మానసికంగా ఇబ్బంది పడుతున్నారా?

పధ్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు. సొంత రాష్ట్రానికి ప్రవాసిగా మారిపోయాడు. అప్పుడప్పుడు వచ్చి పోతున్నారనే ముద్ర పడిపోయింది. కేబినెట్ ర్యాంకులో ఉన్న ఆయన ఆంధ్రప్రదేశ్ లో [more]

Update: 2021-08-17 15:30 GMT

పధ్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు. సొంత రాష్ట్రానికి ప్రవాసిగా మారిపోయాడు. అప్పుడప్పుడు వచ్చి పోతున్నారనే ముద్ర పడిపోయింది. కేబినెట్ ర్యాంకులో ఉన్న ఆయన ఆంధ్రప్రదేశ్ లో స్థిరనివాసం ఉండటం లేదు. ఉమ్మడి రాజధాని అవసరం లేదంటూ తానే ఖాళీ చేసిన హైదరాబాద్ నే అంటిపెట్టుకుని నివసిస్తున్నారు. గతంలో ప్రతిపక్షనాయకుడు జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం అధికార పార్టీగా చాలా విమర్శలు గుప్పించేది. నవ్యాంధ్రప్రదేశ్ లో వసతులు లేకపోయినా చంద్రబాబు నాయుడు కష్టాలు పడుతున్నారు. జగన్ లోటస్ పాండ్ ను వదలడం లేదంటూ టీడీపీ ఆక్షేపించింది. దానికి చేతల్లో బదులు చెబుతూ చివరి రెండేళ్లు పాదయాత్ర రూపంలో జగన్ పూర్తిగా ప్రజల్లోనే ఉండిపోయారు. ఇప్పుడు ఆ సమస్య టీడీపీ అధినేతనే వెంటాడుతోంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అన్ని పార్టీల నాయకులు పార్టీ ప్రధాన కార్యాలయాల్లో పతాకావిష్కరణ చేశారు. ముఖ్యమంత్రులు అధికారిక హోదాలో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అందులోనూ ఇది అమృతోత్సవం. చంద్రబాబు నాయుడు మాత్రం అటు ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రధాన కార్యాలయానికి, ఇటు తెలంగాణలో ఎన్టీయార్ భవన్ కు కానీ వెళ్లలేదు. ఇంతటి కీలకమైన సందర్బంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఆంతరంగికంగా ఇంటికే పరిమితం కావడంపై భిన్నవాదనలు వినవస్తున్నాయి.

దూరం పెరిగింది…

వైఎస్సార్ కాంగ్రెసు ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షంపై తీవ్రమైన అణచివేతకు పాల్పడుతోంది. తెలుగుదేశం కూడా గతంలో వైసీపీపై రాజకీయ అస్త్రాలు ప్రయోగించింది. అయితే ఎక్కువగా కక్ష సాధింపు రూపంలో కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంది. వైసీపీలో బలమైన నాయకులకు తాయిలాల రూపంలో, పదవుల రూపంలో ఆకర్షించి పార్టీని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించింది. ఇప్పడు అదికార పార్టీ అటువంటి మెత్తని ఎత్తుగడలతో సరిపుచ్చడం లేదు. తాడోపేడో అన్నట్లుగా నాయకులను ఎక్కడికక్కడ కేసుల్లో ఇరికించేస్తున్నారు. న్యాయపోరాటాలకే టీడీపీ దిగువస్థాయి నాయకుల శక్తియుక్తులన్నీ సరిపోతున్నాయి. పార్టీ నుంచి మాట వరసకు మద్దతే తప్ప , ఆర్థికంగా, న్యాయపరంగా పోరాటానికి అవసరమైన దన్ను లభించడం లేదు. గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా చేసిన వారు సైతం సొంత జేబులోంచి డబ్బులు పెట్టుకోవాల్సి వస్తో్ంది అటువైపునుంచి చూస్తే కోట్ల రూపాయల వ్యయం, పెద్ద న్యాయవాదులతో కేసులు వీగిపోకుండా చేసుకునేందుకు ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడికి, ద్వితీయ శ్రేణి నాయకత్వానికి దూరం పెరిగిందనే భావన వ్యక్తమవుతోంది. ఆర్థికంగా, రాజకీయంగా అన్నిటా ముందుండే చంద్రబాబు నాయుడు తాజా పరిస్థితుల్లో పెద్దగా పట్టించుకోవడం లేదని పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

లోకేశ్ కోసమేనా..?

