చంద్రబాబు స్వయంకృతం…. ఇక కష్టకాలమేనా?

సుదీర్ఘ రాజ‌కీయ ప్రస్థానం ఉన్న పార్టీ రాష్ట్రంలో దాదాపు ప‌ద్నాలుగున్నర సంవ‌త్సరాల‌కు పైగా అధికారంలో ఉన్న పార్టీ టీడీపీ. ఆంధ్రుల ఆత్మగౌర‌వాన్ని దేశ‌వ్యాప్తంగా చాటిన పార్టీ టీడీపీ. [more]

Update: 2020-05-31 12:30 GMT

సుదీర్ఘ రాజ‌కీయ ప్రస్థానం ఉన్న పార్టీ రాష్ట్రంలో దాదాపు ప‌ద్నాలుగున్నర సంవ‌త్సరాల‌కు పైగా అధికారంలో ఉన్న పార్టీ టీడీపీ. ఆంధ్రుల ఆత్మగౌర‌వాన్ని దేశ‌వ్యాప్తంగా చాటిన పార్టీ టీడీపీ. అలాంటి పార్టీ గ‌త ఏడాది ముందు వ‌ర‌కు కూడా అధికారంలో ఉంది. రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత ఏపీలో చంద్రబాబు సీఎంగా పీఠం అలంక‌రించారు. ఈ క్రమంలో ఆయ‌న దూకుడు రాజ‌కీయాలు చేశారు. అదేస‌మ‌యంలో గ‌తంలో ప‌ది సంవ‌త్సరాలు పార్టీ ప్రతిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో పార్టీని మోసిన నాయ‌కుల‌కు విచ్చల‌విడిగా స్వేచ్ఛను ఇచ్చేశారు. దీంతో పార్టీలో నేత‌లు ఇష్టానుసారం వ్యవ‌హ‌రించారు.

జిల్లాకో నాయకుడు స్వేచ్ఛగా…

ఫ‌లితంగా టీడీపీ ప‌ట్టుత‌ప్పింద‌నే వార్తలు అప్పట్లోనే వ‌చ్చాయి. జిల్లాకో నాయ‌కుడు త‌న ఇష్టానుసారం వ్యవ‌హ‌రించారు. అంతేకాదు, అధినేత ఆదేశాల‌ను కూడా ప‌ట్టించుకోలేదు. ఇక‌, ఎన్నిక‌ల స‌మ‌యానికి పార్టీ ప‌రిస్థితి ఎలా మారిందో తెలిసిందే. బ‌ద్ధ శ‌తృవైన కాంగ్రెస్‌తో తెలంగాణ ఎన్నిక‌ల్లో చంద్రబాబు కూటమి క‌ట్టారు. దీనిని పార్టీలోనే కొంద‌రు జీర్ణించుకోలేక పోయారు. ఫ‌లితంగా చంద్రబాబు వీక్ అయ్యారు. అదే స‌మ‌యంలో ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు చేయ‌డం కూడా పార్టీలో ఆయ‌న ఇమేజ్‌ను స‌న్నగిల్లేలా చేసింది. దీంతో చంద్రబాబు చెప్పింది విన‌డానికి క‌ష్టప‌డిన నాయ‌కులు వాటిని ఆచ‌ర‌ణ‌లో పెట్టేందుకు మాత్రం ఇష్టప‌డ‌లేదు.

నాయకత్వంపై….

