదవులు ఎపుడూ ఎవరికీ శాశ్వతం కాదు, అసలు మాన‌వజీవితమే శాశ్వతం కాదు, కానీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎపుడు కుర్చీలో కూర్చున్నా కూడా అతి చేయడం మామూలేగా. ఆయన ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్నపుడు విజన్ 2020 అనేవారు. అంటే అన్నేళ్ళు సీఎంగా ఉండాలని ఆయన గారి కోరిక అన్న మాట. ఇక 2014లో మళ్ళీ సీఎం కాగానే విజన్ 2050 దాకా బాబు వెళ్ళిపోయారు. మరి దీన్ని ఏమంటారో బాబే చెప్పాలి మరి. ముఖ్యమంత్రి పదవిని తన ఇంటి గుమ్మానికే కట్టేసుకోవాలన్న స్వార్ధం బాబులో ఎపుడైతే వచ్చిందో అపుడే టీడీపీ పతనం మొదలైందని పార్టీ నేతలు ఆఫ్ ది రికార్డుగా అంటూంటారు. ఇక ఓడినపుడు వేదాంతాలు చెప్పడం, గెలిచాక తానే శాశ్వత సీఎం అని అహంభావం ప్రదర్శించడం చంద్రబాబుకు అలవాటేనని కూడా సెటైర్లు పడుతున్నాయి.

ఆ ఛాన్సులు ఉంటాయిగా..?

చంద్రబాబు వయసు డెబ్బయిల్లో పడింది కాబట్టి ఆయనకు ఇపుడు ఏదీ శాశ్వతం కాదని అనిపించవచ్చు, కానీ జగన్ అలా కాదు కదా, యువ ముఖ్యమంత్రి ఆయన. చంద్రబాబు ఏ రకమైన జనాకర్షణ లేకుండా పక్క వారి పార్టీని లాగేసుకుని మూడు సార్లు ముఖ్యమంత్రి అవగాలేనిది. జగన్ ఎందుకు కాకూడదని వైసీపీ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఇక జగన్ సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. అపారమైన జనాకర్షణ శక్తి ఉంది. రాజకీయాలు చేసేందుకు బోలెడు వయసు ఉంది. అందువల్ల జగన్ తానే శాశ్వతంగా ఏపీకి సీఎంగా ఉంటాయని ధీమా పడితే తప్పేముందని కూడా వైసీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు రాజకీయ యోగానికి మాత్రం ఇప్పటికైతే గ్రహణం పట్టిందన్న సంగతి ఆయన గ్రహిస్తే మంచిదని సూచిస్తున్నారు.

Tags:    

Similar News