తెలుగుదేశం పార్టీ వారసుడు లోకేశ్ ను సాధ్యమైనంత తొందరగా పెద్ద నాయకునిగా చేయాలనేది చంద్రబాబు నాయుడి తలంపు. అయితే పార్టీ మొత్తాన్ని నడపగల సామర్థ్యం అతనికి ఉందని నాయకులు అంగీకరించలేకపోతున్నారు. ప్రతి విషయానికి చంద్రబాబు నాయుడిపైనే ఆధారపడుతున్నారు. లోకేశ్ పట్ల గౌరవం నటిస్తున్నారే తప్ప సమస్యలకు పరిష్కర్తగా చూడటం లేదు. పోరాటం చేసి పార్టీని ముందుకు తీసుకెళ్లగలరని వారు విశ్వసించలేకపోతున్నారు ఫలితంగానే అధినేతపై అదనపు భారం పడుతోంది. అటు తెలంగాణలో చూస్తే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చాలా వ్యవహారాలను సొంతంగా చక్కబెట్టేస్తున్నారు. అసలు కేసీఆర్ ను కలవడమే మామూలు నాయకులకు సాద్యం కావడం లేదు. అంతా కేటీఆర్ చేతుల మీదుగా జరిగిపోతోంది. అప్పుడప్పుడు కీలక సందర్బాల్లోనే కేసీఆర్ జోక్యం చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అందుకే లోకేశ్ ను క్యాడర్ కు అందుబాటులో ఉంచుతూ తాను కార్యక్రమాలను కుదించుకునే దిశలో చంద్రబాబు పావులు కదుపుతున్నారనే మరో వాదన కూడా వినవస్తోంది. అన్నిటినీ లోకేశ్ చూసుకుంటారనే భావన పార్టీలో నెలకొనాలనేది చంద్రబాబు యోచనగా చెబుతున్నారు. అందుకే ఏపీ లో పర్యటనలను కూడా బాగా తగ్గించుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఒత్తిడి లో…

తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు. రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితులు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం ఏనాడూ ఎదురుకానంత తీవ్రమైన దాడులు. జాతీయంగా అండగా నిలిచే ఒక్కపార్టీ కూడా లేకపోవడం, తెలుగుదేశం వ్యవస్థాపన తర్వాత ఇటువంటి దుర్భర పరిస్థితి ఏనాడూ ఎదురు కాలేదు. ఇదంతా చంద్రబాబు నాయుడి స్వయంకృతం. జాతీయ స్థాయిలో ఆయన విశ్వసనీయత కోల్పోయారు. బీజేపీ, కాంగ్రెసుల మధ్య దోబూచులాడి రాజకీయ జూదం ఆడారు. రెండు వైపులా దెబ్బతిన్నారు. బీజేపీ దూరం పెట్టింది. కాంగ్రెసుకు చంద్రబాబు నాయుడిపై నమ్మకం పోయింది. మమత, శరద్ పవార్ వంటి నాయకులు పట్టించుకోవడం మానేశారు. ఇది మానసికంగా చంద్రబాబు నాయుడిని కుంగదీసిందని పార్టీలో అగ్రశ్రేణి నాయకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ భవిష్యత్తు అనిశ్చితంగా కనిపించడంతో తల్లడిల్లిపోతున్నారంటున్నారు. ఏదేమైనా ప్రతిపక్ష నాయకుడు సొంత రాష్ట్రంలో నివాసం ఉండకపోవడం శ్రేణులను నైతికంగా దెబ్బతీస్తుంది. అందులోనూ కీలకమైన సందర్బాలలో పార్టీకి, తెలుగు జాతికి దిశానిర్దేశం చేయాల్సిన నాయకుడు కనిపించకుండా పోవడం విచారకరం. ప్రజాస్వామ్యానికే నష్టం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News