జగన్ ని ఫాలో అవుతున్న బాబు ?

చంద్రబాబు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడే అయినా కొన్ని విషయాల్లో ఇతరులను అనుసరిస్తూంటారు. రాజకీయ ప్రత్యర్ద్జులు అయినా మేలైన ఫలితాలు రాబట్టి హిట్ అయ్యారంటే మనమూ అదే [more]

Update: 2020-06-02 03:30 GMT

చంద్రబాబు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడే అయినా కొన్ని విషయాల్లో ఇతరులను అనుసరిస్తూంటారు. రాజకీయ ప్రత్యర్ద్జులు అయినా మేలైన ఫలితాలు రాబట్టి హిట్ అయ్యారంటే మనమూ అదే రూట్లో వెళ్దామని చంద్రబాబు అంటారు. ఆ విషయంలో ఆయనకు ఎటువంటి ఆభిజాత్యాలు, శషబిషలూ లేవంటారు. వైఎస్సార్ పాదయాత్రతో అధికారంలోకి వచ్చారని తలచిన చంద్రబాబు తానూ పాదయాత్ర చేశారు. ఇక రైతులను వైఎస్సార్ ఆదరించారు, తాను కూడా చేయాలని మూడవ విడత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో కొంత వారిని ఆదుకున్నారు. ఇపుడు జగన్ ని చూసి కూడా చంద్రబాబు తన రూట్ మార్చుకుంటున్నారు. ముందుగా పార్టీలో సరికొత్త విధానాన్ని ఆయన అమలుచేయాలనుకుంటున్నారు.

పార్లమెంట్ పరిధిలో….

జగన్ 2014లోనే పార్లమెంట్ నియోజకవర్గానికో అధ్యక్షుడిని నియమించి వైసీపీలో కొత్త రాజకీయానికి జగన్ తెర తీశారు. అంతవరకూ రెవిన్యూ జిల్లాలకే అధ్యక్షులను నియమించడం ఆనవాయితీగా అన్ని పార్టీలు పెట్టుకున్నాయి. అయితే జగన్ ఆలోచనలు వేరు. ఆయన చూపు పాతిక జిల్లాల మీద ఉంది. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలని సంకల్పిస్తూ అప్పట్లో అధికారం లేకపోవడంతో కేవలం పార్టీలోనే సంస్థాగతంగా మార్పులు తెచ్చారు. అది బాగానే విజయవంతం అయింది. ఎందుకంటే మరింతగా వికేంద్రీకరణ జరిగి పార్టీ జనాల్లోకి వెళ్ళింది. దాంతో 2018 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ బంపర్ విక్టరీ కొట్టింది.

టీడీపీలోనూ అలాగేనా…?

ఇక తెలుగుదేశం పార్టీ కూడా అదే రూట్లో వెళ్లాలనుకుంటోంది. ఇప్పటివరకూ పదమూడు జిల్లాలకే పరిమితం అయిన టీడీపీ అధ్యక్షులు ఇకపైన రెట్టింపు సంఖ్యలో కనిపించబోతున్నారు. దాంతో చాలా మందికి పార్టీ పదవుల్లో అవాకాశాలు వస్తాయి. ప్రతిపక్షంలో పార్టీ ఉండడంతో ఎక్కువ మందికి పార్టీ పదవులు పంచేందుకు కూడా వీలు అవుతుంది. ఎక్కువ‌మందిని నియమించడం వల్ల వర్క్ డివిజన్ జరిగి పార్టీ మరింత సమర్ధంగా పనిచేస్తుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారుట. ఇది మంచి కాన్సెప్ట్ అని చంద్రబాబు జగన్ ఫార్ములాను ఈ సందర్భంగా చెప్పకనే అంగీకరించినట్లైందనుకోవాలి.

నమ్ముతున్నారా…?

చంద్రబాబు ఆలోచనలు జగన్ దూకుడుని చూసి ఇపుడు సాగుతున్నాయి. జగన్ అజెండాలో పాతిక జిల్లాల‌ ప్రతిపాదన ఉంది. కొంత ఆలస్యం అయినా కూడా కొత్త జిల్లాలను జగన్ ప్రకటిస్తారని కూడా చంద్రబాబు గట్టిగానే నమ్ముతున్నారని సమాచారం. అందుకే ప్రతీ ఎంపీ సీటుకు పార్టీ ప్రెసిడెంట్ ని పెడితే రేపటి రోజున‌ అవి జిల్లాలుగా మారినా ఇబ్బంది ఉండదని, అప్పటికే సంస్థాగతంగా కూడా పార్టీ బలపడుతుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారుట. ఇక్కడో విషయం చెప్పుకోవాలి. జగన్ తాను అంటే చేస్తారని చంద్రబాబు కూడా బలంగా విశ్వసించబట్టే పాతిక జిల్లాలకు పార్టీ నూతన కార్యవర్గాన్ని విస్తరించాలనుకుంటున్నారని చెబుతున్నారు. ఇది నిజంగా జగన్ పాలనకు చంద్రబాబు మార్క్ కితాబుగానే చూడాలి. తాను అధికారంలో అయిదేళ్ళు ఉండి కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేయలేని బాబు జగన్ ఆ పని చేస్తారని గట్టిగా నమ్మడం అంటే జగన్ మాట తప్పనితనం విధానాన్ని చంద్రబాబు కూడా అంగీకరించానుకోవాలేమో.

Tags:    

Similar News