బెజవాడ సైకిల్ బ్యాచ్ బాబుకు సినిమా చూపిస్తుందా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు బెజవాడ తమ్ముళ్ల నుంచి ఫ్యూచర్ లో షాక్ లు తప్పేట్లు లేవు. గ్రూపులతో బెజవాడ టీడీపీలో గోల గోలగా ఉంది. అధికారంలో [more]

Update: 2021-07-28 00:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు బెజవాడ తమ్ముళ్ల నుంచి ఫ్యూచర్ లో షాక్ లు తప్పేట్లు లేవు. గ్రూపులతో బెజవాడ టీడీపీలో గోల గోలగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు కుక్కిన పేనుల్లా పడి ఉన్న నేతలు ఇప్పడు వీర విహారం చేస్తున్నారు. గ్రూపు మీటింగ్ లతో బాబుకు పిచ్చెక్కిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలని చంద్రబాబు ప్రయత్నిస్తుంటే సైకిల్ బ్యాచ్ మాత్రం చంద్రబాబుకు సినిమా చూపించేలాగానే ఉంది.

అధికారంలో ఉన్నప్పడు..?

బెజవాడ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బాగానే ఉంది. పదవుల విషయంలో కూడా ఒకే మాట మీద ఉండేది. చంద్రబాబు ఆదేశాలను తూచ తప్పకుండా అమలు పర్చేవారు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత మాత్రం తలలు ఎగరేస్తున్నారు. ఇప్పుడు బెజవాడ టీడీపీలో రెండు గ్రూపులు బలంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని, ఇతర నేతల మధ్య సయోధ్య సాధ్యం కావడం లేదు.

నాని నాయకత్వాన్ని…..

కేశినేని నాని తన పంధాలో తాను వెళుతున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్ మీరా తదితర నేతలు కేశినేని నానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. కేశినేని నాని నాయకత్వంలో పనిచేయబోమని కూడా వారు తెగేసి చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కేశినేనినానికి పార్లమెంటు టిక్కెట్ ఇచ్చినా తాము సహకరించే ప్రసక్తి లేదని బహిరంగంగానే వారు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇంటర్వెల్ మాత్రమే….?

కార్పొరేషన్ ఎన్నికల నుంచి ప్రారంభమయిన ఈ ఇంటర్నల్ వార్ కు ప్రస్తుతం ఇంటర్వెల్ పడిందని అనుకున్నా, ముగింపు కార్డు పడదని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. కేశినేని ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశానికి బుద్దా వెంకన్న వర్గానికి చెందిన కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. అలాగే పశ్చిమ నియోజకవర్గంలో కేశినేని నాని హాజరయ్యే కార్యక్రమాలకు కూడా రావడం లేదు. ఇది చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. రెండు వర్గాలు తగ్గేందుకు సిద్ధపడటం లేదు. మొత్తం మీద బెజవాడ సైకిల్ బ్యాచ్ బాబును బెంబేలెత్తిస్తుందనే చెప్పాలి.

Tags:    

Similar News