ఇక అర్హత లేక‌పోయినా త‌న‌యుడు లోకేష్‌కు బ‌ల‌వంతంగా రాజ‌కీయ వార‌స‌త్వం క‌ట్టబెట్టేందుకు ఆయ‌న్ను ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేయ‌డం ఇటు రాష్ట్ర ప్రజ‌ల‌కే కాకుండా సొంత పార్టీ నేత‌ల‌కే న‌చ్చలేదు. ఇక‌, ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. ఇక‌, ఎన్నిక‌ల అనంత‌రం పూర్తిగా చంద్రబాబు హ‌వా చ‌తికిల ప‌డింది. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన అనంతరం.. చంద్రబాబు వ‌య‌సుపైనా.. పార్టీ నాయ‌క త్వంపైనా తీవ్ర చ‌ర్చ సాగింది. ఇక‌, ఆయన నాయ‌క‌త్వం మార్పు కావాల‌నే నినాదం కూడా వెలుగు చూసింది. ఇక‌, పార్టీలో ద్వితీయ నేత‌గా లోకేష్‌ను స్వాగ‌తించ‌లేని ప‌రిస్థితులు ఏర్పడ‌డం కూడా చంద్రబాబు స్వయంకృత‌మే. ఈ విష‌యంలో విభేదించిన నాయ‌కులు కొంద‌రు మౌనంగా ఉంటే.. మ‌రికొందరు.. బ‌య‌ట‌కు వెళ్లిపోయారు.

సీనియర్లకు ఇబ్బందిగా….

ఇక ప్రధాన ప్రతిప‌క్షంగా టీడీపీ వేసిన అడుగులు కూడా 'ఇంకా చంద్రబాబు అధికారంలోనే ఉన్నాన‌ని అనుకుంటున్నట్టున్నారే!'- అనేలా అనిపించ‌డం వ్యంగ్యానికి కార‌ణ‌మైంది. స్వోత్కర్షల‌కు, ప‌ర‌నింద‌ల‌కు అవ‌కాశం ఇచ్చేలా ఆయ‌న వ్యవ‌హ‌రించార‌నేది ప్రధానంగా చ‌ర్చకు వ‌చ్చింది. ఇక‌, ఎన్నిక‌ల‌కు ముందు మోడీని నిలువునా చీరేస్తాన‌ని శ‌ప‌థాలు చేసిన చంద్రబాబు రెండు నెల‌లు కూడా గ‌డ‌వ‌కుండానే మోడీపై ప్రశంస‌లు కురిపించ‌డం గ‌మ‌నార్హం. ఇది కూడా పార్టీలో సీనియ‌ర్లను ఇబ్బందిలోకి నెట్టడ‌మే కాకుండా విమ‌ర్శలు వ‌చ్చేలా చేసింది.

నాలుగేళ్ల తర్వాత…..

ఇక‌, ఈ ఏడాది కాలంలో న‌లుగురు రాజ్యస‌భ స‌భ్యులను కాపాడుకోలేక పోవ‌డం.. అదే స‌మ‌యంలో ఉన్న ఎమ్మెల్యేల్లో .. ఎంద‌రు క‌డ‌దాకా నిలుస్తారో లేదో తెలియ‌ని ప‌రిస్థితిని ఎదుర్కొవ‌డం వంటివి చంద్రబాబు కు మైన‌స్‌గానే భావిస్తున్నారు. ఇప్పటికే న‌లుగురు ఎమ్మెల్యేలు హ్యాండివ్వగా.. మ‌రో ఇద్దరు ఎమ్మెల్యేలు రేపోమాపో సైకిల్ దిగుతున్నారు.ఇక‌, ఈ ఏడాది చివ‌రి నాటికి ఎంత మంది దిగిపోతారో చూడాలి. ఇలా మొత్తంగా ఈ ఏడాదిలో చంద్రబాబు వేసిన అడుగులు.. చేసిన నిర్ణయాలు.. పార్టీని దిగ‌జార్చాయ‌నేది మ‌హానాడు సంద‌ర్భంగా పార్టీ సానుభూతిప‌రులు వెలువ‌రించిన అభిప్రాయం. ఏదేమైనా.. వ‌చ్చే నాలుగేళ్ల త‌ర్వాత‌.. 2024 నాటికి.. పార్టీ ప‌రిస్థితిపై స‌ర్వత్రా ఆందోళ‌న వ్యక్తం అవుతుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News